Indian scientific legacy: 80 వసంతాల భాభా దార్శనికత
ABN , Publish Date - Jun 01 , 2025 | 01:00 AM
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) 1945లో స్థాపించబడిన తర్వాత, భారతదేశంలో నాణ్యమైన శాస్త్ర పరిశోధనల పరిరక్షణలో ముందుండింది. డా. హోమీ భాభా నాయకత్వంలో, ఈ సంస్థ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రతిష్ఠాత్మకంగా నిలిచింది.
దేశంలో నాణ్యమైన శాస్త్ర పరిశోధనల కోసం ఒక సంస్థ అవసరముందన్న హోమీ జహంగీర్ భాభా ప్రతిపాదనకు అంగీకరించి, అందుకవసరమైన నిధులను ఇవ్వడానికి అంగీకరించింది సర్ దొరాబ్జి టాటా ట్రస్ట్. దీంతో 1 ఏప్రిల్, 1944లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) రూపుదిద్దుకుంది. ఈ సంస్థను బొంబాయిలో స్థాపించడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా ఉండటానికి ఉత్సుకత చూపడమే. ఆ తరువాత టీఐఎఫ్ఆర్ అద్దె భవనంలో జూన్ 1, 1945న ప్రారంభమయింది. అప్పటి నుంచి అద్దె భవనాల్లోనే పరిశోధనలు, కార్యక్రమాలు నిర్వహించేది. 1962లో ఈ సంస్థ కొలాబాలోని స్వంత భవనానికి మారింది. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ భవన ప్రారంభోత్సవం చేస్తూ ‘‘సంస్థను, సంస్థ ఉద్దేశాలను, ఈ సంస్థ స్థాపనకు మీ తపన, ప్రయత్నం చూసిన తరువాత, సంస్థ అద్భుతమైన ఫలితాలను సాధించగలదని విశ్వసనీయంగా చెప్పగలను’’ అన్నారు. ‘టీఐఎఫ్ఆర్’ని ప్రపంచ స్థాయిలో ప్రాథమిక శాస్త్ర పరిశోధనలకు నిలయంగా, అగ్రగామిగా ఉండాలని డా. భాభా కోరుకున్నారు. ముఖ్యంగా భారతదేశంలో నూతన శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలకు, విద్యా నైపుణ్యాన్ని పెంచడానికి దోహదకారిగా ఉండాలన్నది ఆయన ఆశయం. శాస్త్ర రంగంలో దేశ అవసరాలను తీర్చేందుకు ‘టీఐఎఫ్ఆర్’ ఒక ముందడుగు. గణితం, భౌతికశాస్త్రంతో పాటు ఇతర ప్రాథమిక శాస్త్రాల పరిశోధనలకు ఈ సంస్థ నిలయమైంది.
ప్రాథమిక సంవత్సరాలలో ముఖ్యమైన పరిశోధనా కార్యక్రమాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన శాస్త్రజ్ఞులను నియామకం చేసింది. రెండవ సంవత్సరం నుంచే దానికి ‘కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ద్వారా ప్రభుత్వ నిధులు అందసాగాయి. టీఐఎఫ్ఆర్‌లో భవిష్యత్తు అభివృద్ధి కోసం రూపురేఖలు (ఫ్లో చార్ట్) ఏమీ లేవు. హోమీ భాభా సముచిత ప్రజ్ఞావంతులను ఎంపిక చేసి, వారి పరిశోధనలకు కావలసిన అవకాశాలను, పని పరిస్థితులను కల్పించారు. మొదట నైపుణ్యం గల వ్యక్తులను ఎంపిక చేసి, తదనంతరం వారికి కావలసిన విభాగాన్ని స్థాపించి, అందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించేవారు. ఇందుకు ఒక ఉదాహరణ డా. భాభా, మైక్రో బయాలజిస్ట్ ఒబైద్ సిద్ద్దిఖీకి రాసిన ఉత్తరం. ‘‘ప్రస్తుతానికి ఈ సంస్థలో బయాలజీ సెక్షన్ లేదు. కానీ ఈ సంస్థ ప్రారంభం నుంచి కూడా నాకు ఇందులో బయోఫిజిక్స్, మైక్రో బయాలజీ డిపార్టుమెంట్ ప్రారంభించాలని ఉంది. దానికి సరిపోయిన వ్యక్తి కావాలి. మీరు ఇక్కడ కాని, ఆటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్‌మెంటులో కాని చేరాలని నా అభిలాష. మీకు కావలసిన వనరులు, పరికరాలు, మానవ సంసాధనాలు మొదలైనవి జీరో నుంచి మొదలు పెట్టాలి. మీకు ఏ విధమైన ఆర్థిక లోటూ ఉండదు. మీకు అవసరమైన పరికరాల, ఉపకరణాల జాబితా పంపండి. ఇక్కడ ఈ సంస్థలో కానీ, దేశంలో ఇతరచోట్ల లభ్యమేమో చూస్తాను, ఇక్కడ లభించనివి మీరు అక్కడి నుంచి కొని తెచ్చుకోమని నా సలహా. ఈ కొత్త డిపార్టుమెంటు త్వరలోనే ఏర్పడాలని ఆకాంక్షిస్తున్నాను. మీ ప్రయోగాలకి కావలసిన పూర్తి అవకాశం, స్వేచ్ఛ మీకు ఇవ్వబడతాయి.’’ నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ఇండియా, (తరువాతి కాలంలో ఇది ‘ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ’గా మార్పు చెందింది) 1963లో జరిగిన వార్షిక సమావేశంలో డా. భాభా మాట్లాడుతూ ‘‘భారతదేశంలో మనం నాణ్యమైన పరిశోధనా సంస్థలను ప్రభుత్వమే స్థాపించగలదని నమ్ముతాం.
