Share News

తెలంగాణ ఆత్మగౌరవ పతాక

ABN , Publish Date - May 27 , 2025 | 01:10 AM

తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. బహుముఖ ప్రజ్ఞాశాలి. వైతాళికుడు అంటే జాతిని మేల్కొలిపేవాడు. అభివృద్ధిబాటలో అభ్యుదయ పథంలో నడిపేవాడు. అట్లా నడిపించడానికి ఎన్ని రంగాల్లో పనిచేయాలో సురవరం అన్ని రంగాల్లో పనిచేసిండు. హైదరాబాద్‌ లాంటి రాజరికపు పాలనలో...

తెలంగాణ ఆత్మగౌరవ పతాక

తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. బహుముఖ ప్రజ్ఞాశాలి. వైతాళికుడు అంటే జాతిని మేల్కొలిపేవాడు. అభివృద్ధిబాటలో అభ్యుదయ పథంలో నడిపేవాడు. అట్లా నడిపించడానికి ఎన్ని రంగాల్లో పనిచేయాలో సురవరం అన్ని రంగాల్లో పనిచేసిండు. హైదరాబాద్‌ లాంటి రాజరికపు పాలనలో సైతం ఆధునికతకు పట్టం కట్టిన ప్రతిభాశాలి. హైదరాబాద్‌లో తొలి రాజకీయ సభలు మొదలు పెట్టి ఉద్యమం ఫలప్రదం చెంది ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగే వరకూ అన్ని దశల్లోనూ మొక్కవోని ధైర్యంతో, తెగింపుతో అవిశ్రాంతంగా పనిచేసిన ధీశాలి. ప్రజలను మేలుకొలిపేందుకు, హక్కుల భావనను, ప్రజాస్వామిక భావజాలాన్ని ప్రచారంలో పెట్టేందుకు రచన, పరిశోధన, పరిష్కరణ, ప్రచురణ, పత్రికా ముద్రణ, గ్రంథమాలల స్థాపన చేసిండు. పలు సంస్థలను నిర్మించిండు. విద్య ద్వారానే సమాజంలో జ్ఞానం విలసిల్లుతుందని తద్వారా చైతన్యవంతులైన బుద్ధిజీవులు హక్కుల కోసం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం కొట్లాడుతరని నమ్మి, హైదరాబాదులో ఆంధ్ర విద్యాలయ స్థాపన చేసిండు. విద్యారంగ అభివృద్ధికి విశేషమైన కృషి చేసిండు. ఉర్దూ మీడియం పాఠశాలలకు పోటీగా తెలుగు పాఠశాలలు నెలకొనాలని చిత్తశుద్ధితో కృషి చేసిండు. తెలంగాణలో 1920వ దశకంలో సాంస్కృతిక పునర్వికాసోద్యమానికి బలమైన పునాదులు వేసినవారు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో జమిందారీ, జాగీర్దారీ హక్కులు జతాయించడం, దొరతనం చలాయించడంపైనే శ్రద్ధ పెట్టిన రెడ్డి సామాజిక వర్గాన్ని విద్యవైపు మళ్లించినవాడు ప్రతాపరెడ్డి. రాజబహదూర్‌ వెంకటరామారెడ్డి సహకారంతో రెడ్డి హాస్టల్‌ని 1918లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి, దాని ద్వారా ఎందరో విద్యార్థులను తన కనుసన్నల్లో తీర్చిదిద్దిండు. ఎలాంటి కట్టడి లేకుండా పెరిగిన దొరల బిడ్డలను తనదైన క్రమశిక్షణతో నడిపించి, వారి పురోభివృద్ధికి కృషి చేసిండు. కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు రావి నారాయణరెడ్డి, ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, బద్దం ఎల్లారెడ్డిలతో పాటు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తదితరులు కూడా రెడ్డి హాస్టల్‌లో ఉండి చదువుకున్నవారే! ఈ హాస్టల్‌లోనే 11వేల పుస్తకాలు, పాత తాళపత్ర గ్రంథాలతో ఒక లైబ్రరీని సురవరం ప్రతాపరెడ్డి ఏర్పాటు చేసిండు. అప్పటికిది అసఫియా తర్వాత అతి పెద్ద లైబ్రరీ. ఈ లైబ్రరీలో సంఘవిద్రోహ పుస్తకాలు (సావర్కర్‌ రచనలు) ఉన్నాయని కేసులను సైతం ఎదుర్కొన్నాడు.


