Supreme Court: సుప్రీం సమాధానాలు
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:09 AM
తన పద్నాలుగు ప్రశ్నలకూ సుప్రీంకోర్టు ఇచ్చిన సమాధానం రాష్ట్రపతిగారికి కచ్చితంగా సంతృప్తినీ, సంతోషాన్నీ కలిగించివుంటుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటివరకూ పద్నాలుగుసార్లు మాత్రమే ఈ ....
తన పద్నాలుగు ప్రశ్నలకూ సుప్రీంకోర్టు ఇచ్చిన సమాధానం రాష్ట్రపతిగారికి కచ్చితంగా సంతృప్తినీ, సంతోషాన్నీ కలిగించివుంటుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటివరకూ పద్నాలుగుసార్లు మాత్రమే ఈ ‘ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్’ అధికారాన్ని రాష్ట్రపతి వినియోగించుకున్న నేపథ్యంలో, బిల్లుల ఆమోదానికి గవర్నర్లకు, రాష్ట్రపతికీ కాలపరిమితులు విధిస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నెలలోనే రాష్ట్రపతి న్యాయసలహా పేరిట దానికి పలుప్రశ్నలు సంధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాష్ట్రపతిని రంగంలోకి దించి పాలకులు న్యాయవ్యవస్థతో యుద్ధం కొనసాగిస్తున్నారని న్యాయకోవిదులు సైతం గొణిగారు. అలాగే, ఈ ప్రశ్నల వెనుక లక్ష్యాన్నీ అనుమానించారు. సంధించిన ఆ ప్రశ్నల్లోనే మీ తీర్పు ఎలా చెల్లుబాటవుతుందో చెప్పుకోండి చూద్దాం అన్న అసలు ప్రశ్న కూడా ఉన్నందున, ఈ న్యాయసలహా దెబ్బకు సుప్రీంకోర్టు దిగివస్తుందన్న మేధావుల అంచనా ఇప్పుడు నిజమైంది.
గవర్నర్ స్థాయిలో ఉన్నవారికి రాజ్యాంగబద్ధంగా నడుచుకోమని పదేపదే చెప్పాల్సి రావడం నిజానికి సర్వోన్నత న్యాయస్థానానికే పెద్ద పరీక్ష. తమిళనాడు గవర్నర్ విషయంలో అది చేసీచేసీ విసిగిపోయిన నేపథ్యంలోనే, ఏప్రిల్‌లో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వినూత్నంగా, విప్లవాత్మకంగా ఆ తీర్పు చెప్పింది. కేసు తమిళనాడుది కావడం, డీఎంకేకు అది రాజకీయంగా పైచేయినివ్వడంతో కేంద్రం పెద్దలకు మా చెడ్డకోపం వచ్చింది. విపక్షపాలిత రాష్ట్రాలన్నింటికీ ఉపశమనాన్ని ఇచ్చిన ఆ తీర్పు, రవి తరహా గవర్నర్లు పెడుతున్న బాధలను అనుభవిస్తున్న పార్టీలకు శక్తినీ, ఉత్సాహాన్నీ ఇచ్చింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను రాజ్యాంగబద్ధ వ్యవస్థలుగా కాక, శత్రుసేనలుగా భావించి సంహరించే గవర్నర్లకు ఆ తీర్పు ఒక ఘాటైన హెచ్చరిక. వారి పరిధిని గుర్తుచేస్తూ లక్ష్మణరేఖ దాటవద్దన్నది. ప్రభుత్వం పంపిన బిల్లులను అటు ఆమోదించకుండా, ఇటు తిప్పిపంపకుండా, కనీసం రాష్ట్రపతికి నివేదించకుండా గవర్నర్ ఎన్ని ఎత్తులు వేశారో కోర్టు గమనించింది. శాసనసభ రెండోసారి పంపినా సంతకం చేయకుండా, ఆఖరుఘడియలో అతితెలివిగా రాష్ట్రపతి టేబుల్‌మీదకు ఆ బిల్లులను నెట్టేయడమూ గమనించింది కనుకనే, సుప్రీంకోర్టే వాటిపై ఓ నిర్ణయం తీసుకుంది. 142వ అధికరణద్వారా తనకు దఖలుపడిన ప్రత్యేకాధికారాలను వినియోగించుకొని, గవర్నర్ ఆమోదం లభించినట్టుగా నిర్ధారించింది. రాజకీయకక్షతో గవర్నర్ సృష్టించిన కృత్రిమసంక్షోభాలను సాహసోపేతమైనమార్గంలో పరిష్కరించింది. బిల్లుల ఆమోదానికి రాజ్యాంగం నిర్దిష్టకాలపరిమితిని విధించకపోవడం ఒక గౌరవంగా కాక, ఒక నిరంకుశ అధికారంగా, దుర్వినియోగం చేయగల అవకాశంగా తీసుకుంటున్న గవర్నర్లకు ఆ తీర్పు ముకుతాడు వేసింది. మీకు నచ్చిందే చేయండి అని గవర్నర్లకు చెబుతూనే, బిల్లు ఆమోదానికీ, తిరస్కారానికీ, రాష్ట్రపతి నివేదనకు కాలపరిమితులు విధించింది.
ప్రజాస్వామ్యానికీ, సమాఖ్యవ్యవస్థకు సత్తువనిచ్చే ఆ తీర్పును ఈ ఐదుగురు సభ్యుల ధర్మాసనం నీరుగార్చడంతో వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది. గవర్నర్, రాష్ట్రపతి విధుల్లో వేలుపెట్టబోనని కోర్టు హామీ ఇస్తోంది. గవర్నర్లకు గడువులుండవనీ, ఏమీ తేల్చకున్నా ఎవరూ ప్రశ్నించరని చెబుతోంది. మరీ అన్యాయమనిపిస్తే ఓ మాట అడుగుతామని కాస్తంత వేలుదూరేంత సందు పేరుకు మిగల్చుకున్నా, మీ నిర్ణయాలు న్యాయసమీక్షకు అతీతమనీ, డీమ్డ్ అసెంట్, ఆటోమేటిక్ వంటివి రాజ్యాంగంలోనే లేవని ధైర్యం చెప్పింది. రాష్ట్రాల్లో అధికార కేంద్రాలుగా తయారై, ఎన్నికలు వచ్చేనాటికి క్షేత్రాన్ని రాజకీయంగా సిద్ధం చేస్తూ, విపక్షపార్టీ ప్రభుత్వాలను కూల్చేందుకు ఉపకరిస్తున్న గవర్నర్లకు, వారి యజమానులకు ఈ తీర్పు సంతోషం కలిగిస్తుంది. ప్రభుత్వాలు రాజ్యాంగ విహితంగా నడవనప్పుడు న్యాయస్థానాలు కాస్తంత చొరవ, దూకుడు ప్రదర్శించి గాడినపెట్టడం అవసరం. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని రక్షించడానికీ, కొలీజియం వ్యవస్థను పరిరక్షించుకోవడానికీ కార్యనిర్వాహక వ్యవస్థతో న్యాయవ్యవస్థ ఎంత పోరాడిందో చూశాం. ఇందుకు పూర్తి భిన్నంగా పుస్తకంలో ఉన్నదే అప్పచెప్పడానికి ఇప్పుడు సిద్ధపడిందంటే భయమో భక్తో కావచ్చు, లేదా, మధ్యలో మాకెందుకీ గొడవ అనుకొని కూడా ఉండవచ్చు.