Supreme Court Ban on Crackers: సుప్రీం టపాసు
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:11 AM
దీపావళి రాకముందే ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రంగా ఉంది. ఢిల్లీ వాసులు ఏటా అనుభవించే నరకమే ఇది. ఇంకా చెప్పుకోవాలంటే, పొరుగు రాష్ట్రాల్లో పంటవ్యర్థాలను....
దీపావళి రాకముందే ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రంగా ఉంది. ఢిల్లీ వాసులు ఏటా అనుభవించే నరకమే ఇది. ఇంకా చెప్పుకోవాలంటే, పొరుగు రాష్ట్రాల్లో పంటవ్యర్థాలను తగులబెట్టే ప్రక్రియ ఇంకా పతాకస్థాయిని చేరకముందే ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. గత నాలుగురోజుల్లో దేశరాజధానిలోని అధికప్రాంతాల్లో కాలుష్యం ‘పూర్’ నుంచి ‘వెరీపూర్’కు చేరుకుంది. వాతావరణం ఇంత కలుషితంగా ఉన్నస్థితిలోనే, సుప్రీంకోర్టు మొన్న బుధవారం టపాసులు కాల్చుకోవడానికి అనుమతించడం పర్యావరణ ప్రేమికులను ఆశ్చర్యపరిచింది. ‘గ్రీన్ క్రాకర్స్’ను మాత్రమే అనుమతించి, మూడురోజుల పాటు నిర్దిష్టసమయాలను నిర్దేశించినప్పటికీ, కాలుష్యం ఏ స్థాయికి చేరుకుంటుందోనన్న భయం అత్యధికుల్లో ఉంది. ఢిల్లీ, నేషనల్ కాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలో టపాసుల అమ్మకాలమీద ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని ఎత్తివేయించేందుకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం తెగతాపత్రయపడ్డాయి. పండుగపూట టపాసులు కాల్చనివ్వకుండా కేజ్రీవాల్ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, న్యాయస్థానాలను అడ్డుపెట్టుకొని కుట్రలు పన్నుతోందని అప్పట్లో విపక్షంలో ఉన్న బీజేపీ నాయకులు విమర్శించేవారు. ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తరువాత కూడా దీపావళిని కేవలం దీపాలతో సరిపెడితే ఎలా? జనం సెంటిమెంట్‌ను గౌరవించి తీరాల్సిందేనంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు వెంటపడ్డాయి. ప్రజల మనోభిప్రాయాలను సంగతి అటుంచితే, పాలకుల మనోభీష్టం ఏమిటన్నది సుస్పష్టం కనుక, సుప్రీంకోర్టు కూడా సరే కానివ్వమన్నది. చీఫ్ జస్టిస్ గవాయ్ ఆధ్వర్యంలోని బెంచ్ గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే అనుమతించడం ఉపరితలంలో కొంతనయంగా కనిపిస్తున్నప్పటికీ, టపాసులమీద ఇప్పటివరకూ ఉన్న పూర్తిస్థాయి నిషేధాన్ని ఈ ఏడాది ఆ మేరకు సడలించడం విశేషం.
గతంలోనూ ఇలా గ్రీన్ క్రాకర్స్, అంటే తయారీలో బేరియం లవణాలను వినియోగించని టపాసులకు అనుమతి ఇచ్చినప్పటికీ, క్రమంగా ఆ మినహాయింపు కూడా దుర్వినియోగం కావడంతో పూర్తిగా నిషేధించవలసి వచ్చింది. సాధారణ టపాసులతో పోల్చితే ప్రమాదకర వాయువులను, కాలుష్య కారకాలను ఓ మూడోవంతు మేరకు తక్కువ విడుదల చేస్తాయి కనుక వాటికి ఆ పేరు వచ్చిందే తప్ప, అవి పూర్తి కాలుష్యరహితమైనవికావు. గత పాలకుల చొరవ, న్యాయస్థానాల ఆదేశాలు, చేజేతులా వాతావరణాన్ని మనమే కలుషితం చేసుకోవడం ఎందుకన్న జ్ఞానం వల్లనూ దేశరాజధానివాసుల్లో క్రాకర్స్ మీద ప్రేమ ఇటీవలి కాలంలో బాగా తగ్గింది. ఇప్పుడు వాటి తయారీ, వినియోగాన్ని పాక్షికంగానైనా మళ్ళీ అనుమతించినందున, ఢిల్లీ ప్రజల్లో టపాసుల మోజు తిరిగి రాజుకుంటుంది. గతంలో పూర్తి నిషేధం ఉన్నప్పటికీ, పొరుగు రాష్ట్రాలనుంచి ఢిల్లీ రాజధాని ప్రాంతంలోకి టపాసుల అక్రమ సరఫరా ఎంతోకొంత జరుగుతూనే ఉండేది. ఆ కారణంగానే ‘దియాజలావ్’ వంటి కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం పెంచేందుకు గత ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసింది. ఇంతటి కాలుష్యం మధ్యన టపాసుల జోలికి పోవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తులు చేసేది. ఇప్పుడు తక్కువ విషం ఉన్న గ్రీన్‌క్రాకర్స్ వినియోగానికే సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చివుండవచ్చునుగానీ, ప్రభుత్వం ఆశీస్సులతో తయారీ, అమ్మకాలు, వినియోగమూ అనేక రెట్లు హెచ్చి కాలుష్యం అంతిమంగా సాధారణ టపాసుల స్థాయికో, ఇంకా ఎక్కువకో చేరడం ఖాయం. దీనికితోడు, గ్రీన్‌క్రాకర్స్ పేరిట సాధారణ టపాసుల తయారీ గతంలో ఉధృతంగా సాగడం, పర్యవేక్షణ కొరవడటం గతానుభవమే. గత ఏడాది అక్టోబర్ 14న ఢిల్లీ ప్రభుత్వం అన్ని రకాల టపాసులనూ నిషేధించినప్పుడు, సదరు నిర్ణయంలో జాప్యం జరిగినందుకు సుప్రీంకోర్టు పడచీవాట్లు పెట్టింది. ఏ మతమూ వాతావరణాన్ని కలుషితం చేయమని చెప్పదనీ, పౌరుడి ప్రాథమిక ఆరోగ్యహక్కును ప్రభుత్వాలు ఆరునూరైనా పరిరక్షించవలసిందేనని న్యాయస్థానం స్పష్టంచేసింది. ఢిల్లీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి వరకూ ప్రకటించిన ఆ నిషేధాన్ని మార్చివరకూ పెంచిన సుప్రీంకోర్టే ఇప్పుడు పూర్తిభిన్నమైన వైఖరి తీసుకుంది. పంటవ్యర్థాలను తగులబెట్టే పొరుగు రాష్ట్రాల రైతులను ఏ విధంగా నియంత్రించవచ్చు, ఏయే రూపాల్లో శిక్షించవచ్చు అన్న అంశాలను నాలుగువారాల క్రితమే తీవ్రంగా చర్చించిన న్యాయమూర్తులే ఇప్పుడు గ్యాస్ చాంబర్‌లాగా మారిపోయిన ఢిల్లీలో ‘ప్రజల సెంటిమెంట్’ వాదనకు విలువివ్వడం విచిత్రం.