దీనికి తోడు విద్యార్థులు శారీరక ధారుఢ్యం కోసం ఒక జిమ్‌ని, మరో డిస్పెన్సరీని ఏర్పాటు చేసిండు. ఇక్కడ ఎలాంటి కుల వివక్ష లేకుండా అడ్మిషన్లుండేవి. హాస్టల్‌ పునాదిగా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన సురవరం, ఆ తర్వాత తెలంగాణ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో తనదైన ముద్ర వేసిండు. తెలంగాణ ‘వరం’గా సురవరం ఖ్యాతి గాంచిండు. తర్వాతి తరానికి దార్శనికుడిగా నిలిచిండు. రెడ్డి హాస్టల్‌తో ప్రారంభమై ఆ తర్వాత వేమన ఆంధ్ర భాషా నిలయం, శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయాలతో మమేకమయిండు. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం కార్యవర్గంలో చాలా ఏండ్లు సభ్యుడిగా ఉండి అనేక మంది పండితులతో సభలు సమావేశాలు ఏర్పాటు చేసిండు. రెడ్డి హాస్టల్‌ తర్వాత ప్రతాపరెడ్డి కృషి 1925 నుంచి ‘గోలకొండ’ పత్రికపై కేంద్రీకరించారు. ఈ పత్రికలో పెట్టుబడి పెట్టిందంతా రెడ్డి దొరలే అయినా, ఆ దొరల తప్పులను పత్రికలో ఎత్తి చూపడానికి, వారిని నిలదీయడానికి ప్రతాపరెడ్డి ఎన్నడూ వెనకాడలేదు. తాను ఆంధ్రమహాసభలో కీలక నాయకుడయినా, అందులో జరిగే ఏకపక్ష నిర్ణయాలను, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను తన పత్రికల్లో సంపాదకీయాల ద్వారా తప్పు పట్టిండు. నందగిరి వెంకటరావు లాంటి ‘అభివృద్ధి’ పక్షంలోని యువతరాన్ని ప్రోత్సహించిండు. ఆంధ్ర జనసంఘం, ఆ తర్వాత ఆంధ్రమహాసభతో మమేకమయిండు. 1930లో జోగిపేటలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించడమే గాకుండా అక్కడ బచ్చు వెంకటేశం గుప్త లాంటి సనాతనులు... దళితుడైన భాగ్యరెడ్డి వర్మ వేదిక ఎక్కకూడదని భీష్మించడంతో వారిని సముదాయించి, ఒప్పించిండు. భాగ్యరెడ్డి వర్మకు వేదిక కల్పించి ఆయనకు సభలో ప్రసంగించడానికి అవకాశం కల్పించిండు. తెలంగాణలో ఒక దళితుడికి తెలుగువారి వేదిక మీద అవకాశం కల్పించడం అదే మొదటిసారి. జోగిపేట చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల కోసం హరికథలు, బుర్రకథలు ఏర్పాటు చేసి దళితులు సైతం సమాన గౌరవం పొందడానికి అర్హులు, వారి పట్ల వివక్ష చూపడం తప్పని ప్రచారం చేసిండు.


సురవరం ప్రతాపరెడ్డి 1927 ప్రాంతంలో ప్రారంభమయిన ‘అరుంధతీయ మహాసభ’కు గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు. ముదిరాజ్‌ మహాసభ, మున్నూరు కాపు, పద్మశాలి, గౌడ కుల సంఘాలు నిర్వహించుకోవడానికి రావు బహదూర్‌ వెంకటరామారెడ్డితో మాట్లాడి అనుమతులిప్పించాడు. పత్రికా రచనల్లో స్త్రీలు వెనుకబడి ఉండడాన్ని గుర్తించి ‘చిత్రగుప్తుడు’ అనే మారు పేరుతో వారిని రెచ్చగొట్టి స్పందించే విధంగా వ్యాసాలు రాసేవాడు సురవరం. ఈ వ్యాసాలకు స్పందనగా యల్లాప్రగడ సీతాకుమారి లాంటి మహిళోద్యమ నాయకులు స్పందించి జవాబిచ్చేవారు. ఇలా మహిళలు రచయితలుగా ఎదగడానికి కూడా ప్రతాపరెడ్డి తోడ్పడ్డాడు. తాను స్వయంగా ‘జానపద గేయాలు’ సేకరించి ప్రచురించడమే గాకుండా, బిరుదురాజు రామరాజు లాంటి వారు ‘జానపద గేయవాఙ్మయం’పై పరిశోధన చేయడానికి స్ఫూర్తినిచ్చాడు. సామల సదాశివ లాంటి వారికి కవిత్వం రాయడంలో మార్గదర్శకంగా నిలిచిండు. అంటే ఒక తరానికి తరాన్ని తన రచన, ఆచరణ ద్వారా కదిలించారు. గోలకొండ పత్రిక తరపున ప్రతి సంవత్సరం మే 10వ తేదీన వార్షిక సంచికలు వెలువరించేవారు. ఇలా 1933 నాటి వార్షిక సంచికలో ముడుంబై రాఘవాచార్యులు తెలంగాణలో ‘కవులు పూజ్యం’ అని రాసిండు. దీంతో ప్రతాపరెడ్డి నొచ్చుకొని తెలంగాణలో కవులు పూజ్యం కాదు; ఇక్కడి కవులు పూజ్యనీయులు అని 1934 డిసెంబర్‌ వరకు 354 మంది కవిత్వాన్ని సేకరించి ‘గోలకొండ కవుల సంచిక’ను వెలువరించారు. ఇందులో కవుల కుల గోత్రాలే గాకుండా ప్రాచీన కవి పుంగవులను కూడా పరిచయం చేసిండు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సాహిత్యంలో మెండుగా ప్రదర్శించిన తొలి సందర్భమిది. 1920 నుంచి 1953 వరకు వివిధ సందర్భాల్లో ప్రతాపరెడ్డి రాసిన వ్యాసాలు, ముందుమాటలు, సంపాదకీయాలు, రచనలు, లేఖలు అన్నీ ముద్రిస్తే పదివేల పేజీలకు తగ్గకుండా ఉంటాయి. ఇందులో కొన్ని రచనలు సురవరం సాహితీ వైజయంతి తరపున మూడు దశాబ్దాల క్రితం ప్రచురించారు. ఇప్పుడు ఆయన రచనలన్నీ అందుబాటులోకి తేవాల్సిన అవసరమున్నది. ఇవి వివిధ సందర్భాల్లో ఆయనప్పుడు ఎట్లా స్పందించేవారో ఇప్పటి తరానికి దారిదీపమైతాయి. తెలంగాణ కేంద్రంగా రాసిన అనేక చారిత్రక వ్యాసాలు ఇంకా పత్రికల సంపుటాల్లోనే ఉన్నాయి. కర్నూలు రాజుల వంశావళి, ఆత్మకథ లాంటి రచనలు ఇంకా వెలుగులోకి రాలేదు. మద్యపాన నిరోధం, సంఘోద్ధరణము, జాగీరులు, తదితర బుక్‌లెట్స్‌ ఇప్పటి సందర్భానికి అవసరమైన గ్రంథాలు. 1938లోనే హక్కుల భావన ఏ మాత్రం లేని సమయంలో ‘ప్రజాధికారములు’ అని ప్రాథమిక హక్కులపై పుస్తకం ప్రచురించి తెలుగు ప్రజలను చైతన్యపరిచిండు. రెడ్డి హాస్టల్‌, ఆంధ్రమహాసభ, ఆంధ్రసారస్వత పరిషత్తు, విజ్ఞానవర్ధినీ పరిషత్తు, గోలకొండ గ్రంథమాల, ఆంధ్ర విద్యాలయ, వేమన ఆంధ్ర భాషానిలయం, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, అరుంధతీయ సంఘం, గ్రంథాలయ సభల నిర్వహణ ఇలా అనేక సంస్థల ఏర్పాటు నిర్వహణలో తలమునకలుగా ఉండేవాడు. స్వీయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి, పని ధ్యాసగా ఉండేవాడు.


