Share News

Supreme Court: నిర్దోషికి న్యాయం..!

ABN , Publish Date - Nov 01 , 2025 | 06:28 AM

చేయని నేరానికి శిక్ష అనుభవించినవారికి నష్టపరిహారం అందించాలన్న సుప్రీంకోర్టు ఆలోచనను మెచ్చవలసిందే. తప్పుడు సాక్ష్యాలతో, అభియోగాలతో శిక్షపడిన వ్యక్తికి జరిగిన నష్టాన్ని ఎంతోకొంత భర్తీచేయడం అవసరమే.

Supreme Court: నిర్దోషికి న్యాయం..!

చేయని నేరానికి శిక్ష అనుభవించినవారికి నష్టపరిహారం అందించాలన్న సుప్రీంకోర్టు ఆలోచనను మెచ్చవలసిందే. తప్పుడు సాక్ష్యాలతో, అభియోగాలతో శిక్షపడిన వ్యక్తికి జరిగిన నష్టాన్ని ఎంతోకొంత భర్తీచేయడం అవసరమే. పరిహారం చెల్లించడం అంటే, కాస్తంత న్యాయం చేయాలని ప్రయత్నించడమే కాదు, పాపం చేశామనీ, పొరపాటు జరిగిందనీ ఒప్పుకోవడం కూడా. అనంతరకాలంలో నిర్దోషిగా బయటకు వచ్చిన బాధితుడికి జైలులో అతడు కోల్పోయిన విలువైన జీవితాన్ని పరిగణించి, గణించాలన్నది సముచితమైన ప్రతిపాదన. బాధితుడికి ఆర్థికంగా ఒరిగేదానికంటే, వ్యవస్థలన్నీ కలసికట్టుగా చేసిన తప్పును ఈ రూపంలో ఒప్పుకోవడం మరింత ఉపశమనం కల్పిస్తుంది. బలహీనులు, నిస్సహాయుల మీద పెద్దలు కక్షకట్టి తప్పుడు కేసుల్లో ఇరికించడం, ప్రశ్నించేవారిని పాలకులు జైళ్లలోకి నెట్టడం ఈ దేశంలో అనాదిగా జరుగుతున్నదే. పేదల విషయంలో అంత సత్వరంగా స్పందించని న్యాయస్థానాలు రాజకీయ, సినీరంగప్రముఖులు ఇమిడివున్న కేసుల్లో తక్షణన్యాయం అందించడం ఉన్నదే. న్యాయపీఠంమీద కూర్చున్న కోవిదులకు ఏవి తప్పుడు కేసులో తెలియకపోదు కూడా. ఒకానొక కేసు సుప్రీంకోర్టుకే మరీ అన్యాయంగా కనిపించినందున పరిహారం ప్రతిపాదన దానికీ నచ్చినట్టు ఉంది. మహారాష్ట్రలో ఒక మైనర్‌పై అత్యాచారం చేసి, హత్యచేశాడన్న ఆరోపణమీద ఆరేళ్ళు జైల్లో మగ్గి, ఆ తరువాత, థానేకోర్టు ఉరిశిక్షవేయడంతో మరో ఆరేళ్ళు ఆ భయం నీడలోనే సర్వోన్నతన్యాయస్థానంలో పోరాటం సాగించిన ఒక నిరుపేదను కోర్టు అంతిమంగా నిర్దోషిగా తేల్చింది. అతడిని ఈ కేసులో అక్రమంగా ఇరికించారని, దర్యాప్తు సక్రమంగా జరగలేదని న్యాయస్థానం నిర్ణయానికి వచ్చింది. తాను జైల్లో కోల్పోయిన జీవితాన్ని పరిగణనలోకి తీసుకొని నష్టపరిహారం ఇప్పించాలని ఆ బాధితుడు కోరుకున్నాడు.


