Share News

Telangana IT Hub: ఐటీకి దిక్సూచిగా తెలంగాణ

ABN , Publish Date - Jul 01 , 2025 | 12:38 AM

ఒకప్పుడు ఐటీ అనగానే అందరికీ ఠక్కున మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాలు గుర్తుకొచ్చేవి. ఇప్పడు సీఎం రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశనంలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నాయకత్వంలో తెలంగాణే ఐటీకి దిక్సూచిగా ఎదిగింది. ముఖ్యంగా బెంగళూరు, పూణే, గుర్‌గావ్ లాంటి నగరాలను....

Telangana IT Hub: ఐటీకి దిక్సూచిగా తెలంగాణ

కప్పుడు ఐటీ అనగానే అందరికీ ఠక్కున మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాలు గుర్తుకొచ్చేవి. ఇప్పడు సీఎం రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశనంలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నాయకత్వంలో తెలంగాణే ఐటీకి దిక్సూచిగా ఎదిగింది. ముఖ్యంగా బెంగళూరు, పూణే, గుర్‌గావ్ లాంటి నగరాలను వెనక్కి నెట్టి ‘గ్లోబల్ ఐటీ హబ్’గా టెక్ దిగ్గజ సంస్థలకు హైదరాబాద్ ఆహ్వానం పలుకుతోంది. 2023–24లో దేశవ్యాప్తంగా ఐటీ ఎగుమతుల విలువ రూ.9.43 లక్షల కోట్లు. ఇందులో తెలంగాణ వాటా రూ.2.7 లక్షల కోట్లు. 2022–23తో పోలిస్తే 11.3 శాతం వృద్ధి సాధించింది. దేశ సగటు కంటే ఇది నాలుగింతలు ఎక్కువ. ప్రస్తుతం తెలంగాణ ఐటీ రంగంలో 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ‘తెలంగాణ సోషియో–ఎకనమిక్ అవుట్‌లుక్ 2025’ నివేదిక ప్రకారం రాష్ట్ర గ్రాస్ స్టేట్ వాల్యూయాడెడ్(జీఎస్‌వీఏ)లో సేవారంగం వాటా 66.3 శాతం. ఇందులో అధిక వాటా ఐటీ రంగానిదే. ప్రస్తుతం హైదరాబాద్‌లో 1500కు పైగా ప్రముఖ ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రపంచంలో 10 అత్యుత్తమ టెక్ దిగ్గజాల్లో ఏడు కంపెనీలు ఇక్కడ కొలువుదీరాయి. వీటిలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్, సేల్స్ ఫోర్స్ లాంటివి ఉన్నాయి. ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ చాలా ముందంజలో ఉంది. ఈ ఏడాది దావోస్ పర్యటనలో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలను చేసుకున్నారు. ఇందులో రూ.1.04 లక్షల కోట్లు ఐటీ, డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించినవే. షాద్‌నగర్‌లో మైక్రోసాఫ్ట్ రూ.16వేల కోట్లతో డేటా క్లస్టర్‌ను నిర్మిస్తోంది. ప్రపంచంలో నాలుగోది, భారత్‌లో మొదటి సేఫ్టీ ఇంజినీరింగ్ కేంద్రాన్ని గూగుల్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభించింది. 2023–24లో కొత్తగా 40వేల మందికి ఐటీ ఉద్యోగాలొచ్చినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.


హైదరాబాద్ ఇటీవల కాలంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు హబ్‌గా మారింది. ప్రస్తుతం 355 జీసీసీలు సుమారు 3.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వీటిలో 70 గతేడాదిలోనే ప్రారంభమయ్యాయి. దేశంలోని ఏ నగరం కూడా ఈ రికార్డును సాధించలేదు. ఇవన్నీ కేవలం బ్యాక్‌ ఆఫీస్ కార్యకలాపాలకు పరిమితం కావడం లేదు. ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, గ్లోబల్ ఉత్పత్తుల రూపకల్పన వంటి కీలక అంశాల్లో ఆర్ అండ్ డీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ జీసీసీలను గ్లోబల్ వాల్యూయాడెడ్(జీవీఏ) కేంద్రాలుగా, నూతన ఆవిష్కరణలకు అడ్డాగా మార్చాలని శ్రీధర్‌బాబు సంకల్పించి, ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను అమలు చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం కేవలం ఐటీ రంగం అభివృద్ధిపైనే కాకుండా ఈ రంగానికి కావాల్సిన అత్యుత్తమ మానవ వనరులను అందించే బాధ్యతను తీసుకుంది. ఈ ప్రక్రియలో ఐటీ దిగ్గజ సంస్థలను భాగస్వామ్యం చేసి, వారికి కావాల్సిన కరిక్యులమ్‌ను రూపొందించి విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ద్వారా సుమారు 10 లక్షల మందికి వివిధ అంశాల్లో శిక్షణ ఇప్పించారు. ఏఐ లాంటి అత్యాధునిక టెక్నాలజీని అనుసంధానం చేసి డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) ద్వారా సుమారు 4 లక్షల మంది పట్టభద్రులకు ఐటీ రంగంలోని ఉపాధి, కోర్సులపై మార్గనిర్దేశం చేస్తున్నారు.


అంతర్జాతీయ ప్రమాణాలతో గతేడాది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి, దేశానికే మోడల్‌గా నిలిచే నైపుణ్య శిక్షణను అందిస్తున్నారు. ‘ఐటీ అంటే హైదరాబాదే కాదు– తెలంగాణ మొత్తం’ అనేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లాంటి పట్టణాలు, నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించడంపై దృష్టి సారించింది. ఇప్పటికే నిర్మాణం పూర్తై ఖాళీగా ఉన్న ఐటీ టవర్లలో కొత్త కంపెనీలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. అసంపూర్తిగా నిలిచిపోయిన టవర్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తోంది. ఐటీ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించి, తెలంగాణను ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దేశంలో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యూబేటర్ ‘టీ–హబ్’, హార్డ్‌వేర్ ప్రోటోటైపింగ్‌కు దేశంలోనే అతిపెద్ద ల్యాబ్ ‘టీ–వర్క్స్’ మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ‘వీ హబ్’ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బలోపేతం చేస్తోంది. ప్రభుత్వ శాఖల్లో ఏఐ వినియోగాన్ని పెంచి, పౌర సేవలను సమర్థవంతంగా అందించేందుకు ‘టీ–ఎయిమ్’ పేరిట ప్రత్యేక మిషన్‌ను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో టీ హబ్ మార్గనిర్దేశనంలో ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి సమర్థవంతమైన నాయకత్వం, మంత్రి శ్రీధర్‌బాబు పకడ్బందీ కార్యాచరణ ఐటీ రంగ విప్లవానికి తెలంగాణను కేంద్రంగా మార్చాయి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2035 నాటికి ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేలా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ఈ లక్ష్య సాధనలో ఐటీ రంగాన్ని కీలకం చేసేందుకు భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడం అభినందనీయం.

పి. భానుచందర్‌రెడ్డి

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి పీఆర్వో

Updated Date - Jul 01 , 2025 | 12:40 AM