Sanitation Campaign: స్వచ్ఛభారత్ స్ఫూర్తికి మూలపురుషుడు
ABN , Publish Date - Feb 22 , 2025 | 05:51 AM
‘సెంట్రల్ రూరల్ శానిటేషన్ ప్రోగ్రామ్’ పేరుతో ఉన్న స్కీమ్, 2012లో ‘నిర్మల్ భారత్ అభియాన్’గా, మోదీ వచ్చాక స్వచ్ఛభారత్‌గా మారింది.
మోదీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు చేపట్టిన మంచి పనుల్లో ‘స్వచ్ఛభారత్’ ఒకటి. అది కొత్తదేమీ కాదు, దశాబ్దాలుగా ‘సెంట్రల్ రూరల్ శానిటేషన్ ప్రోగ్రామ్’ పేరుతో ఉన్న స్కీమ్, 2012లో ‘నిర్మల్ భారత్ అభియాన్’గా, మోదీ వచ్చాక స్వచ్ఛభారత్‌గా మారింది. దీనికి బ్రాండ్ అంబాసిడర్లుగా క్రీడా సినీ తారలను పెట్టుకుని, గాడ్గే మహరాజ్ లాంటి వారిని విస్మరించారని కాలమిస్ట్ సుధీంద్ర కులకర్ణి లాంటి మేధావులు అప్పట్లోనే అన్నారు.
2001 నుంచి కేంద్ర పథకానికి అనుబంధంగా, మహారాష్ట్ర సర్కారు ‘సంత్ గాడ్గే బాబా స్వచ్ఛతా అభియాన్’ను ప్రారంభించి, ప్రజలను భాగస్వాములను చేస్తూ స్వచ్ఛ గ్రామాలకి బహుమతులను ఇచ్చింది. తర్వాతి కాలంలో, స్వచ్ఛ భారత్‌ను గాంధీకి లింక్ చేశారు కానీ, గాడ్గేను పట్టించుకోలేదు.
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ప్రభవించిన ఎందరో సాధువులు, గురువులు బాహ్య స్వచ్ఛతనే కాకుండా అంతరంగ స్వచ్ఛతను కూడా ప్రచారం చేశారు. అటువంటివారిలో గాడ్గే మహరాజ్ కూడా ఒకరు. మహారాష్ట్రలో ఒక రజక కుటుంబంలో 1876 ఫిబ్రవరి 23న పుట్టిన ఆయన 1956 డిసెంబర్ 20న కన్నుమూశాడు. జీవితాంతం ఓ వైపు కీర్తనలతో మనసుల్ని, మరోవైపు చీపురుతో వీధుల్ని పరిశుభ్రం చేశాడు. 1905లో తన 29వ ఏట భార్యనీ పిల్లల్నీ వదిలి సిద్ధార్థుడిలాగా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆనాటి నుంచి చనిపోయేవరకూ, చీపురు చేతబట్టి పరిశుభ్రతను ప్రచారం చేశాడు. ఆయనకు ఉన్న ఆస్తి ఒక మట్టిమూకుడు మాత్రమే. దాన్ని మరాఠీలో గాడ్గే అంటారు. అసలు పేరు దేబూజీ అయినా, నెత్తిమీద పెట్టుకునే మూకుడు కారణంగా గాడ్గే మహరాజ్ అని పిలవటం మొదలు పెట్టారు జనం. కులం అడిగితే అంటరానివాడినని చెప్పి, తద్వారా అంటరానివారు ఎదుర్కొంటున్న అవమానాలను స్వయంగా అనుభవిస్తూ అర్థం చేసుకోగలిగాడు గాడ్గే. కుల వివక్షపై అలుపెరగని పోరాటాన్ని చేశాడు. భగవంతుడు మానవాళికి తండ్రయితే, కొన్ని కులాలపైనే ఎందుకు మమకారం చూపిస్తాడు? మరికొన్ని కులాలపై ఎందుకు కటువుగా వుంటాడు? అని ప్రశ్నించాడు.
