Share News

Nara Bhuvaneshwari: మీ ప్రేమాదరణలకు ధన్యవాదాలు

ABN , Publish Date - Jul 25 , 2025 | 01:50 AM

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూలై 19న విశాఖపట్నంలో నిర్వహించిన తలసేమియా అవగాహనా ర్యాలీ ప్రజల్లో నూతన చైతన్యాన్ని నింపింది.

Nara Bhuvaneshwari: మీ ప్రేమాదరణలకు ధన్యవాదాలు

న్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూలై 19న విశాఖపట్నంలో నిర్వహించిన తలసేమియా అవగాహనా ర్యాలీ ప్రజల్లో నూతన చైతన్యాన్ని నింపింది. తలసేమియా అనేది ఓ మానవీయ సమస్య. ఈ వ్యాధి బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో మా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన తలసేమియా ర్యాలీ, అత్యంత స్ఫూర్తిదాయకంగా, ప్రజల మనసులను తాకేలా విజయవంతంగా ముగిసింది. ఒక సామాజిక బాధ్యతగా, తలసేమియా వంటి జెనెటిక్ వ్యాధిపై అవగాహన పెంపొందించాలన్న లక్ష్యంతో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు, యువత, మహిళలు, డాక్టర్లు, సామాజిక సేవా కార్యకర్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం హర్షణీయం. ఇది మానవతా విలువలకు అద్దం పట్టే ఘట్టం. నిజమైన సామాజిక మార్పు అవగాహన నుంచే ప్రారంభమవుతుంది. ఈ అవగాహన ర్యాలీలో పాల్గొన్నవారు చూపిన సంఘీభావం, సహకారం తలసేమియా బాధితులకు ఒక ఆశాకిరణం అవుతుంది. జాతీయ స్థాయిలో ఉన్న తలసేమియా బాధితుల సంఖ్య చూస్తే, ఒక నిజమైన అవగాహన ఉద్యమం ఎంత అవసరమో అర్థమవుతుంది. కేవలం చికిత్స ద్వారా కాకుండా ముందస్తు పరీక్షల ద్వారా కూడా నివారించదగిన వ్యాధి తలసేమియా. దీనిపై సామాజికంగా చైతన్యం కలిగించాలన్న ఆవశ్యకతను ఎన్టీఆర్ ట్రస్ట్ గుర్తించి, ఎన్నో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.


మా బ్లడ్ బ్యాంక్‌లో చాలామంది అమ్మలు చిన్న పిల్లలను పెట్టుకొని వేచి ఉండేవారు. మీరంతా ఇక్కడ ఎందుకు వున్నారని నేను వారిని ప్రశ్నించాను. మా పిల్లలకు బ్లడ్ అవసరం, మాకు ఖర్చు అవుతుంది, అది మేం భరించలేం, తలసేమియా వ్యాధికి మీరు బ్లడ్, మందులు ఏమైనా సప్లై చెయ్యగలరా అని అడిగేవారు. అక్కడ నుంచి పుట్టుకొచ్చింది తలసేమియా పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆదుకోవాలన్న ఆలోచన. ఈ ట్రస్ట్ ద్వారా ఒక్క తలసేమియా వ్యాధికి మాత్రమే కాదు, పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు 8 లక్షల మందికి పైగా రక్తం అందించాం. ఆరోగ్య శిబిరాలు నిర్మించి, సంజీవిని క్లినిక్‌ల ద్వారా లక్షలాది మందికి ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. తలసేమియా అనేది జన్యుపరమైన రక్త సంబంధిత వ్యాధి. పిల్లల్లో ఎక్కువగా కనిపించే తీవ్రమైన రక్తహీనత. శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి సమర్థంగా లేని కారణంగా, ఈ వ్యాధిగ్రస్తులకు తరచూ రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు తలసేమియా క్యారియర్స్‌గా ఉన్నప్పుడే, శిశువుకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది నిర్ధారణ చేసే మార్గాలు ఉన్నప్పటికీ, అవగాహన లేకపోవడం వల్ల ఇది వ్యాప్తి చెందుతోంది. తలసేమియాను చిన్న పరీక్షతో నిర్ధారించవచ్చు. ఈ వ్యాధిని నిరోధించేందుకు అవసరమైన జాగ్రత్తలు తెలియచేయడమే విశాఖలో నిర్వహించిన ఈ ర్యాలీ ఉద్దేశ్యం.


తలసేమియా రోగులకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లాభాపేక్షలేని ప్రాతిపదికతో కీలకమైన సహాయాన్ని అందిస్తోంది. హైదరాబాద్‌లో 25 ప్రత్యేక బెడ్స్‌తో తలసేమియా కేర్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. మా ట్రస్టు బ్లడ్ షీల్డ్ ప్రోగ్రామ్ ఆర్థికంగా వెనుకబడిన తలసేమియా రోగులకు సురక్షితమైన రక్తం, ఫిల్టర్స్, మందులను ఉచితంగా అందిస్తుంది. ఇది పేదలు, అవసరమైన వారికి 81,610 యూనిట్లను ఇప్పటికే జారీ చేసింది. తలసేమియా బారిన పడిన పిల్లలకు సంవత్సరానికి ఒక బిడ్డకు అయ్యే ఖర్చు వివరాలు పరిశీలిస్తే– రక్త యూనిట్ల ధర రూ.51,000; ల్యూకో–ఫిల్టర్ ఖర్చు రూ.26,000; మందులు రూ.84,000; విటమిన్ సప్లిమెంట్లు రూ.20,000; వైద్య పరీక్ష ఖర్చు రూ. 32,000; ఇతరాలు (రవాణా, ఆహారం మొదలైనవి) రూ.37,000. సంవత్సరానికి సుమారుగా మొత్తం ఖర్చు రూ.2,50,000 అవుతుంది. ప్రతి తలసేమియా రోగికి సంవత్సరానికి 17 సార్లు రక్తమార్పిడి చేయాలి. ఈ పరిస్థితిని అధిగమించడానికి సాధారణ ప్రజలలో అవగాహన పెంచడం తప్పనిసరి. రేపటి తరాలకు ఆరోగ్యకరమైన జీవితం అందించాలన్నదే మా ఎన్టీఆర్ ట్రస్ట్ ధ్యేయం. ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రజలు చూపిన ఆదరణ, మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ‘రక్తదానం–ప్రాణదానం’ అనే సందేశంతో ముందుకు పోతూ ప్రతి జీవితం విలువైనదని గుర్తు చేస్తూ ఈ జ్ఞాపకాలను చిరకాలం మన హృదయంలో నిలుపుకొందాం. విశాఖ ఒక సముద్రతీర నగరం మాత్రమే కాదు, సమాజాన్ని ప్రేమించే హృదయాలతో నిండిన ప్రదేశం కూడా. తలసేమియా అవగాహనా ర్యాలీ విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

నారా భువనేశ్వరి ఎన్‌టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ

Updated Date - Jul 25 , 2025 | 01:50 AM