Share News

Minority Rights: వక్ఫ్‌ గ్రహణంలో భారత్‌ కీర్తి చంద్రికలు

ABN , Publish Date - Sep 20 , 2025 | 06:11 AM

భారత జాతీయ చట్టసభ పార్లమెంటు ఆమోదించిన ఒక చట్టంలోని వొక నిబంధనను సుప్రీంకోర్టు గానీ లేదా హైకోర్టు గానీ కొట్టివేస్తే అది ప్రభుత్వానికి గానీ....

Minority Rights: వక్ఫ్‌ గ్రహణంలో భారత్‌ కీర్తి చంద్రికలు

భారత జాతీయ చట్టసభ పార్లమెంటు ఆమోదించిన ఒక చట్టంలోని వొక నిబంధనను సుప్రీంకోర్టు గానీ లేదా హైకోర్టు గానీ కొట్టివేస్తే అది ప్రభుత్వానికి గానీ, పార్లమెంటు సభ్యులకు గానీ ప్రతిష్ఠాకరమేనా? శాసన నిర్మాణ బాధ్యతలను వారు నిర్వర్తించిన తీరును ఆక్షేపించడమే కాదూ ఆ న్యాయ నిర్ణయం? ఒక బిల్లులోని నిబంధనలు రాజ్యాంగ నిర్దేశాలకు విరుద్ధంగా ఉన్నట్టయితే శాసన నిర్మాతలు ఆ బిల్లును తప్పక వ్యతిరేకిస్తారు. అయినా ప్రభుత్వం ఆ బిల్లును పార్లమెంటులో మళ్లీ ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవచ్చు. అయినా ఉన్నత న్యాయస్థానాలు అంతిమంగా ఆ బిల్లును కొట్టివేస్తే అది ప్రభుత్వానికి ఎంత అవమానం, ఎన్ని తలవంపులు?! అంతకంటే అధ్వానకరమైన పరిస్థితిని పరిశీలనలోకి తీసుకోండి: పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుకు తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అప్పుడు ఆ బిల్లును సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)కి పరిశీలనకు నివేదిస్తారు. జేపీసీలోని పలువురు సభ్యులు ఆ బిల్లు పట్ల తమ తీవ్ర అసమ్మతి తెలుపుతారు. పార్లమెంటు ఆమోదించేందుకు ఆ బిల్లు అర్హమైనది కాదని స్పష్టం చేస్తారు. సభ్యుల ఆక్షేపణలు, అభ్యంతరాలను తోసిపుచ్చి ప్రభుత్వం ఆ బిల్లును ఆమోదింప చేసుకుంటుంది. ఆ తరువాత ఉన్నత న్యాయస్థానాలు ఆ బిల్లులోని నిబంధనలను కొట్టివేయడమో లేక వాటి అమలును తాత్కాలికంగా నిలిపివేయడమో చేస్తాయి. ప్రభుత్వానికి ఇంతకంటే ఘోరమైన అవమానం మరేముంటుంది? న్యాయ మంత్రిత్వశాఖ విధి నిర్వహణా దక్షత ఎంత సమర్థంగా ఉన్నదో అది తెలియజేస్తుంది!


ఇదీ వక్ఫ్‌ (సవరణ) చట్టం–2025 కథ. సెప్టెంబర్‌ 15, 2025న ఆ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై సుప్రీం స్టే విధించింది. అయినప్పటికీ ప్రభుత్వం గంభీరంగా తనను తాను అభినందించుకున్నది. ‘ముస్లిమ్‌ పర్సనల్‌ లా’లోని ప్రధాన భాగాన్ని సంస్కరించేందుకు తాము చేసిన ప్రయత్నాలను సుప్రీంకోర్టు ఆమోదించిందని ప్రభుత్వం చెప్పుకున్నది. పార్లమెంటులో లేవనెత్తిన అనేక ప్రశ్నలను ఏప్రిల్‌ 5, 2025న ఇదే కాలమ్‌లో నేను రాసిన వ్యాసం (‘ముస్లింలపై మరో దాడి!’)లో ప్రస్తావించాను. విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు రాలేదు. ఆ బిల్లులోని వివిధ నిబంధనలను ప్రభుత్వం మొండిగా సమర్థించుకున్నది అయితే మా ప్రశ్నలకు సుప్రీంకోర్టు మధ్యంతర సమాధానాలు ఇచ్చింది:

