Telugu Language Issues: తెలుగుకు పట్టిన గ్రహణం
ABN , Publish Date - Apr 23 , 2025 | 02:54 AM
భారతదేశం గతంలో భాష, సాహిత్యం, విద్య, రాజకీయ పరిణతి ద్వారా ఎంతో గొప్పగా నిలిచింది. అయితే, ప్రస్తుతం తెలంగాణలో తెలుగు భాషకు ఎదురవుతున్న సమస్యలు, విద్యా విధానాలు, నైతిక విలువలు క్షీణించడంతో దేశంలో వివిధ మార్పులు సంభవిస్తున్నాయి
ఒకప్పుడు భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించిన దేశం భారతదేశం. సాహితీ సమాలోచనం, ప్రజ్ఞా ప్రాభవాలు, సామర్థ్య నిరూపణం, నైపుణ్యాలను ఒడిసి పట్టుకోవడం, విచక్షణా శక్తి, విమర్శనా జ్ఞానసంపత్తి, కార్యకారణ సంబంధమైన హేతుబద్ధ జ్ఞానం, ఆధ్యాత్మిక చింతనతో ప్రపంచ దేశాలలో మేటిగా నిలిచిన దేశం మనది. అటువంటి ఈ దేశానికి ఏమైంది? ఎటువైపు ప్రయాణిస్తున్నది? భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 ఏండ్లు గడిచినా ఒక నిర్దిష్ట పాలనా విధానం, విశిష్ట విద్యాపద్ధతి, విద్యార్థి శీలనిర్మాణం, సర్వాంగ సంపూర్ణ మూర్తిమత్వ నిర్దేశం, వైద్యవిధానం ఏదీ లేదు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకు దోచుకోవడం, దాచుకోవడం ఎక్కువైపోయింది. నీతి, నియమం, నిబద్ధత, నియంత్రణ, క్రమశిక్షణ మృగ్యమైపోయాయి. ఒక దేశ ఔన్నత్యానికి, ప్రాగల్భ ఉత్తేజాలకు, సాహిత్య సమారాధనకు, సంపత్తికి గీటురాయి భాష, భాషా సంపత్తి, వైదుష్యం. పదేండ్ల తెలంగాణ పాలన పటాపంచలయింది. తెలంగాణ యాసను భాషంటూ మతిభ్రమింపజేసి పబ్బం గడుపుకొని కాలం వెళ్లదీసుకుంది.
కాంగ్రెస్ పాలన వచ్చినా కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలతో అంటకాగి పరువు, ప్రతిష్ఠ లేకుండా అవే వాచకాలను కటింగ్, పేస్టింగ్ చేసి కొనసాగిస్తున్నారు. ఇది నీతి లేని చర్య, నియమం తప్పిన విధానం. విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించే పద్ధతి. ప్రపంచ దేశాలన్నీ ఒద్దికగా హద్దులు గీసుకొని ఎవరి మాతృభాషను వారు కాపాడుకుంటూ విద్యా వ్యవస్థను పటిష్ఠపరచుకుంటున్నారు. అమెరికాలో కూడా ప్రవాస భారతీయులు తెలుగు పరిరక్షణ దిశగా ‘మనబడి’ కార్యక్రమాన్ని కొనసాగించి మంచి ఫలితాలను గ్రహిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకొచ్చిన దరిద్రమేమిటి? ప్రత్యేకించి తెలంగాణకు పట్టిన గ్రహణమెప్పుడు వీడుతుంది? కన్నతల్లిని కాదని పిన్నమ్మకు బంగారు గాజులు చేయించినట్టు, ఇంటర్మీడియెట్ స్థాయిలో రెండవ భాషగా తెలుగును కాదని సంస్కృతాన్ని చేర్చడమేమిటి? మార్కులు మిన్న, నైపుణ్యాలు సున్న పద్ధతిలో విద్యాభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది? ఈ ఉపద్రవం నుంచి తెలుగుజాతి బయటపడి బట్టకడుతుందా? విజ్ఞులు ఆలోచించాలి.
– సరోజన బండ, వర్జీనియా, అమెరికా