Share News

SC Judges Asset Disclosure: ప్రక్షాళన ప్రయత్నాలు

ABN , Publish Date - May 09 , 2025 | 01:40 AM

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించడం ద్వారా పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ చర్య న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేందుకు చేసిన ప్రాముఖ్యమైన ప్రయత్నంగా నిలిచింది.

SC Judges Asset Disclosure:  ప్రక్షాళన ప్రయత్నాలు

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ ఆస్తిపాస్తుల వివరాలను వెల్లడించి మంచిపనిచేశారు. ఏప్రిల్‌ 1న జరిగిన ఫుల్‌కోర్టు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు, ముప్పైమూడుమంది న్యాయమూర్తుల్లో అత్యధికులు నెలరోజుల్లోనే ఆ వివరాలను ప్రధాన న్యాయమూర్తికి అందించారు. వాటిని సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో ఉంచి పారదర్శకతకు అగ్రప్రాధాన్యం ఇచ్చింది. ఒకరిద్దరివి తప్ప మిగతావారి వివరాలు అంత ఆకర్షించే రీతిలో ఏమీ లేవు. న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు ఇలా ప్రజాక్షేత్రంలో ఉంచడంతో పాటు, గత రెండున్నరేళ్ళుగా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన విస్తృత సమాచారాన్ని కూడా సర్వోన్నత న్యాయస్థానం బహిర్గతపరచింది. కొలీజియం విధానంలో అస్మదీయులకు అగ్రతాంబూలం ఇస్తున్నారని, న్యాయమూర్తుల కుటుంబాలకు చెందినవారితో పోస్టులు నింపేసుకుంటున్నారని ఇటీవల కొందరు నాయకులు దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు నిజానిజాలు తెలియచేసే ప్రయత్నం ఇది. పారదర్శకంగా వ్యవహరించడం ద్వారా న్యాయవ్యవస్థపై విశ్వాసం పెంచాలన్నది జడ్జీల ఆశయం. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహించిన జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో ఇటీవల భారీమొత్తంలో నగదు లభ్యమై, న్యాయవ్యవస్థ విశ్వసనీయతమీద అనుమానాలు రేగిన నేపథ్యంలో ఈ స్వచ్ఛంద ఆస్తుల ప్రకటన జరిగింది. న్యాయమూర్తుల నియామకాలను కొలీజియం గుప్పిట్లోనుంచి తప్పించి, ఎన్‌జేఏసీ అధీనంలోకి తీసుకురావాలని మోదీ ప్రభుత్వం తన తొలివిడత పాలన తొలి ఏడాదిలోనే చేసిన ప్రయత్నానికి సుప్రీంకోర్టు అడ్డంకొట్టి పాలకపెద్దల ఆగ్రహానికి గురైంది. న్యాయవ్యవస్థ ఆత్మరక్షణలోకి జారిన ప్రతీ సందర్భంలోనూ బీజేపీ నాయకులంతా ఎన్‌జేఏసీని గుర్తుచేస్తూనే ఉన్నారు. జస్టిస్‌ వర్మ ఉదంతం వెలుగులోకి రాగానే ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఏ విధంగా స్పందించారో చూశాం. మొన్నటికి మొన్న బిల్లుల ఆమోదం విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్రపతికి కాలపరిమితి విధించినందుకు ధన్‌ఖడ్‌, నిశికాంత్‌ దూబే వంటివారు అంతర్యుద్ధాలు, బ్రహ్మాస్త్రాలు ఇత్యాది పదజాలంతో అమితాగ్రహంతో ఊగిపోయారు. ఇటువంటి సంక్షోభాలను, సవాళ్ళను ఎదుర్కొంటూ, రాజ్యాంగాశయానికి అనుగుణంగా బలంగా నిలబడేందుకు సుప్రీంకోర్టు చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమైనది.


సచ్ఛీలత, రుజువర్తన, ఉన్నత విలువలే న్యాయవ్యవస్థకు బలం. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో మిగతావాటి మాదిరిగా న్యాయవ్యవస్థ నియంత్రణలో ప్రత్యేక బలగాలు, యంత్రాంగాలు లేవు. అయినప్పటికీ, న్యాయవ్యవస్థపట్ల ప్రజల్లో విశ్వాసం, గౌరవం అధికంగా ఉండటానికి కారణం దాని నైతికతే. పేద, ధనిక భేదాలు లేకుండా సర్వులను సమానంగా చూస్తూ, బాధితులకు న్యాయం చేయాలన్న దాని ప్రతీ ప్రయత్నమూ ప్రజల్లో గౌరవాన్ని ఇనుమడింపచేస్తుంది. కొన్ని వివాదాస్పద కేసుల్లో ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు భిన్నంగా తీర్పులు వెలువడినప్పుడు ప్రజాగ్రహంతో పాటు అవినీతి ఆరోపణలను కూడా న్యాయవ్యవస్థ ఎదుర్కోవాల్సి రావచ్చు. రాజ్యాంగ విహితంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వాల నిర్దాక్షిణ్యమైన చర్యలనుంచి పౌరులను, వారి హక్కులను పరిరక్షించినప్పుడల్లా న్యాయవ్యవస్థ కీర్తిప్రతిష్ఠలు పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం. అయితే, ఈ వ్యవస్థలో అవినీతి ఉన్నదని ఇప్పుడే కాదు, ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తే సగానికి సగం జడ్జీలు అవినీతిపరులని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అవినీతి అంటే కేవలం డబ్బుతో ముడిపడింది కాదు. మిగతా అన్ని రంగాల్లోనూ ప్రమాణాలు, నీతినియమాలు నశించిపోతున్న నేపథ్యంలో, ఈ వ్యవస్థ కూడా జారిపోకుండా కాపాడుకోవడం న్యాయమూర్తుల బాధ్యత. బురద అంటుతోందనీ, విశ్వాసం కరుగుతోందని తెలిసినా నిమ్మకునీరెత్తినట్టు ఉండిపోకుండా సమూల ప్రక్షాళనకు నడుంబిగించాల్సిన తరుణం ఇది. ఆస్తిపాస్తుల వివరాలను వెల్లడించడం ద్వారా తాను అందుకు సిద్ధపడుతున్న సంకేతాన్ని న్యాయవ్యవస్థ సమాజానికి ఇచ్చింది.

Updated Date - May 09 , 2025 | 01:41 AM