Language Policy: తెలుగుభాష ఇక్కట్లపై సమాలోచన సభ
ABN , Publish Date - May 02 , 2025 | 06:41 AM
తెలుగు భాష అభివృద్ధి కోసం సమాలోచన సభ నిర్వహించబడుతుంది, ఇది విద్య, పాలన, న్యాయ వ్యవస్థలలో తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వడంపై చర్చిస్తుంది. 5వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న ఈ సభలో ప్రముఖులు పాల్గొంటారు.
తెలుగుభాష ఇక్కట్లపై సమాలోచన సభ దశాబ్దాలుగా తెలుగు భాష వినిమయం, ప్రాభవం పెరగడానికి తీసుకోవలసిన చర్యలను ప్రభుత్వాలకు తెలుగుభాషాభిమానులు నివేదిస్తూనే ఉన్నారు. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ పెరుగుతున్న కొద్దీ విద్యలో తెలుగు ప్రాధాన్యత తగ్గిపోవడం, ‘మీరు తెలుగు చదువుతున్నారా’ అని అవమానకరంగా మాట్లాడటం అనుభవిస్తూ ఆందోళన పడుతున్నారు. జన వ్యవహారం వల్ల తెలుగుభాష సజీవంగా ఉంటుంది కావచ్చు. కానీ, ప్రపంచంలో అన్ని మాతృభాషలు కాలంతో పాటు ప్రగతిలో, ప్రామాణిక పదసంపద వృద్ధిలో ముందుండగా తెలుగు ఎందుకు విద్యలో, పాలనలో, న్యాయ స్థానాలలో తన స్థానం కోల్పోవటం అని విచారపడుతున్నారు. పూనిక వహించవలసిన ప్రభుత్వాలు తెలుగు ప్రగతికి ఒక విధానాన్ని ఎందుకు రూపొందించి అమలు చేయలేకపోతున్నాయని ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్న వారి వైఫల్యం వల్ల తెలుగు భాషకు ఇక్కట్లు తప్పడం లేదు. రాష్ట్రంలో విద్యలో అన్ని స్థాయిల్లో ఒక అభ్యసన విషయంగా తెలుగును ప్రవేశపెడతారని, ఒక విధానమంటూ రూపొందిస్తారని అందరూ ఆశించారు. కానీ ఓరియంటల్ కళాశాలలు, పండిత శిక్షణ కళాశాలలను మూసివేస్తున్నారు. సంస్కృతం ప్రవేశపెడుతూ అభ్యసనంలో ఏకంగా తెలుగునే కనుమరుగు చేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి తెలుగు భాషాభిమానులు, అధ్యాపకులు, కవులు, రచయితలు, చట్టసభల సభ్యులు పూనిక వహించవలసిన అగత్యం ఏర్పడింది. ఈ పరిస్థితిని చర్చించడానికి హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, దొడ్డి కొమురయ్య హాల్‌లో మే 3వ తేదీ ఉదయం పది గంటలకు సమాలోచన సభ జరగనున్నది. జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి చర్చను ప్రారంభిస్తారు. ప్రొ. జి.హరగోపాల్, గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, డా. శ్రీరంగాచార్య, మోతుకూరు నరహరి, డా. డి.చంద్రశేఖర్‌రెడ్డి, డా. నందిని సిధారెడ్డి, అల్లం నారాయణ, ప్రొ. పిల్లలమర్రి రాములు, కె.శ్రీనివాస్, యాకూబ్, ప్రొ. సాగి కమలాకర శర్మ, డా. సిల్మా నాయక్, వెల్దండి శ్రీధర్ తదితరులు చర్చలో పాల్గొంటారు.
– తెలుగు భాషాభిమానులు, తెలంగాణ