Handloom India: భారతీయ సంస్కృతీ వైభవ ప్రతీక చేనేత
ABN , Publish Date - Aug 07 , 2025 | 05:46 AM
మన దేశపు సాంస్కృతిక వైవిధ్యానికి, సుసంపన్న వారసత్వానికి ప్రతీక చేనేత రంగం. ఇది గ్రామీణ అర్ధ గ్రామీణ ప్రాంతాలలో లక్షలాది
మన దేశపు సాంస్కృతిక వైవిధ్యానికి, సుసంపన్న వారసత్వానికి ప్రతీక చేనేత రంగం. ఇది గ్రామీణ – అర్ధ గ్రామీణ ప్రాంతాలలో లక్షలాది కుటుంబాలకు ప్రధాన జీవనోపాధి వనరుగా ఉన్నది. ప్రకృతిలోనే పుట్టిన ఈ రంగం పర్యావరణానుకూల ఉత్పత్తి విధానాలను అనుసరిస్తూ, తక్కువ మూలధనంతో పనిచేస్తుంది. అంతేకాక, మారుతున్న ఫ్యాషన్ ధోరణులకు, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సృజనాత్మక మార్పులకు అవకాశం కల్పిస్తుంది. స్వాతంత్య్రానంతరం దేశంలో జరిగిన పారిశ్రామికీకరణ విధానాల మూలంగా టెక్స్‌టైల్ రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో చేనేత రంగం భారీ కుదుపులకు లోనైంది. ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహం లేక అత్యంత నైపుణ్యత కలిగిన అనేక మంది చేనేత కార్మికులు వివిధ ఉపాధి పనుల నిమిత్తం ఇతర రంగాలకు, ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. అయినప్పటికీ నేటికీ అనేక మంది తమ తరతరాల ఘన వారసత్వాన్ని నమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
భారతదేశంలోని ప్రతి ప్రాంతానికీ ప్రత్యేకమైన చేనేత పరంపర ఉంది. ప్రత్యేక రకాల వస్త్రాలను తయారు చేయడంలో ఆయా ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి. చేనేత పరిశ్రమ ఒక గృహ ఆధారిత పరిశ్రమ. దేశంలో లక్షలాది మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధిని అందిస్తున్నది. తక్కువ మూలధనంతో పర్యావరణహితమైన ఉత్పత్త్తులు ఈ పరిశ్రమను వేల సంవత్సరాలపాటు సజీవంగా నిలిపాయి. ప్రస్తుతం చేనేత పరిశ్రమ దాదాపు 3 లక్షలకు పైగా మగ్గాలతో దేశంలోనే అతిపెద్ద కుటీర పరిశ్రమగా ఉంది. ఈ రంగం మహిళా సాధికారతకు నేరుగా తోడ్పడుతున్నది. 2019–20 చేనేత జనాభా లెక్కల ప్రకారం ఈ రంగం గ్రామీణ ప్రాంతంలో రెండవ అతిపెద్ద ఉపాధిగా ఉంటూ, ప్రత్యక్ష, అనుబంధ కార్యకలాపాలలో సుమారు దేశవ్యాప్తంగా 35.22 లక్షలమంది చేనేత కార్మికులకు ఉపాధిని కల్పిస్తుండగా, వీరిలో 25.46 లక్షలమంది అంటే దాదాపు 72శాతం మంది మహిళలే ఉన్నారని ఈ లెక్కలు తెలుపుతున్నాయి.
