Share News

Telangana Panchayat system: గ్రామ పంచాయతీ వ్యవస్థ గాడిన పడేనా

ABN , Publish Date - Jul 19 , 2025 | 02:19 AM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత కీలకమైన మన గ్రామ పంచాయతీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.

Telangana Panchayat system: గ్రామ పంచాయతీ వ్యవస్థ గాడిన పడేనా

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత కీలకమైన మన గ్రామ పంచాయతీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నట్లు దానికి అనేక కారణాలు ఉన్నాయి. 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ (టీపీఆర్ఏ) రూపకల్పన చేసుకున్నాం. ఈ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,791 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డ పంచాయతీలతో సహా, 634 మండల పరిషత్‌లు, 31 జిల్లా పరిషత్తులకు ఎన్నికలు జరుపుకున్నాం. ఇక స్థానిక సంస్థల అభివృద్ధి మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతుందని భావించాం.


కొత్తగా ఎన్నికైన సర్పంచులు కూడా పనులు చేయడంలో ఉత్సాహం చూపించారు. ఒక రకంగా మొదటి రెండు సంవత్సరాల కాలంలో అటు కేంద్రం విడుదల చేసే నిధులు, ఇటు రాష్ట్రం ఇవ్వాల్సిన గ్రాంట్లు సకాలంలో రావడంతో తెలంగాణలోని గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న భూములను వినియోగంలోకి తెచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీలో వైకుంఠ ధామం, క్రీడా ప్రాంగణం, డంపింగ్ యార్డ్, పంచాయతీ భవనాలు, రైతు వేదికలు నిర్మాణం చేశారు. ప్రతి పంచాయతీ ఒక వాహనం కొనుగోలు చేయటంతో పాటు గ్రామ పారిశుధ్య నిర్వహణకు గాను స్వల్పవేతనాలపై సిబ్బందిని నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శిని నియమించింది. పంచాయతీ స్థాయిని బట్టి వాహనాన్ని, పారిశుధ్య సిబ్బందిని నియమించారు. ఈ వ్యవహారం, హడావిడి చూసిన సర్పంచ్‌లు నిధులు సకాలంలో అందకపోయినా అప్పులు తెచ్చి ఉరుకులు పరుగులపై పనులు చేయించారు. మరికొందరైతే మరోసారి మనమే ఎన్నిక కాలేమా! అన్న ధీమాతో ముందస్తు ఖర్చు పెట్టారు. వరుసగా రెండేళ్లు కేంద్రం 80శాతం, రాష్ట్రం 20శాతం నిధులతో పంచాయతీ పాలన పైలాపచ్చీసులా నడిచింది. ఇక రెండేళ్ల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు చెడటంతో కేంద్రం నిధులు ఆలస్యంగా రావడం, రాష్ట్రం ఆ నిధులు దారి మళ్లించుకోవడం మూలంగా గ్రామపంచాయతీ పరిపాలన క్రమంగా అస్తవ్యస్తం అయ్యింది. నిధుల కొరత శాపంగా మారింది. పంచాయతీలకు రావాల్సిన 13వ ఆర్థిక సంఘం నిధులు, ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన నిధులు (పీఎంజీఎస్‌వై), రూరల్ కమ్యూనిటీ ప్రోగ్రాం (ఆర్‌సీపీ) నిధులు అందకపోవడంతో పెద్ద పంచాయతీ అయితే రూ.30 లక్షలు, చిన్న పంచాయతీ అయితే రూ.10 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉంది. పంచాయతీ నిధులు దారి మళ్లటం, కేంద్రం వాటా రాకపోవడంతో అప్పుల పాలైన కొందరు సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చూశాం. మూడేళ్ల కాలంగా తాము ఖర్చు చేసిన నిధుల కోసం ఎదురు చూస్తున్న సర్పంచ్‌ల భవితవ్యం అగమ్య గోచరంగా ఉంది. గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం 28 ఫిబ్రవరి 2024 నాటికి ముగిసింది. అంతకుముందు బీఆర్ఎస్ పరిపాలనలో రెండేళ్లు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిన్నరగా సర్పంచ్‌లు అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఒక్క పైసా బకాయిలు రాలలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏడాదిన్నర కాలంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం వలన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదల కావడం లేదు. ఎన్నికలు వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి.


ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రామాభివృద్ధి పద్దు క్రింద రూ.31,426 కోట్లు కేటాయించింది. ఇటీవలే పంచాయతీరాజ్ శాఖా మంత్రి ధనసరి సీతక్క ‘పల్లెప్రగతి’ పథకం కింద రూ. పదివేల కోట్లు గ్రామ పంచాయతీలకు విడుదల చేశారు. వీటిలో మాజీ సర్పంచ్‌ల బిల్లులు ఏ మేరకు చెల్లిస్తారో లేదో తెలియదు. కానీ, మళ్లీ తెలంగాణ కేబినెట్‌ ప్రకటనతో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వచ్చేసింది. అధికారులు బీసీలతో సహా రిజర్వేషన్ల తంతు పూర్తి చేస్తే, ఇక ఎన్నికల నిర్వహణ జరిగి, స్థానిక సంస్థలు బలపడతాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ‘పీసా’ చట్టం అమలు పరచకుండా అభయారణ్యం పేరుతో, నేషనల్‌ పార్క్‌ పేరుతో జీఓ 49 ప్రకారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 349 గ్రామాలను వాటి పరిధిలోకి తెస్తూ ప్రకటన చేయటం పట్ల అక్కడి గిరిజనుల నుంచి నిరసన వ్యక్తం అవుతున్నది. గత ప్రభుత్వ కాలంలోనే ఈ జీఓకు అంకురార్పణ జరిగినప్పటికీ, ఇప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణలో అమలు జరుపుతున్నాయని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇక గ్రామ పంచాయతీల్లో పర్యావరణ పరిరక్షణ, గ్రామ పారిశుధ్య కార్యక్రమం నిర్వర్తించడం కోసం ‘కార్బన హక్కులు’ పేరుతో ‘ఎకోలాజికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కేవలం లక్ష రూపాయల ఆర్థిక వనరు కలిగిన స్వచ్ఛంద సంస్థకు పంచాయతీ భూములను లీజు పేరుతో ఇవ్వాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ఆరోపణ నిజమే అయితే ఇది ఎంతమాత్రం అనుసరణీయం కాదు. గ్రామ పంచాయతీలలో స్వచ్ఛంద సంస్థల ప్రవేశం అంటే స్థానిక అధికార వికేంద్రీకరణలో ప్రభుత్వాలు వేలు పెట్టినట్టే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లాంటి వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాక, గత పరిపాలనా కాలంలో సర్పంచ్‌లకు చెల్లించాల్సిన నిధుల విషయంలో ప్రస్తుత పాలకులు పెద్ద మనసుతో ఆలోచన చేయాలి. అయితే మూడేళ్లుగా అస్తవ్యస్తంగా మారిన గ్రామ పంచాయతీ వ్యవస్థను గానీ, మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను గానీ దారికి తేవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. వచ్చే ఎన్నికలతోనైనా పంచాయతీరాజ్ వ్యవస్థ కుదుటపడాలని కోరుకుందాం.

-ఎన్. తిర్మల్ సామాజిక కార్యకర్త

Updated Date - Jul 19 , 2025 | 02:19 AM