Share News

Prakasham Pantulu Biography: ప్రజల కోసం ప్రకాశించిన జీవితం

ABN , Publish Date - May 20 , 2025 | 03:10 AM

తెలుగు భాషా సంస్కృతిని, స్వాతంత్ర్య పోరాటాన్ని పురస్కరించుకుని జీవించిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు. ఆయన ధైర్యం, క్షమ, మరియు పేదలకు అందించిన సేవలు రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచాయి.

Prakasham Pantulu Biography: ప్రజల కోసం ప్రకాశించిన జీవితం

దేశ స్వాతంత్ర్యం కోసం వీరోచితంగా పోరాడి, తర్వాత కూడా తమ జీవితాల్ని ప్రజాసేవకు అంకితం చేసిన వారు ఎందరో. అలాంటి వారిలో తెలుగు బిడ్డ, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ముందు వరుసలో ఉంటారు. ఆయన జీవితం తెరచిన పుస్తకం. ప్రకాశం పంతులు తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవి చూశారు. పదవుల కోసం ఆయన ఏనాడూ పాకులాడలేదు. పదవులే ఆయన్ను వరించాయి. నమ్మిన సిద్ధాంతాలను త్రికరణశుద్ధిగా ఆచరించారు. నేటి రాజకీయ నాయకులు చాలా మంది తరతరాలకు సరిపోయేంతగా ఆస్తిపాస్తులను సంపాదించుకుంటున్నారు. కానీ ప్రకాశం పంతులు ఇందుకు పూర్తిగా భిన్నం. తాను న్యాయవాదిగా సంపాదించిన రూ. లక్షల ఆస్తులను ప్రజల కోసం ఖర్చు చేశారు. లేమికి ఆయన ఎప్పుడూ చింతించలేదు. రాజకీయ రంగంలోనూ ప్రకాశం పంతులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ప్రకాశం పంతులు గొప్పతనం గురించి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇలా అన్నారు. ‘సాహసంతో స్వాతంత్ర్య జ్యోతిని వెలిగించిన దేశభక్తుల్లో ప్రకాశం పంతులు అగ్రశ్రేణిలో ఉంటారు. ముందు వెనుకలు చూడని ధైర్యం, దాతృత్వం ఆయన సొంతం. దేశం కోసం పోరాడేలా ఆయన తన అనుయాయుల్లో స్ఫూర్తిని రగిలించారు. ప్రకాశం పంతులు గొప్ప నాయకుడు’ అంటూ ప్రశంసించారు. ప్రకాశం పంతులు మరణానంతరం ఆనాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన సంతాప సందేశంలో... ‘‘1920 నుంచి ప్రకాశం పంతులు గారితో నాకు పరిచయం, సహచర్యం ఉన్నాయి. మేమిద్దరం సంపూర్ణంగా ఏకీభవించలేని సందర్భాలు ఉన్నా, ఆయన గుణసంపత్తిని నేను ఎప్పుడూ ప్రశంసాభావంతోనే చూసేవాడిని. ఆయనలో నిత్య జాగృతశక్తి ఉండేది. ప్రకాశం పంతులులో చైతన్యం, దీక్ష, కార్యదక్షతలు వయసుతో పాటు సన్నగిల్లలేదు. భారత రాజకీయాల్లో ఆయన ప్రభావం చెరగనిది. బ్రిటిష్ తుపాకులకు తన గుండెను చూపించిన సాహసి’’ అంటూ కొనియాడారు. తన సర్వస్వాన్ని దేశ స్వాతంత్ర్య సమరం కోసం త్యాగం చేసిన మహావ్యక్తి ప్రకాశం. చివరి దశలో తన కోసం ఒక రాగిపాత్రను కూడా మిగుల్చుకోలేదు. ఈనాటి రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.

– డా. పి.మోహన్ రావు

చైర్మన్, ప్రకాశం ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంటల్ స్టడీస్

(నేడు టంగుటూరి ప్రకాశం వర్ధంతి)

Updated Date - May 20 , 2025 | 03:10 AM