Share News

School Enrollment: ప్రభుత్వ బడులను కాపాడుకోలేమా

ABN , Publish Date - Jun 12 , 2025 | 06:11 AM

తెలంగాణలో ప్రభుత్వ బడి రక్షణ కోసం, పిల్లలను ‘బడిబాట’ పట్టించడం కోసం ఉపాధ్యాయ సంఘాలు ప్రచార జాతలు, ఆటలు, పాటలు, మాటలతో ఇంటింటి ప్రచారం చేయడంలో తప్పులేదు. కానీ అవి ఎంత వరకు ప్రభుత్వ పాఠశాలలో నమోదు శాతం పెంచుతున్నాయనేదే ప్రశ్నార్థకం.

School Enrollment: ప్రభుత్వ బడులను కాపాడుకోలేమా

తెలంగాణలో ప్రభుత్వ బడి రక్షణ కోసం, పిల్లలను ‘బడిబాట’ పట్టించడం కోసం ఉపాధ్యాయ సంఘాలు ప్రచార జాతలు, ఆటలు, పాటలు, మాటలతో ఇంటింటి ప్రచారం చేయడంలో తప్పులేదు. కానీ అవి ఎంత వరకు ప్రభుత్వ పాఠశాలలో నమోదు శాతం పెంచుతున్నాయనేదే ప్రశ్నార్థకం. ఎందుకంటే.. విద్యార్థులు బడిలో చేరాలంటే భౌతిక, వాస్తవిక స్థితి ప్రధానాంశంగా ఉంటుంది. పాఠశాల క్యాచ్‌మెంట్ ఏరియా అనేది ముఖ్యమైన అంశం. ఒక పాఠశాల క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి ప్రభుత్వ పాఠశాలకు కాకుండా ప్రైవేటు పాఠశాల, రెసిడెన్షియల్ పాఠశాలలకు విద్యార్థులు వెళ్లడాన్ని ఎవరూ ఆపలేరు. ఎందుకంటే తల్లిదండ్రుల వెసులుబాటు, క్రమశిక్షణాయుతమైన విద్యనందించడం ఇక్కడ ప్రధానాంశాలు. అయితే ప్రభుత్వ బడిని అందుబాటులో ఉంచిన పాలకులు, దానిని ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దకపోవడం ఒక అంశమైతే, ప్రభుత్వ బడి క్యాచ్‌మెంట్ ఏరియాలో విచ్చలవిడిగా ప్రైవేటు పాఠశాలలను, వారి ట్రాన్స్‌పోర్టు సౌకర్యాలు అనుమతించడం మరో ఆలోచించదగిన అంశం. గురుకులాల పేరుతో విచ్చలవిడిగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసే బదులుగా ప్రభుత్వ బడినే రెసిడెన్షియల్ పాఠశాలగా మార్చితే బాగుండేదేమో. ప్రస్తుతం సామాజిక అవసరాలు తీర్చలేని అసౌకర్యపు పాఠశాలలుగా మన బడులు మారిపోయాయనిపిస్తోంది. చాలా పాఠశాలల్లో విద్యార్థులు టాయ్‌లెట్లు లేక ఇబ్బందులు పడుతుంటారు. సర్వశిక్షా అభియాన్ నిబంధనలు అనుసరించి కిలోమీటరు పరిధిలో ఒక ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల, ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల ఉండాలనే నియమం ఉంది. 2023–24 ప్రభుత్వ విద్యా గణాంకాల ప్రకారం తెలంగాణలో 30,022 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇన్ని పాఠశాలలు, ఇంతమంది బోధనా సిబ్బంది ఉన్నా గత ఏడాది ఆసర్ విద్యా నివేదిక ప్రకారం తెలంగాణ విద్యా సామర్థ్యాలు దారుణంగా పడిపోయాయి.


ప్రధాన కారణం విద్యను ప్రాధాన్య అంశంగా పట్టించుకోని పాలకవర్గాలు మాత్రమే అని అనిపించక మానదు. సరైన విద్యా ప్రణాళిక లేకపోవడం, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కొరత, విచ్చలవిడిగా ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇవ్వడం వంటివి ఎన్నో. ఏకీకృత పాఠశాల వ్యవస్థ ఏర్పాటు జరగలేదు. పాఠశాల బోధనా సిబ్బంది పంపకంలో కూడా శాస్త్రీయత లేదు. ప్రభుత్వ బడుల్లో బోధనా సిబ్బంది ఉన్నా విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. అదే, ఇరుకు భవనాల్లోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు కిక్కిరిసిన విద్యార్థులు ఉన్నా సామర్థ్యం కలిగిన బోధనా సిబ్బంది లేరు. ఇక రెసిడెన్షియల్ పాఠశాలలు తాత్కాలిక ఉపాధ్యాయులతో, అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. కొత్తగా వచ్చిన విద్యాహక్కు చట్టంతో పాటు, నూతన విద్యా విధానంలోని అంశాలు ఎంత వరకు పాఠశాలల్లో నెరవేరుతున్నాయనేది ప్రశ్నార్థకం. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నియమించిన తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వ పాఠశాల వైఫల్యం గురించి వివరిస్తూ.. రాష్ట్రంలోని సుమారు 13వేల ప్రాథమిక పాఠశాలల్లో 50మంది కంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారని తెలిపింది. ఇక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒకప్పుడు పాఠశాల ఏర్పాటు స్థలం, అభివృద్ధి గురించి ప్రజలు ఆలోచించేవారు. కానీ ప్రస్తుతం కార్పొరేట్ విద్యాసంస్థలు పట్టణాల్లో విచ్చలవిడిగా వెలసి విద్యా వ్యాపారం చేస్తున్నాయి. ఇంత దారుణమైన పరిస్థితిలో ప్రభుత్వ బడిని బతికించడం, ప్రైవేటు పాఠశాల నియంత్రణ ప్రస్తుత ప్రభుత్వం ముందున్న అత్యవసర కర్తవ్యాలు. ప్రభుత్వ పాఠశాలల పునరేకీకరణ, సిబ్బంది సర్దుబాటు తదితర విషయాల్లో ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ప్రభుత్వాలు అవేమీ చేయకుండా కేవలం పైపై లేపనాలతోనే సరిపెడుతున్నాయి. తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలను పటిష్ఠంగా అమలు చేయడం ప్రభుత్వం ముందున్న బాధ్యత. ఈ నివేదికలోని అంశాలు అమలు కావాలంటే నిధుల కేటాయింపు, ప్రణాళికేతర వ్యయంతో తప్ప మరో గత్యంతరం లేదు. ప్రభుత్వ బడుల భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలి. రాష్ట్రంలోని 9,517 అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేసి, పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టి సారించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని రుచితో, శుచితో విద్యార్థులకు అందజేయాలి. ఇలాంటి అనేక విధానాలను అమలుచేసినప్పుడే ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది.

-ఎన్. తిర్మల్ జర్నలిస్టు

Updated Date - Jun 12 , 2025 | 06:13 AM