అముద్రితంగా, అపరిష్కృతంగా ఉన్న తాళపత్ర గ్రంథాలు సేకరించి, వాటిని పరిష్కరించి ప్రచురించేవాడు. తాను సేకరించిన కొన్ని తాళపత్రాలు ఆంధ్ర విశ్వవిద్యాలయ లైబ్రరీకి దానం చేసినట్లు తన గురువు వేదం వెంకటరాయశాస్త్రికి రాసిన లేఖల్లో చెప్పుకున్నాడు. ఇంతటి ప్రతిభావంతుడి పేరు ఇప్పుడు అనేక పోరాటాల అనంతరం తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టిండ్రు. సంతోషం. ప్రతాపరెడ్డి కృషి భావితరాల వారికి అందాలంటే ఆయన రచనలన్నీ సంపుటాలుగా రావాల్సిన అవసరమున్నది. దానికి తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం నిధులు కేటాయించి పని అప్పజెబితే బాగుంటుంది. అది సాధ్యం కాని దశలో తెలంగాణ సారస్వత పరిషత్‌ సంస్థ దాతల సహకారంతో నిధులు సేకరించి, ఈ సంపుటాల ముద్రణకు ప్రయత్నించాలి. ఇందుకు ఒక విషయ నిపుణుల సలహా మండలిని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అంతేగాక తెలుగు భాషపై విశేష కృషి చేసినందుకు, ఆంధ్రా ప్రాంతంతో ప్రతాపరెడ్డికి గ్రంథాలయోద్యమంతో సన్నిహిత సంబంధాలున్నందున ఆ ప్రాంతంలో కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. వారి పాఠ్యపుస్తకాల్లోనూ ప్రతాపరెడ్డి ప్రతిభ రికార్డు కావాలి. తెలంగాణ ప్రభుత్వం పూనుకొని దాశరథి, కాళోజిల మాదిరిగా ప్రతాపరెడ్డి పేరిట కూడా యేటా ఒక అవార్డుని సాహితీవేత్తలకు ఇవ్వాలి. అట్లాగే ప్రతాపరెడ్డిపై ప్రామాణికమైన ఆంగ్ల గ్రంథం వెలువడాలి. తద్వారా ఆయన ఘనత ప్రపంచ వ్యాప్తంగా తెలిసి రావడానికి వీలవుతుంది.

డా. సంగిశెట్టి శ్రీనివాస్‌

(సురవరం ప్రతాపరెడ్డి జయంతి రేపు)

ఇవి కూడా చూడండి

నక్సలైట్లపై సీజ్ ఫైర్ ప్రకటించాలి

తెలంగాణలో వానలే వానలు

Updated Date - May 27 , 2025 | 01:10 AM