గాడ్గేబాబా పండరిపూర్‌లో అంటరానివారికి ధర్మశాల కట్టించి, అంబేడ్కర్‌కి అప్పగించాడు. దేశంలోనే అంటరానివారి కోసం నిర్మించిన తొలి ధర్మశాల అది. మెహెర్ బాబాతో కలిసి కుష్టురోగులకి సేవ చేశాడు. జీవితాంతం మూఢనమ్మకాలపై చీపురు తిరగేశాడు. జంతుబలుల్ని నిరసించాడు. ‘గోపాల గోపాల దేవకీనందన్ గోపాల’ అని దేవుడిని కీర్తిస్తూనే, దేవుడి పేరుతో జరిగే కర్మకాండలను, మోసాలను వ్యతిరేకించాడు. దీనుల సేవను మించిన దైవసేవ లేదన్నాడు. ఆకలికి అన్నం, దప్పికకి నీరు, దేహానికి దుస్తులు, గూడు లేనివారికి నీడ, రోగుల పట్ల శ్రద్ధ, పేదపిల్లలకి చదువు, జంతువులు పక్షుల మీద ప్రేమ, నిస్సహాయస్థితిలో వున్నవారికి ఆలంబన.. ఇవీ ఆయన సూత్రాలు. అదే ఆయన నమ్మిన ధర్మం.
గాడ్గే బాబా నిరక్షరాస్యుడు. అందరికీ చదువుకునే అవకాశం, ఆలోచన లేని ఆ రోజుల్లో, ఆయన బడుగు వర్గాల పిల్లల చదువు గురించి తపన పడ్డాడు. పేదరికం నుంచి, నిస్సహాయత నుంచి బయటపడాలంటే చదువొక్కటే మార్గమని చెప్పేవాడు. అంబేడ్కర్ అడుగు జాడల్లోనే విముక్తి ఉందన్నాడు. కొన్ని పాఠశాలలు కూడా కట్టించాడు. 1918లో తమకి కూడా శాసనసభలోకి వెళ్లే అవకాశమివ్వాలని శూద్రులూ, వెనకబడిన కులాలూ చేస్తున్న డిమాండ్‌ను బాల గంగాధర్ తిలక్ వ్యతిరేకించారు. దానికి గాడ్గే మహరాజ్ నిమ్నకులాలన్నీ చట్టసభల్లోకి వెళ్లడానికి సహకరించాలని, లేదా అందరినీ బ్రాహ్మణులుగా మార్చాలని తిలక్‌ను కోరాడు. ఆయనకి గాంధీజీతోనూ పరిచయం ఉంది. మహాత్ముడిని దైవదూతగా అభివర్ణించేవాడు. హేతువాదీ, పాత్రికేయుడూ అయిన ప్రబోధాంకర్ థాక్రే తొలిసారి గాడ్గే జీవిత చరిత్ర రాస్తే, కొడుకు బాల్ థాక్రే దానికి ముఖ చిత్రం గీశాడు. మరాఠీలో ఆయనపై రెండు సినిమాలు కూడా వచ్చాయి. అమరావతి యూనివర్సిటీకి గాడ్గే పేరు పెట్టారు.
గాడ్గే బాబా ‘ఫాదర్ ఆఫ్ ది క్లీన్లీనెస్’ మాత్రమే కాదు. సంస్కర్తగా, పర్యావరణవాదిగా, జంతు ప్రేమికుడిగా, కుల వివక్షపై పోరాడిన సామాజిక న్యాయయోధుడిగా, సమాజసేవకుడిగా ఆయనలో భిన్న కోణాలున్నాయి. ఆయన జీవిత చరిత్రను పిల్లల పాఠ్యాంశాలలో పెట్టాలి. స్వచ్ఛత గురించి ఆయన బోధించేనాటికి, అవి ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన పనులన్న భావన కానీ, ఐక్యరాజ్యసమితి కార్యక్రమంగా గానీ రూపొందలేదన్న విషయాన్ని మనం గమనించాలి. ఆయన భారత రత్న పురస్కారానికి పూర్తిగా అర్హుడు. ఆయన జీవితం, ఆచరణ ఎప్పటికీ ఆదర్శప్రాయమే.
– నూతలపాటి నూతన్, జర్నలిస్ట్
(ఫిబ్రవరి 23: గాడ్గే మహరాజ్ జయంతి)