Share News

ప్రపంచ సాహిత్యం సరసన తెలుగుకు గొప్ప అవకాశం

ABN , Publish Date - Mar 10 , 2025 | 01:13 AM

ఇటీవల ‘అమెరికన్ లిటరరీ ట్రాన్స్‌లేటర్స్ అసోసియేషన్’ తెలుగు అనువాదంపై ప్రారంభించిన వర్క్‌షాప్ గురించి చెప్పండి...

ప్రపంచ సాహిత్యం సరసన తెలుగుకు గొప్ప అవకాశం

మూడు ప్రశ్నలు

ఇటీవల ‘అమెరికన్ లిటరరీ ట్రాన్స్‌లేటర్స్ అసోసియేషన్’ తెలుగు అనువాదంపై ప్రారంభించిన వర్క్‌షాప్ గురించి చెప్పండి. ఈ వర్క్‌షాప్‌లో మెంటర్‌గా ఎంపికైన మీరు చేయాల్సిన పని ఏమిటి?

అమెరికాలో అనువాద సాహిత్యంపై దాదాపు యాభై యేళ్లుగా కృషి చేస్తున్న సంస్థ- అమెరికన్ లిటరరీ ట్రాన్స్‌టర్స్ అసోసియేషన్ (ఆల్టా – ALTA). ఈ సంస్థ వివిధ ప్రపంచ భాషల లోంచి ఇంగ్లీషులోకి వెళ్ళి తీరాల్సిన రచనల మీద దృష్టి పెడుతుంది. ఆయా భాషలకు సంబంధించి అమెరికాలో వున్న ప్రసిద్ధ రచయితలనీ, అనువాదకులనీ, అనువాదం పట్ల ఆసక్తి వున్న కొత్త తరం వాళ్ళనీ ఒక వేదిక పైకి తీసుకొచ్చి, వాళ్ళతో అనువాద శిబిరాలూ, ప్రచురణ కర్తలతో సమావేశాలూ, ఎడిటర్లూ, పత్రికల మధ్య సంభాషణలూ నిర్వహిస్తుంది. సంస్థ పనితీరు ప్రకారం ప్రతి ఏడాదిలో అనువాదకులు కనీసం ఒక పూర్తి రచనని ఇంగ్లీషులోకి అనువాదం చెయ్యాలి. ఆయా భాషల్లో ఇప్పటికే నిష్ణాతులైన ప్రసిద్ధులని మెంటర్స్ (పర్యవేక్షకులు)గా తీసుకుంటారు. వాళ్ళ పర్యవేక్షణలో అనువాదం పని సాగుతుంది. ఆల్టా సంస్థ నుంచి పర్యవేక్షకునిగా ఆహ్వానం అందటం నాకూ ఆశ్చర్యమే! ఆ సంస్థ నుంచి నాకు వచ్చిన ఈమెయిల్‌లో తెలుగు భాషకి సంబంధించి అమెరికాలో విశేషంగా వినిపిస్తున్న పేరు కాబట్టి పరిశీలనలోకి తీసుకున్నామని రాశారు. తరవాత నాకు అర్థమైందేమంటే- వాళ్ళు చాలా రకాలుగా సర్వేలు నిర్వహించి, అభిప్రాయాలూ సేకరించి ఈ పర్యవేక్షకులని నిర్ణయిస్తారని! వర్క్‌షాప్‌లో ఈసారి ఇద్దరు కొత్త అనువాదకులు ఎంపిక అయ్యారు. వారికి కావాల్సిన శిక్షణ ఇచ్చే బాధ్యతను ఈ సంస్థ నాకు అప్పజెప్పింది. ఈ ఇద్దరు కొత్త అనువాదకులు ఒక తెలుగు రచనని అనువాదం చేస్తారు. ప్రతి నెలా నేను వాళ్ళతో సమావేశమై, అనువాద సమస్యల్ని పరిష్కరించాలి. అలాగే, అనువాదం ఏడాదిలో పూర్తి చేయించే బాధ్యత నా మీద వుంటుంది.


తెలుగు నుంచి ఎలాంటి రచనలు అనువాదం కాబోతున్నాయి?