  • వక్ఫ్‌ సవరణ చట్టం కింద ‘ఒక వక్ఫ్‌ను సృష్టించే వ్యక్తి తాను కనీసం ఐదు సంవత్సరాలుగా ఇస్లాంను అనుష్ఠానిస్తున్నానని నిరూపించుకోవాలి’. తాను ఇస్లాంను అనుసరిస్తున్నానని ఒక వ్యక్తి ఎలా ‘నిరూపించాలి’ అని మేము ప్రశ్నించాము. చట్టంలోని 3వ సెక్షన్‌లో ‘ఆర్‌’ అనే నిబంధనపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆస్తిని వక్ఫ్‌గా ప్రకటించే ముందు ఐదేళ్ల పాటు ఇస్లాం మతాన్ని అనుసరించి ఉండాలన్న షరతుకు కొత్త నియమాలు రూపొందించేంతవరకు ఈ స్టే వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. ఆ షరతుకు వర్తించే నియమాలను రూపొందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉన్నది. ఇతర మతాల పర్సనల్‌ లాస్‌ (వివాహం, ఆస్తుల వారసత్వం మొదలైన కొన్ని వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఆయా వ్యక్తులకు సంబంధించిన మతాచారం ప్రకారం వర్తించే శాసనపరంగా గుర్తింపు కలిగిన నియమ నిబంధనలు)లో ఇటువంటి నిబంధనేదీ లేదు.


  • వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తి ప్రభుత్వ ఆస్తి అవునో కాదో అనేది నిర్ణయించడానికి జిల్లా మెజిస్ట్రేట్‌కు అధికారం ఉన్న సెక్షన్‌ను కూడా సుప్రీంకోర్టు నిలిపివేసింది. పౌరుల వ్యక్తిగత హక్కులపై నిర్ణయం తీసుకోవడానికి జిల్లా మెజిస్ట్రేట్‌కు అనుమతి లేదని తెలిపింది. అది అధికారాల వికేంద్రీకరణను ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిర్దిష్ట వక్ఫ్‌ ఆస్తి ‘ప్రభుత్వ ఆస్తి అవునో కాదో నిర్ణయించేందుకు నియుక్తుడైన అధికారి నిర్ణయం తీసుకునేవరకు ఆ ఆస్తిని వక్ఫ్‌ ఆస్తిగా పరిగణించకూడదు. అది ప్రభుత్వ ఆస్తి అని ఆ అధికారి నిర్ణయిస్తే ఆ ప్రకారం అతడు రెవెన్యూ రికార్డులను సవరించాలి? అని చట్టం నిర్దేశించింది. అయితే ఇది తన సొంత వ్యవహారంలో ప్రభుత్వమే న్యాయమూర్తి పాత్ర వహించడం కాదా అని మేము ప్రశ్నించాము. సెక్షన్‌ 3సి లోని సబ్‌ సెక్షన్లు 2, 3, 4పై సుప్రీంకోర్టు స్టే విధించింది.

  • రెవెన్యూ రికార్డులు ‘సవరించిన ’తరువాత వక్ఫ్‌ ఆస్తిగా పరిగణింపబడే హక్కును కోల్పోతుంది. కార్యనిర్వాహక చర్య ద్వారా వక్ఫ్‌ ఆస్తిపై హక్కును తొలగించడం కాదా అని మేము ప్రశ్నించాము. ఈ అంశంపై అప్పిలేట్ ట్రిబ్యునల్‌, సంబంధిత హైకోర్టు నిర్ణయం తీసుకునేంతవరకు రెవెన్యూ రికార్డుల సవరణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర వక్ఫ్‌ బోర్డులలోను, కేంద్ర వక్ఫ్‌ కౌన్సిల్స్‌లోను ముస్లిమేతరులను నియమించవచ్చని, సీఈఓగా కూడా ముస్లిమేతరులను నియమించవచ్చని వక్ఫ్‌ సవరణ చట్టం నిర్దేశించింది. మరి హిందూమతానికి చెందిన ట్రస్టులో ముస్లిం లేదా హిందూయేతర వ్యక్తికి స్థానం కల్పించేందుకు వీలుగా ఇటువంటి నిబంధనలను సంబంధిత చట్టాలలో చేరుస్తారా అని మేము ప్రశ్నించాము. సుప్రీంకోర్టు సైతం ఇదే విషయాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర వక్ఫ్‌ బోర్డుల్లోని 11 మంది సభ్యులలో ముస్లిమేతరుల సంఖ్య ముగ్గురికి మించకూడదని, కేంద్ర వక్ఫ్‌ కౌన్సిల్‌లోని 22 మంది సభ్యలలో ముస్లిమేతరులు నలుగురికి మించి ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీఈఓగా ముస్లింను నియమించేందుకు అవసరమైన ప్రతి ప్రయత్నమూ చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