తెలంగాణలో చేనేత రంగానికి గొప్ప చరిత్ర ఉన్నది. ఈ రంగంలో అనుబంధ కార్మికులు సహా 59,325 మంది చేనేత కార్మికులు ఉన్నారు. రాష్ట్రంలో 41,556 మరమగ్గాలు పని చేస్తున్నాయి. రాష్ట్రంలో కాటన్–259, సిల్క్–40 వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం లిమిటెడ్ పేరుతో ఒక అపెక్స్ సొసైటీ ఉన్నది. ఇక్కడి గ్రామాల్లో మగ్గాలపై నేసే వస్త్రాలకు ఖండాంతర ఖ్యాతి ఉంది. ఆయా ప్రాంతాలు ప్రత్యేకించిన కళాఖండాలుగా జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ సైతం సాధించాయి. ఇక్కడి పోచంపల్లి ఇక్కత్ పట్టుచీరకు 2003లోనే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ జారీ అయింది. తెలంగాణలోని గద్వాల, సిరిసిల్ల, నారాయణ్‌పేట్, దుబ్బాక ప్రాంతాలు సైతం అద్భుతమైన చేనేత వస్త్ర రూపాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత సంపాదించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఉప్పాడ, మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్, వేంకటగిరి జరీ చీరలు, ధర్మవరం సిల్క్ చీరలు, పెద్దాపురం పట్టు చీరలు, పొందూరు ఖాదీ వస్త్రాలు దేశవ్యాప్త ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అలాగే కర్ణాటక రాష్ట్రంలోని అనేక క్లస్టర్లు సంప్రదాయ డిజైన్లకు, సున్నితమైన కళలకు ప్రసిద్ధి. చిత్రదుర్గ జిల్లాలోని మోళకాల్మూరు చీరలు, బాగలకోట్ జిల్లాలోని ఇల్కల్ చీరలు దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించాయి. స్వాతంత్ర్య పోరాట కాలంలో మహాత్మాగాంధీజీ నాయకత్వంలో స్వదేశీ ఉద్యమం 1905 ఆగస్టు 7న ప్రారంభమైంది. ఇది దేశీయ పరిశ్రమలకు, ముఖ్యంగా చేతివృత్తి కార్మికులకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. దేశీయ సరుకుల వాడకాన్ని విరివిగా ప్రోత్సహిస్తూ గాంధీ గారు స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించిన ఆగస్టు 7నే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2016లో జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించి ఆ రంగానికి వెన్ను దన్నుగా నిలిచింది.
కేంద్ర ప్రభుత్వం 2025–26 సంవత్సర బడ్జెట్‌లో దాదాపు రూ.5,272 కోట్లను ప్రకటించి చేనేత రంగానికి అండగా నిలిచింది. చేనేత కార్మికుల పిల్లలకు నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలోనూ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారానూ విద్యా సౌకర్యం అందిస్తున్నది. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి సిల్క్ టై అండ్ డై, గద్వాల, నారాయణపేట్ తదితర కేంద్రాల అభివృద్ధికి, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వేల కోట్ల రూపాయలతో ఈ పరిశ్రమను అభివృద్ధి చేస్తోంది. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్, సిరిసిల్ల ఆపరేల్ పార్క్‌లో ఇంటెగ్రల్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం ద్వారా కేంద్రం 75శాతం, రాష్ట్రం 25శాతం చొప్పున నిధులతో చేనేత కార్మికులకు శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘మహాత్మాగాంధీ బంకర్ బీమా యోజన’ ద్వారా చేనేత కార్మికులకు ప్రమాద బీమాను కల్పిస్తోంది. ఈ పథకం నేతన్నలతో పాటు వారి మగ్గాలకు సైతం ప్రమాద బీమాను అందిస్తుంది. అలాగే ఈ పథకం ఆయా మగ్గాల ఫ్యాబ్రిక్ నాణ్యతను, ఉత్పాదకతను పెంచడానికి సాంకేతికతను అప్‌గ్రేడ్ చేయడంలో సహాయపడుతుంది. ‘హత్‌కర్ఘ సమ్వర్థన్ సహాయత (HSS)’ పథకం ద్వారా నేతన్నలకు కావలసిన మగ్గాలు, తదితర ఇతర పరికరాల కొనుగోలుకై ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ‘ప్రత్యక్ష నగదు బదిలీ’ ద్వారా చేనేత లబ్ధిదారులందరికీ నేరుగా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి అందనున్నది. నిజమైన చేనేత వస్తువులకు గుర్తుగా ‘చేనేత గుర్తు’ (హ్యాండ్లూమ్ మార్క్) ద్వారా వినియోగదారులకు నకిలీల బెడద నుంచి రక్షణ కల్పిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ముద్ర’ పథకంలోను చేనేత రంగానికి విరివిగా రుణాలు అందిస్తున్నది. కేంద్ర కార్మికశాఖ సైతం చేనేత కార్మికులకు ‘పెహ్‌చాన్’ (గుర్తింపు) కార్డులను అందజేసి వారికి వెనుదన్నుగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు రూ.400కోట్లను ఈ సంవత్సరం బడ్జెట్‌లో చేనేత రంగానికి కేటాయించింది. ప్రభుత్వం లక్ష రూపాయల లోపు చేనేత రుణాల మాఫీకి ముందుకురావడం ఎంతో శుభపరిణామం.
