Role of Journalists in Telangana: మే 31, తెలంగాణ
ABN , Publish Date - May 31 , 2025 | 01:06 AM
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు తమ ఉద్యోగ భద్రతకు ముప్పు ఉన్నా, నిష్పాక్షికతకు మించి ప్రజాభావాలను అర్థం చేసుకొని ఉద్యమానికి తోడుగా నిలిచారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ 25 ఏళ్ల ఉద్యమ చరిత్రకు ఇది రజతోత్సవ సంవత్సరం.
ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల్లో జర్నలిస్టులు పాల్గొనడం అంత సులభం కాదు. నిష్పాక్షికత, తటస్థత, రెండు ప్రాంతాలు, ఒక భాషా రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎటూ మొగ్గుచూపకుండా ఉండాలనేదే మీడియా సూత్రం. ప్రాంతీయ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర సంక్లిష్టమైనది. స్వంత అస్తిత్వపు తండ్లాట. జర్నలిస్టు మౌలికసూత్రాల పేరిట చెలామణిలో ఉన్న ఆధిపత్య భావజాలపు అనుకూలతల మధ్య ఒక జర్నలిస్టు బహిరంగంగా ఉద్యమంలో పాల్గొనడం అంటే కత్తిమీద సామే. తెలంగాణ ఉద్యమంలో ఈ కత్తిమీద సాము చేసినవారు, కలం కవాతులు నడిపినవారు తెలంగాణ జర్నలిస్టులు. మీడియా అంతా తమ చేతుల్లో లేకున్నా, తెలంగాణ భావనలకు, ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్నా, ఉద్యోగాలకు ముప్పు ఉందని తెలిసీ ఒక తెగువతో ఉద్యమించింది తెలంగాణ జర్నలిస్టులు. మే 31, 2001న తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ ఏర్పాటుచేసి తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొని ఒక చరిత్రను సృష్టించింది తెలంగాణ జర్నలిస్టులు. క్రియాశీలక పోరాటంలో 2001 తెలంగాణ సాధన దాకా ఒకే గొంతుకగా ‘తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు’ అని నిలబడడం ఒక చరిత్ర. ఏటికి ఎదురేగిన ఈ తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ ఉద్యమానికి ఇప్పుడు 25 సంవత్సరాలు. ఈ అపురూప ఘడియలకు జేజేలు. సామాజిక రాజకీయ మార్పులకు జర్నలిజం ఒక పరికరం. ఒక ఉత్ర్పేరకం. ఉద్యమం చుట్టూ, భావజాలవ్యాప్తిని, రక్షణ కవచాలను నిర్మించి ఉత్థానస్థితిలో నిలపగలవాళ్లు జర్నలిస్టులే. తెలంగాణ అస్తిత్వ ఔన్నత్యాన్ని, ప్రత్యేకతలను, ఆర్థిక దోపిడి, వివక్ష, అంతర్గత వలస పెత్తందారీతనాన్ని ఎత్తిచూపి తెలంగాణ ఉద్యమం ఎంత న్యాయబద్ధమైనదో తెలంగాణ జర్నలిస్టులు ఒక అభిప్రాయాన్ని సృష్టించగలిగారు. నిధులు, నీళ్లు, నియామకాల అన్యాయాలను తమ రాతల్లో ప్రతిష్ఠించగలిగారు. ఆ రకంగా ఉద్యమ భావజాలవ్యాప్తిలో గొప్ప పాత్ర నిర్వహించారు. అప్పటికే పాతుకుపోయిన యూనియన్లన్నింటికీ అతీతంగా, తెలంగాణ కోసం మాత్రమే కొట్లాడే విశాల భావనతో ఈ వేదిక ఏర్పాటయింది. పిడికెడు మంది జర్నలిస్టులతో ప్రారంభమై, 2014 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పదివేల మంది జర్నలిస్టు జాతరగా ఎదిగింది.
