Telangana Education: విద్యపై ఉపన్యాసాలు కాదు, కార్యాచరణ కావాలి!
ABN , Publish Date - Sep 18 , 2025 | 06:10 AM
విద్య కోసం ఏటా రూ.40వేల కోట్లు బడ్జెట్‌లో 13 శాతం ఖర్చు చేస్తున్నామనీ, కార్పొరేట్ కంటే నాణ్యమైన విద్యను అందిస్తామనీ, పేదలు చదువుకున్నప్పుడే రాష్ట్రం తలరాత మారుతుందనీ.....
విద్య కోసం ఏటా రూ.40వేల కోట్లు (బడ్జెట్‌లో 13 శాతం) ఖర్చు చేస్తున్నామనీ, కార్పొరేట్ కంటే నాణ్యమైన విద్యను అందిస్తామనీ, పేదలు చదువుకున్నప్పుడే రాష్ట్రం తలరాత మారుతుందనీ పెద్ద పెద్ద మాటలతో టీచర్స్ డే రోజు విద్యాశాఖ మంత్రి కూడా అయిన ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం ఆశాజనకంగా అనిపించినప్పటికీ, రాష్ట్రంలోని పాఠశాలల వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల భారంతో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో అరకొర వసతులతో, మారుమూల ప్రాంతాల్లో టీచర్ల కొరతతో అత్యధిక శాతం తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుపై నీడలు వాలుతున్నాయి. ప్రభుత్వం నుంచి అందుతున్న నాసిరకం విద్యతో తెలంగాణ బిడ్డలు ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధిబాట నుంచి వెలివేయబడుతారు. ఈ బిడ్డలంతా పేద అణగారిన వర్గాలకు చెందిన బిడ్డలని గుర్తించాలి. నిజాయితీతో కూడిన విద్యా కార్యాచరణ చేపట్టకపోతే ఈ బిడ్డలను సామాజిక న్యాయానికి దూరం చేసినవారమవుతాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి విద్య ఒక ప్రధాన ఎజెండాగా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, ప్రైవేట్ ఆధిపత్యం నుంచి తప్పిస్తామని హామీలు గుప్పించారు. కానీ పరిస్థితి విరుద్ధంగా మారింది. నేడు ప్రభుత్వ విద్య అంపశయ్యపై ఉన్నది. ప్రైవేటు విద్యా సంస్థలు మరింత బలపడ్డాయి. 2014–15లో ప్రభుత్వ పాఠశాలల్లో 28.4 లక్షల విద్యార్థులు ఉండగా, ఇప్పుడు 23.3 లక్షలకు పడిపోయారు. మరోవైపు ప్రైవేట్ పాఠశాలల్లో చేరిన పిల్లల సంఖ్య 29 లక్షల నుంచి 36.8 లక్షలకు పెరిగింది. తల్లిదండ్రులు నాణ్యత కోసం ప్రభుత్వాన్ని వదిలి ప్రైవేట్ వైపు వెళ్ళడం గమనార్హం. 2024–25 విద్యా సంవత్సరంలో ఒకటవ తరగతిలో చేరిన 6,62,134 మంది విద్యార్థుల్లో– ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరినవారు 4,79,402 మంది (72శాతం) కాగా, ప్రభుత్వ బడులలో చేరినవారు కేవలం 1,76,038 విద్యార్థులు (28శాతం) మాత్రమే! ఏటేటా ప్రభుత్వ బడులలో పిల్లల నమోదు తగ్గుతూనే వస్తున్నది.