అరబిక్, హిందీ, ఫారసీ, బెంగాలీ, ఇండొనీషియా, చైనీస్, కొరియన్, జపనీస్ లాంటి అనేక భాషల నుంచి ఇప్పటికే ఈ సంస్థ ద్వారా ఎన్నో అను వాదాలు ఇంగ్లీషులోకి అందుబాటులోకి తెచ్చాయి. ఇన్నేళ్ల ఈ సంస్థ చరిత్రలో మొట్టమొదటిసారి తెలుగుని ఈ సంస్థ తమ జాబితాలోకి తీసుకుంది. కాబట్టి, ఈ సంస్థ కింద తెలుగు రచన అనువాదం ఇదే మొదటిసారి. కాని, మొదటి విడతలోనే కనీసం పది మంచి ప్రతిపాదనలు తెలుగు నుంచి అందాయి. అలా వచ్చిన అనువాద ప్రతిపాదనల్లో ముద్దుపళని పద్యాల నుంచి నగ్నముని విలోమ కథల దాకా వున్నాయి. అయితే ఆశ్చర్యంగా ఆధునిక తెలుగు కవిత్వం నుంచి దళిత కవిత్వం అనువాదాలు కూడా పరిశీలనకి వచ్చాయి, మిగిలిన ప్రతిపాదనల్లో మూడు పద్యకావ్యాలు, అయిదు కథల సంపుటాలూ, మరికొన్ని ఆత్మకథలూ వున్నాయి. ఒక ప్రసిద్ధ సినిమా కవి గురించిన ప్రతిపాదన కూడా వుండడం భిన్నంగా అనిపించింది. ప్రతిపాదనలు వచ్చిన తర్వాత ఒక కమిటీ మౌలిక పరిశీలన చేసి, తుది జాబితా నాకు పంపిస్తుంది. ఆ జాబితాలోంచి నేను ఆ ఏడాది అనువాదం కావలసిన తెలుగు రచనని ఎంపిక చేస్తాను. ఈ విధంగా ఒక పెద్ద సంస్థ ద్వారా మన భాష రచనలు ఇంగ్లీషులోకి వెళ్ళి, అంతర్జాతీయ స్థాయి పబ్లిషర్లూ, ఎడిటర్ల దృష్టికి వెళ్ళడం నా మటుకు నాకు అపూర్వమే అనిపించింది. ప్రతిపాదనలతో పాటు అయిదారు పేజీల ఇంగ్లీషు అనువాదం కూడా అనువాదకులు పంపించాలి కాబట్టి అవి చదివే అవకాశం కూడా నాకు దక్కింది. వీటి నాణ్యత నాకు ఆశ్చర్యం కలిగించింది. చక్కని అమెరికన్ ఇంగ్లీషులో ఈ అనువాదాలు వున్నాయి. నిజానికి ఇవన్నీ అనువాదాలు చేయదగినవే. నెమ్మదిగా వాటిలో ఒక్కొకటీ తీసుకుంటాం.


ఈ వర్క్‌షాప్‌ నుంచి మనం ఎలాంటి ఫలితాలను ఆశించవచ్చు?

ప్రతి ఏడాదికి తెలుగు రచన ఒకటి మొత్తంగా ఇంగ్లీషులోకి అనువాదం అవుతుంది. అనువాద ప్రతి తయారైన తరవాత అనువాదకులనీ, పర్యవేక్షకులనీ అమెరికాలో ప్రతి ఏడాదీ ఒక్కో నగరంలో జరిగే లిటరరీ ఫెస్టివల్‌కి పిలిపిస్తారు. ఈ ఫెస్టివల్‌లో కేవ లం రచయితలే కా కుండా అమెరికాలోని అంతర్జాతీయ స్థాయి ప్రచురణ కర్తలూ, వాటి ఎడిటర్లూ వస్తారు. అనువాదాల రీడింగ్ జరిగే సమయంలో వాళ్లందరినీ ఆహ్వానిస్తారు. రీడింగ్ తరవాత ఆ అనువాదం నచ్చితే ఎడిటర్లు, పబ్లిషర్లు, అనువాదకులతో పాటు నన్నూ చర్చలకి పిలుస్తారు. అనువాద రచన ప్రచురణ వైపు ఈ చర్చలు సాగుతాయి. అంటే, ఇలా ప్రతి ఏడాదీ ఒక తెలుగు రచన అమెరికాలోని ప్రసిద్ధ ప్రచురణ సంస్థ ప్రచురిస్తుందన్న మాట. ఇది చిన్న విషయమేమీ కాదు. ఈ విధమైన కృషి కొనసాగితే కొత్త అనువాదకుల తరం తయారవుతుంది. అనేక తెలుగు రచనలు ఇంగ్లీషులోకి వెళ్తాయి. అట్లా అనువాదమైన రచనల్ని ప్రపంచ స్థాయి అవార్డులకు పంపించే వీలు కూడా ఈ సంస్థ ద్వారా లభిస్తుంది.

అఫ్సర్‌

For Telangana News And Telugu News

Updated Date - Mar 10 , 2025 | 01:13 AM