గ్రామీణ ప్రాంతాల విలేకరుల నుంచి, హైదరాబాద్ సంపాదకుల దాకా ఈ తెలంగాణ జర్నలిస్టు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ పాల్గొనని వేదిక లేదు, పాల్గొనని ఊరేగింపు లేదు. అన్ని జేఏసీలు, అన్ని వేదికలు, అన్ని రాజకీయ పార్టీలు ఒకే గొంతుకగా జర్నలిస్టు ఉద్యమం నడిచింది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర ముఖ్యమైనది. విద్యార్థుల ఐక్యతకు, నిర్బంధం వచ్చినప్పుడు వారి వెంట ధైర్యాన్ని నింపుతూ క్యాంపస్‌ల్లో కవాతులు నడిపించింది జర్నలిస్టులే. అదొక చరిత్ర. అదొక పోరాట ఔన్నత్యం. అదొక పోరాట ప్రతీక. అందుకే ఫోరమ్ ఏర్పడినప్పుడు తెలంగాణ జర్నలిస్టుల రాతలతో మే, 31 తెలంగాణ పుస్తకం తెచ్చాము. తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ ఏర్పడే నాటికి పరిస్థితులు పరిపక్వమై ఉన్నాయి. ఇంకొక ప్రయత్నం చేస్తే తెలంగాణ తథ్యం అనే వాతావరణం ఉండేది. అందుకే ఒక చిన్న కరపత్రంలో ‘ఔర్ ఏక్ ధక్కా.. తెలంగాణ పక్కా’ అనే ఘోషతో అది ప్రారంభమయింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో అదొక నినాదం అయింది. ఇక తెలంగాణ చల్లబడింది అన్నప్పుడు, రాజకీయ పార్టీలు, ఉద్యమ సంస్థలు, జేఏసీల మధ్య విభేదాలు పొడసూపినప్పుడు జర్నలిస్టు ఫోరమ్ జోక్యం చేసుకొన్నది. కేసీఆర్, గద్దర్ మధ్య అలాయ్ బలాయ్ చేయించింది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వామపక్షాలు, బీజేపీ అభిప్రాయాలకు అన్నింటికీ ప్రాతినిధ్యం వహించింది. నిర్బంధ వాతావరణంలో జర్నలిస్టులు ఉస్మానియా క్యాంపస్‌లో ఎంతో దన్నుగా రక్షణ కవచంగా నిలబడ్డారు. సింగరేణి కార్మిక ప్రాంతంలో నిర్బంధానికి వ్యతిరేకంగా ఒక గొప్ప యాత్ర చేపట్టి వేలాదిమందితో జర్నలిస్టుల ఫోరమ్ సమావేశాలు ఏర్పాటు చేసింది. ఉద్యోగుల సకలజనుల సమ్మెకు నైతిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. న్యాయవాదుల వెంట నడిచింది. విద్యావంతుల వేదికలో భాగస్వామ్యమైంది. గద్దర్ శాంతియాత్రలో, రసమయి ధూమ్‌ధామ్‌ల్లో మమేకం అయింది.అసెంబ్లీలో తెలంగాణ పదం నిషేధించినప్పుడు ఆంధ్రా అసెంబ్లీ మనకెందుకు? అని ఒక మాక్ అసెంబ్లీ ఏర్పాటుచేసి తెలంగాణ ప్రజాప్రతినిధులందరినీ ఒక తాటిపైకి తెచ్చింది.
హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమం మీద తీవ్ర నిర్బంధం అమలయినప్పుడు 144 సెక్షన్‌ను ధిక్కరించి అన్ని తెలంగాణ సంఘాలు, వేదికలను కలుపుకొని ఐదువేల మందితో గన్‌పార్క్ నుంచి సుందరయ్య విజ్ఞానకేంద్రం దాకా ఒక చరిత్రాత్మక ఊరేగింపు నిర్వహించింది.ఆర్టీసీ కళ్యాణ మండపంలో అన్ని పార్టీలను కూడగట్టి ఏకాభిప్రాయ సాధన కోసం గొప్ప సమావేశాన్ని నిర్వహించింది. తెలంగాణ కోసం నిరాహారదీక్షలు చేసింది. సకల జనుల సమ్మెలో, మిలియన్ మార్చ్‌లో, చలో హైదరాబాద్‌లో అన్ని ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమ రూపాల్లో ప్రత్యక్షంగా తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ పాల్గొన్నది. తెలంగాణ ఉద్యమం గురించి ఢిల్లీలో ఒక అభిప్రాయం ఏర్పరచడానికి, తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటిగా నిలబడ్డాయని చాటడానికి తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ ‘కలం కవాతు’ పేరిట యాత్ర జరిపింది. దాదాపు రెండువేల మంది జర్నలిస్టులు ప్రత్యేక రైలులో వెళ్లి, ఢిల్లీ పురవీధుల్లో తెలంగాణ నినాదం వినిపించారు. పార్లమెంటు భవనం పక్కన అద్భుతమైన ఒక సమావేశం జరిగింది. తెలంగాణ ఉద్యమంతో ఉన్న అన్ని పార్టీలు, సంఘాలు, మేధావులు, లాయర్లు, ఉద్యోగులు, విద్యార్థులు, జర్నలిస్టుల ఆ సభ ఒక చరిత్ర. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే ముందు రోజు అన్ని తెలంగాణ పార్టీలతో తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ ఒక హోటల్‌లో సమావేశం నిర్వహించింది. దాదాపు 56 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయిన ఈ సమావేశంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ సభ్యులు పాల్గొని, బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఐక్యంగా వ్యవహరించడానికి అంగీకరించి ఆ ప్రకారమే మరుసటిరోజు అసెంబ్లీలో వ్యవహరించారు. బిల్లుకు ముందు జర్నలిస్టుల ఫోరమ్ చొరవతో జరిగిన ఈ ఘట్టం కూడా ఎక్కడా నమోదు కాలేదు. ఇదీ కీలక ఘట్టం. 14 సంవత్సరాల పాటు అప్రతిహతంగా కొనసాగిన ఈ తెలంగాణ కలంవీరుల చరిత్ర లిఖించాలి. అందుకే పాతిక సంవత్సరాల ఈ చరిత్రను తలచుకుంటూ మే 31, 2025న రజతోత్సవాల ఆరంభసభ. అందరూ హాజరుకావలసిందిగా వినతి. తెలంగాణ అమరవీరులకు వినమ్ర నివాళి. ఇటీవలే మరణించిన మా జర్నలిస్టు ఫోరమ్ తెలంగాణ ఉద్యమకారుడు మునీర్‌కు కన్నీటి నివాళి.
- అల్లం నారాయణ
తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్
వ్యవస్థాపక అధ్యక్షుడు