కేంద్రం నిర్వహించిన 80వ జాతీయ శాంపిల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్) ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో విద్య కోసం కుటుంబాలు చేసే వ్యయం ఎంతో వెల్లడైనది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు విద్యా సంస్థలలో ఒక్కో విద్యార్థి కోసం సంవత్సరానికి రూ.35వేలు ఖర్చు చేస్తుండగా, పట్టణ ప్రాంతాలలో దాదాపు రూ.41 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హన్మకొండ జిల్లాలలో మొత్తం కలిపి 25 లక్షల మంది విద్యార్థులు నమోదు కాగా వారిలో దాదాపు 20 లక్షల మంది అంటే 80 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ప్రజలు పన్నులు చెల్లిస్తున్నా తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేట్ పాఠశాలల్లో ఖరీదైన విద్యను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధి చెందిన అమెరికా యూరప్‌లలో ఏ దేశంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు. ఇది విద్యా హక్కుపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు కూడా దారుణంగా ఉన్నాయి. ఈ మధ్య విడుదల చేసిన యుడైస్ 2024–25 ప్రకారం సైన్స్ లాబ్స్ ఉన్న పాఠశాలలు కేవలం 63 శాతం మాత్రమే. కంప్యూటర్లు 21 శాతం పాఠశాలలకే పరిమితం. స్మార్ట్ క్లాస్ రూమ్స్ 29 శాతం, లాప్‌టాప్‌లు 3శాతం పాఠశాలల్లోనే ఉన్నాయి. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. కొన్ని భవనాలు శిథిలమయ్యాయి. కొన్ని చోట్ల టాయిలెట్లు లేక విద్యార్థినుల అవస్థలు చెప్పజాలనివి. మధ్యాహ్న భోజనం వంట చేసే సంఘాలకు మెస్ బిల్లులు సరైన సమయంలో అందడం లేదు. గురుకులాల మెస్ బిల్లుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్థిక భారంతో సగంలోనే అనేక పనులు మధ్యలో ఆపేసిన విషయం తెలిసిందే. అత్యంత ఆందోళన కలిగించే అంశం అభ్యాస ఫలితాలు. 2024లో నిర్వహించిన పరఖ్ సర్వేలో తెలంగాణ విద్యార్థుల ప్రతిభ జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. మూడో తరగతిలో సగం మంది పిల్లలు కథ చదవలేకపోతున్నారు, ప్రాథమిక గణితం చేయలేకపోతున్నారు. ఆరవ తరగతిలో యూనిట్ల మార్పిడి, అత్యవసర పరిస్థితుల్లో స్పందన వంటి కనీస నైపుణ్యాల్లో కూడా బలహీనత కనిపిస్తోంది. తొమ్మిదో తరగతిలో శాతం లెక్కలు చేయగలిగినవారు కేవలం 25శాతం మాత్రమే. ఇది కేవలం పనితీరు లోపం కాదు, వ్యూహ రచన లోపం. భవిష్యత్తు తరాలను అజ్ఞానంలోకి నెట్టే కుట్ర– అనే అపవాదు మూట కట్టుకోకుండా ప్రభుత్వం తక్షణ కార్యాచరణకు దిగాలి. పలు రంగాల నిపుణులతో చర్చలు చేసి రూపొందించిన విద్యా కమిషన్ నివేదికల అమలుపై చర్చ జరగాలి. కమిటీల మీద కమిటీలతో కాలయాపన చేస్తే ప్రభుత్వ నిధులు వృథా తప్ప ఫలితం ఉండదు.
ఈ పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వడం తక్షణ కర్తవ్యం. అధిక విద్యార్థులు ఉన్న పాఠశాలలను మౌలిక వసతులు, లైబ్రరీలు, ల్యాబ్స్, డిజిటల్ సదుపాయాలతో బలోపేతం చేయాలి. పాఠశాలల్లో చట్టపరంగా ఉన్న తల్లిదండ్రుల పాత్రను వెంటనే పునరుద్ధరించాలి. పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీలను పునఃవ్యవస్థీకరించాలి. వెంటనే విద్యా అత్యవసర పరిస్థితిని ప్రకటించి, మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రత్యేక అభ్యాస కార్యక్రమాలు చేపట్టాలి. రాష్ట్ర బడ్జెట్‌లో విద్య ఖర్చును కనీసం 20శాతానికి పెంచాలి. ప్రైవేట్ పాఠశాలలను నియంత్రించి, ఫీజుల్లో పారదర్శకతను తేవాలి. యూపీఏ ప్రభుత్వ హయాంలో వచ్చిన విద్యా హక్కు చట్టం అమలుకు చట్టబద్ధ బాధ్యత వహించాలి. తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు నిజాలను నిక్కచ్చిగా చెప్పే అధికార యంత్రాంగం కావాలి. వారి నుంచి వాస్తవ పరిస్థితులను విని అర్థం చేసుకునే నాయకత్వం కావాలి. ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలం వృథా చేయకుండా, ధైర్యంగా నిజాలను ఒప్పుకుని నిర్ణయాలు తీసుకుని, విద్యను నిజమైన ప్రజా హక్కుగా అమలుచేయాలి.
-ఆర్. వెంకటరెడ్డి తెలంగాణ విద్యాకమిషన్ సలహాదారు