ఒక సైంటిఫిక్ సంస్థ, అది ఒక ప్రయోగశాల కావచ్చు లేదా విద్యాసంస్థ కావచ్చు, దానిని మనం చాలా జాగ్రత్తగా ఒక చెట్టుని పెంచినట్లు పెంచాలి. అప్పుడే అది సరైన ఫలాలను (ఫలితాలను) ఇస్తుంది. ఇది అందరూ చేయలేరు. ప్రతిభావంతులకు మాత్రమే ఇదిసాధ్యం. కొన్ని సందర్భాలలో ఫలితాలు సాధించడానికి 10/15 సంవత్సరాలు పైనే పట్టవచ్చు’’ అంటారు. హోమి జె భాభా నాయకత్వం, ఆయన నిరంతర ప్రయత్నాల ఫలితంగా టీఐఎఫ్ఆర్ శాస్త్ర సాంకేతిక ప్రయోగాలకు ఆలంబనగా, అగ్రగామిగా నిలిచింది. దేశ శాస్త్ర సాంకేతిక వారసత్వానికి టీఐఎఫ్ఆర్ ఒక ప్రతీక. భారతదేశ శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి డా. భాభా, టీఐఎఫ్ఆర్ చేసిన సేవ ఎనలేనిది. 1945లో స్థాపితమైన టీఐఎఫ్ఆర్ ఎనిమిది దశాబ్దాల కాలంలో అత్యంత ప్రతిభావంతులైన శాస్త్రజ్ఞులను రూపొందించింది. గణిత శాస్త్రం, విజ్ఞానశాస్త్రంలోని అన్ని విభాగాలతో పాటు (భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం) కంప్యూటర్స్, అంతరిక్షం, విజ్ఞానశాస్త్ర బోధన క్షేత్రాలతో పాటు ప్రజారోగ్య రంగంలో కూడా పరిశోధనలు చేసింది. ఇందులో సుమారు 550 మంది శాస్త్రవేత్తలున్నారు. 250కి పైగా విద్యావేత్తలు, మిగిలినవారు శాస్త్రవేత్తలు. సుమారుగా 1500 మంది సిబ్బంది వివిధ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ఈ శాస్త్రజ్ఞులు 1. స్కూల్ ఆఫ్ నాచురల్ సైన్సెస్ (సహజశాస్త్రాల శాఖ), 2. స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ (గణిత శాస్త్ర శాఖ), 3. స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్సెస్ (సాంకేతికత, కంప్యూటర్ శాస్త్ర శాఖ)లలో తమ కార్యకలాపాలు సాగిస్తుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశోధనా కేంద్రాల్లో పరిశోధనా వసతులున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద రేడియో టెలీస్కోప్, ‘జైంట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్’ నారాయణ్ గాంవ్, పూణేలో పనిచేస్తుంది. కాస్మిక్ రే పరిశోధనాశాల, మరో స్థూపాకార రేడియో టెలీస్కోప్, తమిళనాడులోని ఊటీలో కార్యాచరణలో ఉంది. ‘‘హై ఎనర్జీ కాస్మిక్ కిరణాలు, గామా కిరణాల ప్రయోగశాలలు, మధ్యప్రదేశ్‌లోని పాంచ్‌మర్హిలో పనిచేస్తున్నాయి.
హైద్రాబాదులో ఉన్న టీఐఎఫ్ఆర్ ‘నేషనల్ బెలూన్ ఫెసిలిటీ’, ప్రపంచ స్థాయిలో అత్యుత్తమమైంది. ఈ బెలూన్ ఫెసిలిటీకి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే ఇది భూమధ్యరేఖ వద్ద, భూ అయస్కాంత క్షేత్రానికి సమీపంలో ఉండడం. టీఐఎఫ్ఆర్ గురుత్వాకర్షణ, జడత్వ భారం (ఇనెర్షియల్ మాస్) మధ్య బేధాన్ని కనుక్కోవడానికి ఒక అసాధారణమైన, సెన్సిటివ్ బాలన్స్‌ని (తరాజు) కర్ణాటకలోని, గౌరి బిధనూరులో నిర్మించింది. రీసెర్చ్ లాబొరేటరీస్ మాత్రమే కాక టీఐఎఫ్ఆర్‌లో సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ సెంటర్‌లో (ఎస్ఐఆర్సీ) 65 వేల పుస్తకాలతో పాటు లక్షకు పైగా పత్రికలు (జర్నల్స్) మైక్రో ఫిలిమ్స్ ఉన్నాయి. ఈ రిసోర్స్ సెంటర్ పూర్తిగా కంప్యూటరైజ్ చేయబడి ఆడియో–వీడియో, సీడీ సౌకర్యాలతో కూడి ఉంటుంది. శక్తివంతమైన సెంట్రల్ కంప్యూటేషనల్ సౌకర్యంతో పాటు పర్సనల్ కంప్యూటర్లతో కూడిన వర్క్ స్టేషన్స్, మానిటరింగ్, డేటా ఫెసిలిటీస్ కలిగి ఉంటుంది. టీఐఎఫ్ఆర్ చేసిన పరిశోధనల ఆధారంగా కొత్త జాతీయ సంస్థలను ఏర్పాటు చేశారు. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C–DAC), సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ (SAMEER) ఉదాహరణకు కొన్ని. ఈ సంస్థ సైంటిస్టులు, స్కాలర్లతో కూడిన అధ్యాపకులను తయారు చేస్తుంది. మొత్తంగా టీఐఎఫ్ఆర్ ప్రపంచంలోని అత్యుత్తమ పరిశోధనా కేంద్రాల్లో ఒకటి.
-పలకంశెట్టి జయప్రకాష్