అన్యాయం జరిగినందున అతడు నష్టపరిహారానికి అర్హుడనీ, జైలు జీవితం అతని ప్రాథమిక హక్కులను కొల్లగొట్టిన వాస్తవాన్ని లెక్కలోకి తీసుకోవాలని అతని న్యాయవాది వాదించారు. ఒక వ్యక్తిని సుదీర్ఘకాలం జైల్లో మగ్గనిచ్చి, ఆ తరువాత కేవలం నిర్దోషి అని ప్రకటించడంతో వ్యవస్థ బాధ్యత తీరిపోదని సుప్రీంకోర్టు కూడా భావించింది. నిర్దోషి అని నిర్ధారించడంతో పాటుగా దోషాన్ని సరిదిద్దడం కూడా అవసరమనుకుంది. బాధితుడి అభ్యర్థన నెరవేర్చడానికి తదనుగుణమైన మార్గదర్శకాలు రూపొందించాలన్న న్యాయవాది వాదనతోనూ ఏకీభవించింది. అనేక సంక్లిష్టమైన అంశాలు, ప్రక్రియలూ ఇమిడివున్నందున ఈ అంశంపై ఒక నిర్ణయానికి రావడంలో సహకరించమని అటార్నీ జనరల్‌, సొలిసిటర్‌ జనరల్‌లను న్యాయమూర్తులు కోరారు. దిగువ కోర్టులు ఏకంగా ఉరిశిక్షలు వేయడం మీద సుప్రీంకోర్టు పలుమార్లు అసహనాన్ని ప్రకటించడమే కాదు, ఇటీవలి కాలంలోనే అటువంటి కేసులు కొన్ని కొట్టివేసింది కూడా. ఆ సందర్భాల్లో పోలీసులనూ, ప్రాసిక్యూషన్‌నూ తప్పుబట్టడం కూడా చూశాం. తప్పుడు అభియోగాలు, అరెస్టులు, శిక్షలనుంచి అమాయకులను రక్షించాలన్న తన ప్రయత్నానికి ప్రభుత్వం సహకరించాలని కోర్టు కోరుతోంది. పలుదేశాల్లో ఈ తరహా నష్టపరిహారాలు, తగిన నిబంధనలు ఉన్నందున ఈ దేశంలోనూ వాటిని పాలకులు తలుచుకుంటే అమలుచేయవచ్చును. కానీ, క్షమాపణలకు కూడా నోచుకోని అమాయకులకు ఏకంగా పరిహారాలు ఇవ్వడానికి ప్రభుత్వాలు సిద్ధపడతాయనుకోలేం. సగంమంది శిక్షలు పడకుండానే జైల్లో మగ్గిపోతున్న దేశంలో ఇంత ఉదాత్తంగా వ్యవహారం సాగుతుందా అన్నది ప్రశ్న. క్రిమినల్‌ కేసుల్లో నిందితులు నిర్దోషులుగా తేలితే దర్యాప్తు అధికారులను బాధ్యులను చేయాలన్న పదేళ్ళనాటి సుప్రీంకోర్టు ఆదేశం వెంటనే అటకెక్కిపోయింది. అమాయకులపై తప్పుడు కేసులు పెట్టడం ద్వారా అసలు నిందితులను ఉద్దేశపూర్వకంగా వదిలేసిన అధికారులు నిజానికి తీవ్రమైన శిక్షలకు అర్హులు. దోషులు స్వేచ్ఛగా తిరుగుతూ మరింత తెగించేందుకు వీరి చర్య ఉపకరిస్తోంది, వారిని ప్రోత్సహిస్తోంది. నిర్దోషులైనవారు చీకటిగోడలమధ్య మగ్గిపోతూ ప్రాథమికహక్కులను కోల్పోవడమే కాదు, విలువైన కాలాన్నీ, పరువు మర్యాదలను కూడా నష్టపోతారు. ఇలా అక్రమ కేసుల్లో అన్యాయమైపోయినవారిని ఆదుకోవడానికి లా కమిషన్‌ 2018లోనే కొన్ని సూచనలు చేసింది. అలాగే, లోక్‌సభ ముందుకు ఒక ప్రైవేటు బిల్లు వచ్చి కూడా చివరకు మురిగిపోయింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండివుంటే భారత న్యాయ సంహిత (బిఎన్‌ఎస్‌) లో ఇప్పటికే తదనుగుణమైన నిబంధనలు చేరివుండేవి. అక్రమ అరెస్టులమీదే మనుగడ సాగించే రాజకీయవ్యవస్థనుంచి సహకారం ఆశించడం వృధా.

Updated Date - Nov 01 , 2025 | 06:28 AM