Telangana Land Issues: భూ భారతి తో దళితులకు మేలు జరిగేనా
ABN , Publish Date - May 01 , 2025 | 03:41 AM
తెలంగాణ భూ భారతి చట్టంలో సెక్షన్ 8 ద్వారా భూమి హక్కుల రికార్డుల్లో మార్పులు చేసుకోవాలని నిర్ణయించారు. ఈ కొత్త చట్టం పేదల భూముల రక్షణపై అనేక అనుమానాలు, ప్రశ్నలతో కూడుకున్నది.
గతంలో ‘మాభూమి’ పోర్టల్‌లో స్పష్టమైన టిప్పన్, సరైన అక్షాంశ–రేఖాంశాల ఆధారంగా రూపొందించిన ఖని బండల గుర్తులతో కూడిన భూడిజిటల్ భూపటాన్ని మాయం చేసిన ‘ఘనత’ ‘ధరణి’కి దక్కింది. తాజాగా, అందులోని కాడాస్ట్రల్ మ్యాప్ (ఒక నిర్దిష్ట ప్రాంతం ఆస్తి సరిహద్దులు, కొలతలు, యాజమాన్య వివరాలను సూచించే భూమి బ్లూప్రింట్) అదృశ్యం చేసిన ఘనత ఇప్పుడు ‘భూభారతి’కి దక్కుతోంది! ప్రభుత్వాలు రోజురోజుకీ ప్రజలకు ప్రభుత్వ రికార్డులను దూరం చేస్తున్నాయి. తెలంగాణ భూ భారతి చట్టంలోని సెక్షన్ 2, ఉప–సెక్షన్ (12)లోని క్లాజు(S) ద్వారా పొందిన అనుభవ హక్కుతో సెక్షన్ 8 ద్వారా భూమి హక్కుల రికార్డుల్లో మార్పులు అంటే మ్యుటేషన్ కోసం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో)కి దరఖాస్తు చేసుకోవటం అనే నిబంధన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మ్యుటేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆర్డీఓ నిర్ణయం తీసుకుంటారని చట్టం చెబుతున్నా, రికార్డులో మార్పును తిరస్కరించే ముందు దరఖాస్తుదారుడికి వివరణ ఇచ్చే అవకాశం కల్పించడం, ప్రభావితమయ్యే వారికి నోటీసులు జారీ చేసి, వారి అభ్యంతరాలను పరిశీలించాలనే నిబంధన ఆచరణలో ఎంతవరకు అమలవుతుందనేది ప్రశ్నార్థకం. ఈ ప్రక్రియ కేవలం కాగితాలకే పరిమితమైతే పేదలకు న్యాయం ఎలా జరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసైన్డ్, లావని పట్టా భూములు ఎవరి ఆధీనంలో ఉంటే వారు ఈ ఆర్‌ఓఆర్ పోర్టల్‌లో ఆర్డీఓకి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే, రికార్డుల్లో మార్పులు చేయవచ్చని ఈ సెక్షన్ 8 చెబుతోంది. ఆర్డీఓ ఈ దరఖాస్తులను ఎలా పరిశీలిస్తారు, గతంలోని రక్షణలను పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనేది ప్రశ్నార్థకం.
ఈ విధానం ద్వారా అసైన్డ్, లావని పట్టా భూములు సులువుగా పట్టా పొందే అవకాశం ఉంది. తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్– పీవోటీ) యాక్ట్, 1977 ప్రకారం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ బదలాయించడానికి వీల్లేదు. పేదల ఆర్థిక, సామాజిక భద్రత కోసమే ఈ పీవోటీ చట్టం చేశారు. కానీ, కొత్త చట్టంలోని సెక్షన్ 8లో ఆ భూముల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. బలహీనవర్గాల ప్రజలకు కేటాయించిన భూములు, ప్రభుత్వానికి చెందిన లావణి భూములు ఇతరుల చేతుల్లో ఉంటే, వారు ఈ సెక్షన్‌ను అడ్డుపెట్టుకుని రికార్డుల్లో మార్పులు చేసుకునే ప్రమాదం ఉంది. నోటీసులు జారీ చేసినప్పటికీ, చాలా మంది పేద ప్రజలకు తమ హక్కుల గురించి సరైన అవగాహన ఉండకపోవచ్చు లేదా అభ్యంతరాలు తెలిపేందుకు అవసరమైన వనరులు లేకపోవచ్చు. భూభారతి చట్టంలోని సెక్షన్ 2, ఉప–సెక్షన్ (12)లోని క్లాజు(S) ఆసరాగా చేసుకుని భూస్వాములు, ఇతర బడా వ్యక్తులు అసైన్డ్, లావని పట్టా, ప్రభుత్వ భూములను తమ పేరు మీదకు మార్చుకునే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వం కేవలం అభ్యంతరం తెలిపే అవకాశం ఇస్తామని చెబుతున్నప్పటికీ, నిరక్షరాస్యులైన, బలహీన వర్గాల ప్రజలు తమ భూముల హక్కుల కోసం ఎలా పోరాడగలరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చట్టంలోని చిక్కులు, నోటీసుల ప్రాముఖ్యత గురించి వారికి ఎంతవరకు అవగాహన ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనివల్ల అసైన్డ్ భూములు, తరతరాలుగా సాగుచేసుకుంటున్న లావని పట్టా భూములు అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భూ భారతి చట్టంలోని సెక్షన్ 8 పేదల భూములను పరిరక్షించాలనే ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. అసైన్డ్ భూముల విషయంలో ప్రత్యేక నిబంధనలు ఎందుకు చేర్చలేదనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. 1977 నాటి అసైన్డ్ ల్యాండ్స్ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి మార్పులు జరిగినా వాటిని తిరస్కరించేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసైన్డ్, ప్రభుత్వ భూములకు ప్రత్యేక రక్షణ కల్పించేలా నిబంధనలు చేర్చాలని, చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా జరిగే మ్యుటేషన్లను తిరస్కరించే అధికారం అధికారులకు ఉండాలని విశ్లేషకుల వాదన. సెక్షన్ 8 అమలులోకి వస్తే... పీవోటీ చట్ట స్ఫూర్తి దెబ్బతింటుంది. అంతేకాకుండా, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలకు కూడా ఇది విరుద్ధంగా మారే అవకాశం ఉంది. పేదల సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టానికి విరుద్ధంగా ఈ సెక్షన్ ఎలా అమలవుతుందో, అలాగే ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి. సెక్షన్ 8 అమలులో ప్రత్యేకంగా భూ భారతి చట్టంలోని సెక్షన్ 2, ఉప–సెక్షన్ (12)లోని క్లాజు(S) విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, గతంలో పేద ప్రజలకు కల్పించిన భూ హక్కులు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి, ప్రభుత్వం ఈ విషయంలో మరింత స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది.
డా. కట్కూరి