వక్ఫ్‌ (సవరణ) చట్టంపై మొత్తంగా కానీ లేదా కనీసం అందులోని కొన్ని కీలక నిబంధనలపై తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన దరఖాస్తుపై వాదనలను సుప్రీంకోర్టు మూడు రోజుల పాటు విన్నది. చట్టం అమలు నిలుపుదలకు దాఖలైన ఒక దరఖాస్తుపై మూడు రోజుల పాటు విచారణ జరపడం అసాధారణం. ఈ కేసు అంతిమ విచారణకు వచ్చినప్పుడు మరిన్ని వాదనలను సుప్రీంకోర్టు విననున్నది. సరే, ఈ లోగా ఈ ప్రభుత్వం తన హిందుత్వ అజెండాను మరింత ముందుకు తీసుకువెళుతూ మైనారిటీల ప్రయోజనాలకు విఘాతం కలిగించే నిర్ణయాలు తీసుకుంటుంది, చర్యలు చేపడుతుంది, సందేహం లేదు. వక్ఫ్‌(సవరణ) చట్టంను కించిత్‌ పరిశీలిస్తే దాని దురుద్దేశం, మైనారిటీల పట్ల ద్వేషభావం ఇట్టే విశదమవుతుంది. ప్రభుత్వం నిష్ఠగా పాటించవలసిన రాజ్యాంగ అధికరణ 26 ‘మతపరమైన వ్యవహారాలను నిర్వహించుకునే హక్కు’ అన్ని మతాలవారు తమ మతసంస్థలను స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేస్తున్నది. ఆ అధికరణ ఇంకా నాలుగు విషయాలు పేర్కొంది. అవి: 1) సంస్థలను ఏర్పాటు చేసుకొనుట; 2) నిర్వహించుకొనుట; 3) సంస్థల కొరకై చర స్థిరాస్తులను సేకరించుకొనుట; 4) సేకరించిన ఆస్తుల నిర్వహణ, ఇవన్నీ మత స్వేచ్ఛలో అంతర్భాగాలు. ఈ హక్కులను నిర్వహించుకొనుటలో శాంతిభద్రతలను, నీతిని, ప్రజారోగ్యాన్ని భంగపరచరాదు. భారతదేశ మత, సాంస్కృతిక జీవనంలో విశిష్టమైన, విలక్షణమైన వైవిధ్యాన్ని సంరక్షించుకుని మరింత దృఢతరం చేసుకోదలిచినవారు మరీ ముఖ్యంగా హిందువులు వక్ఫ్‌ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలి, పోరాడి తీరాలి. భారతదేశ జనాభాలో ముస్లిం మతస్తులు 20.20 కోట్ల మంది కాగా క్రైస్తవులు 3.20 కోట్ల మంది ఉన్నారని ఈ ఏడాది సాధికారిక అంచనాలు నిర్ధారించాయి. హిందూధర్మం ప్రపంచ అత్యంత పురాతన మతం కాగా క్రైస్తవం, ఇస్లాం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికులు అనుసరించే మతాలుగా విలసిల్లుతున్నాయి. భారతీయులమైన మనం లౌకికవాదులమని, సహనశీలురమని ప్రగాఢంగా విశ్వసిస్తాం. అయితే ప్రపంచం మాత్రం భారత్‌ను భారత పార్లమెంటు చట్టాలు, భారత ప్రభుత్వ చర్యలు, భారత ప్రజల సామాజిక ప్రవర్తనారీతుల ప్రాతిపదికన చూస్తుంది. మన దేశం పట్ల అభిప్రాయాలు ఏర్పరచుకుంటుంది. ప్రపంచం దృష్టిలో భారత్‌కు ఇంతకు ముందున్న సమున్నత గౌరవ ప్రతిష్ఠలు వక్ఫ్‌ (సవరణ) చట్టంతో క్షీణించాయి.

-పి. చిదంబరం (వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Sep 20 , 2025 | 06:11 AM