మన దేశంలో వ్యవసాయం తరువాత అతిపెద్ద ఉపాధి రంగం చేనేత రంగమే. ఈ రంగం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వాటి అవసరాన్ని బట్టి విధిగా చేనేత శాలువాలు, బ్లాంకెట్స్, బెడ్‌షీట్స్, టవల్స్ వాడాలనే నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉంది. తీవ్ర రుణ భారంతో సతమతమవుతున్న చేనేత రంగానికి దన్నుగా వడ్డీ లేని లేదా అత్యంత తక్కువ వడ్డీ గల రుణాలతో, గ్రాంటుల రూపంలోను, ఇతర సబ్సిడీలతో ప్రభుత్వాలు అండగా నిలబడాలి. ఇంతటి పోటీ ప్రపంచంలోనూ ‘చేనేత’కు ఆదరణ ఎంత మాత్రం తగ్గలేదు. కానీ చేనేత వస్త్రాలను తయారు చేయడానికి వాడే నూలు, రంగు తదితర ముడిసరుకులను ప్రభుత్వం సబ్సిడీ ధరలకు అందించినట్టయితే ఆయా ఉత్పత్తులు చౌకధరల్లో ప్రజలకి అందుబాటులోకి వస్తాయి. స్థానిక నేతన్నలు నేసిన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా అమ్మకాలు జరుపుకునేలా మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి. మారుతున్న కాలంతో పాటు మారిన అత్యాధునిక సాంకేతికతను చేనేత రంగానికి అందించాలి. నేటి సమాజంలో రాజకీయ నాయకులను, ఇతర అధికారులను శాలువాలతో సన్మానించే సంస్కృతి పెరిగింది. చేనేతతో చేసిన ఎంబ్రాయిడరీ శాలువాలని ప్రముఖలు సన్మానించే కార్యక్రమాల్లో విరివిగా వాడాలి. కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాలలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థలలో ఈ రకమైన శాలువాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి రాజకీయ నాయకుడు వారి రోజువారీ కార్యక్రమాలలో ఈ శాలువాలని ప్రోత్సహించాలి. పైకి చిన్నగా కనబడుతున్నా ఈ చేనేత శాలువాల విలువ దేశవ్యాప్తంగా దాదాపు రూ.1200 వందల కోట్లని ఒక అంచనా. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో చేనేత రంగానికి విశేష సేవలందించి గుర్తింపు తెచ్చిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని మనందరం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన చేనేత వారసత్వాన్ని కాపాడుకుంటూ మనం అందరం కూడా స్వయంగా చేనేత వస్త్రాలను విరివిగా వాడుతూ ఈ రంగం నిలబడటానికి కృషి చేయడమే చేనేత రంగానికి మనం చేసే నిజమైన సేవ.
-బండారు దత్తాత్రేయ మాజీ గవర్నర్