Share News

Fee Regulation Committee: ఫీజులపై నియంత్రణ ఇంకెప్పుడు

ABN , Publish Date - Jun 06 , 2025 | 01:42 AM

2017లో నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫీజులపై నియంత్రణ కోసం ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. ప్రైవేటు పాఠశాలలు ఏడాదికి పది శాతం ఫీజులు మాత్రమే పెంచుకోవడం వంటి పలు సిఫార్సులను ఈ కమిటీ చేసింది.

Fee Regulation Committee: ఫీజులపై నియంత్రణ ఇంకెప్పుడు

2017లో నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫీజులపై నియంత్రణ కోసం ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. ప్రైవేటు పాఠశాలలు ఏడాదికి పది శాతం ఫీజులు మాత్రమే పెంచుకోవడం వంటి పలు సిఫార్సులను ఈ కమిటీ చేసింది. అయితే ఆ నివేదిక అమలుకు నోచుకోక ప్రభుత్వ పరిశీలనలోనే ఉండిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు నియంత్రణ కమిటీ వేస్తామని ప్రకటించినా, నేటికీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం.. కార్పొరేట్ స్కూళ్లు మొత్తం సీట్లలో 25శాతం పేద పిల్లలకు కేటాయించాలి. కానీ రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ విద్యాహక్కు చట్టాన్ని పట్టించుకోకుండా డొనేషన్, అడ్మిషన్ ఫీజులు, నోట్‌బుక్‌లు, యూనిఫాం రుసుములంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలతో కాకుండా తాము రూపొందించుకున్న పాఠ్యపుస్తకాల ద్వారా బోధన చేస్తున్నాయి. ఆ పుస్తకాలను తమ పాఠశాలల్లోనే కొనాలని చెబుతూ ప్రైవేట్‌ పాఠశాలలు ఫీజులకు, పుస్తకాలకు లింకు పెడుతున్నాయి. రాష్ట్రంలోని ప్రైవేట్‌ పాఠశాలలన్నీ తమ ఇష్టానుసారం ఫీజులు పెంచుకుంటున్నా, వాటిపై చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇష్టానుసారం అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని, ఈ విద్యా సంవత్సరం నుంచే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

– సొప్పరి నరేందర్ ముదిరాజ్

Updated Date - Jun 06 , 2025 | 01:48 AM