Share News

Ashok Gone Poem: త్యాగాల తల్లి

ABN , Publish Date - May 31 , 2025 | 12:55 AM

కుమురం భీమ్ నుండి విద్యార్థి ఉద్యమాల వరకూ, పోరాటాల పరంపరతో తెలంగాణ గర్వకారణంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ, అభివృద్ధికి సంకేతంగా మారింది.

Ashok Gone Poem: త్యాగాల తల్లి

ఉద్యమాల వీరులకు నెలవు నా తెలంగాణ

జల్ జంగల్ జమీన్ కొమురం భీముడిని

కన్ననేల నా తెలంగాణ

కాలికి గజ్జెకట్టి చేతిలో జెండాపట్టి

ఊరువాడను పల్లెపట్టణాన్ని ఏకం చేసిన

నేల నా తెలంగాణ

విద్యార్థుల ఆత్మబలిదానాల

చిరునామా నా తెలంగాణ.

బానిసత్వ సంకెళ్లను తెంచి

స్వేచ్ఛావాయువు ప్రసాదించిన రోజు

ఎతలన్ని దూరమై కన్నీళ్ళన్ని ఆవిరై

సంతోషాల నవ్వులు పూయించిన రోజు

పోరాటాల పాఠాలను

జనానికి ఎరుకజేసిన రోజు

విజయదరహాసాన్ని యావత్ తెలంగాణ

సమాజానికి తెలిపిన రోజు

త్యాగాల తల్లి సొంత రాష్ట్రమై వచ్చిన రోజు

అవతరణం అభివృద్ధి పరువులై సాగాలి

తెలంగాణ అవనిపై.

నీకోసం పెన్నులను గన్నులుగా సేసినం.

బళ్లు బందువెట్టి బతుకాగం జేసుకున్నాం.

లాఠీలకు తూటాలకు తనువంతా గాయాలు.

అందాలి యువకులకు అభివృద్ధి ఫలాలు.

సకలజనులం... సమ్మెకై

సమరశంఖాన్ని పూరించినం.

ఢిల్లీ పీఠాలను గడగడలాడించినం.

తిమిరాన్ని పోరాటాలతో చీల్చి...

పోరుబాటై వెన్నెలను కురిపించినం.

వీరుల ప్రాణత్యాగాలకు

పుట్టినిల్లు నీ నిలయం.

కళ్ళతో నినుచూసి...

సంబరాలను చేసుకున్నాం.

అందరికి అభివృద్ధి ఫలాలు అందితే...

అదే మాకు గర్వకారణం. తెలంగాణమా...

అందుకో మా శుభాకాంక్షలు.

– అశోక్ గోనె

Updated Date - May 31 , 2025 | 01:00 AM