Share News

Political Drama: ఎవరి దేవుడు ఎవరికి దయ్యం

ABN , Publish Date - Jun 06 , 2025 | 01:49 AM

గత కొన్ని రోజులుగా వార్తలని దయ్యాలు ఆక్రమించాయి. బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, పార్టీ నాయకుడు అయిన కేసీఆర్ దేవుడనీ, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయనీ ప్రకటించి దయ్యాల్ని నిద్రలేపారు.

Political Drama: ఎవరి దేవుడు ఎవరికి దయ్యం

త కొన్ని రోజులుగా వార్తలని దయ్యాలు ఆక్రమించాయి. బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, పార్టీ నాయకుడు అయిన కేసీఆర్ దేవుడనీ, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయనీ ప్రకటించి దయ్యాల్ని నిద్రలేపారు. కేసీఆర్‌ చుట్టూ ఉన్న దయ్యాలు ఆయనను అవసరం ఉన్నవాళ్లు వెళ్లి కలువకుండా అడ్డుపడుతున్నాయని ఆమె ఆరోపణ. ఇంతకీ పార్టీ అధినేతను కలవకుండా అడ్డుకునేంత శక్తి ఆ దయ్యాలకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తి వెనక ఉన్న అదృశ్య శక్తులు ఏవి? అన్నవి సహజంగా పుట్టే ప్రశ్నలు. ఆ దయ్యాలను ఏ శక్తులు ప్రోత్సహించినా వాటిని దేబిరించాల్సిన అవసరం తనకేమీ లేదన్నది కవిత అంతరంగం కావచ్చు. దయ్యాల సంగతి వేరు. అవి వేదాలతో సహా వేటినైనా వల్లిస్తాయి. వాటికి ఆ స్వేచ్ఛ ఉంది. కానీ మనుషుల సంగతి, ముఖ్యంగా రాజకీయ నాయకుల సంగతి అలా కాదు కదా! వాళ్లకు బాధ్యతలుంటాయి. వాళ్లు మాట్లాడే పదాలకు ‘బరువు’లుంటాయి. అందుకే ఏ పదం వాడితే ఏ అర్థం వస్తుందో-, ఆపైన వాటి వెనక ఏ అంతరార్థం ధ్వనిస్తుందో కూడా వాళ్లకు కచ్చితంగా తెలిసి ఉండాలి. చెల్లెలు కవిత స్వంత పార్టీ పైకి విమర్శనా బాణాన్ని ఎక్కుపెడితే, అన్నయ్య కేటీఆర్ మాత్రం తన బాణాన్ని కాంగ్రెస్ పార్టీ వైపు గురిపెట్టి వదిలారు. ‘‘తెలంగాణకు పట్టిన దయ్యం’’ అంటూ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిని విమర్శించారు. ఒక్క కవితకే కాదు, ఏ పార్టీకైనా ఆ పార్టీ అధినేత దేవుడే అన్నది లోక రివాజు.


అలాంటి దేవుడిని పట్టుకొని దయ్యం అంటే ఏ పార్టీ నేతలైనా ఊరుకుంటారా! పొన్నం ప్రభాకర్, సీతక్క లాంటి మంత్రులు, -బల్మూరి వెంకట్, మహేష్ కుమార్‌గౌడ్ లాంటి ఇతర కాంగ్రెస్ నాయకులు కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఇంట్లో దయ్యాలను వదిలేసి ఇతర పార్టీ నేతలను దయ్యాలని తిట్టుడేమిటని దుయ్యబట్టారు. ఒక ఎంపీ అయితే కేసీఆర్ చుట్టూ చేరిన దయ్యాలపై ఏకంగా సీబీఐ ఎంక్వైరీ వేయించాలని డిమాండ్ చేశారు. దయ్యాల మీద ఎంక్వయిరీ చేయించే బిల్లును మన పార్లమెంటులో ప్రవేశపెట్టారో, లేక చర్చ లేకుండానే ఆమోదం పొందిన అనేకానేక బిల్లులలో అది కూడా ఉన్నదేమో మనకు తెలియదు. అసలు దయ్యాలపై దర్యాప్తు నిర్వహించే టెక్నాలజీ సీబీఐ దగ్గర ఉందా లేదా అన్నది ఎంక్వైరీలో తేలాల్సిన విషయం! అయితే నేటి కాలంలో సగటు దృష్టితో ఆలోచించినా దయ్యాలు అంత అర్థం కాని విషయాలేమీ కాదని ఇట్టే అర్థమవుతుంది. ఉదాహరణకు పాకిస్థాన్‌ పాలకుల చుట్టూ చేరిన మిలటరీ దయ్యాలు,- ‘ఆపరేషన్ సిందూర్’ వెలుగులో మనకు మునుపటికన్నా స్పష్టంగా అగుపిస్తున్నాయా లేదా? దయ్యమే దేవుడి స్థానంలో కూర్చుని దర్జా వెలగబెడుతున్న వైనం డోనాల్డ్ ట్రంప్ రూపంలో మన కళ్ళముందు కనిపిస్తూనే ఉంది కదా? కాబట్టి కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి కనిపించినట్టుగానే, రేవంత్‌రెడ్డికి కేటీఆర్ కనిపించవచ్చు. అందువల్ల ఎవరు దేవుడు? ఎవరు దయ్యం? ఎవరి దేవుడు ఎవరికి దయ్యం? అనే ప్రశ్నల పరంపర మీద చర్చల పరంపర ఎంతైనా కొనసాగనివ్వండి. చివరికి చూపును బట్టే రూపు. ఏది ఏమైనా, ఎవరు ఎవరికి దయ్యమైనా, ఎవరి దయ్యం ఎవరికి దేవుడైనా, ఏ దయ్యాలు ప్రజలకు అత్యంత హాని చేస్తున్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రతి ఒక్కరి పైనా ఉంది!

– గుండెబోయిన శ్రీనివాస్

Updated Date - Jun 06 , 2025 | 01:57 AM