Share News

Relentless Fight Against Breast Cancer: రొమ్ము క్యాన్సర్‌పై అలుపెరుగని పోరాటం

ABN , Publish Date - Oct 01 , 2025 | 12:59 AM

అక్టోబర్‌ను ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా గుర్తిస్తారు. రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించాల్సిన ఆవశ్యకతను తెలియచెప్పడం...

Relentless Fight Against Breast Cancer: రొమ్ము క్యాన్సర్‌పై అలుపెరుగని పోరాటం

అక్టోబర్‌ను ప్రపంచవ్యాప్తంగా ‘అంతర్జాతీయ రొమ్ము క్యాన్సర్ అవగాహన నెల’గా గుర్తిస్తారు. రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించాల్సిన ఆవశ్యకతను తెలియచెప్పడం, దీని బారినుంచి బయటపడ్డవారిని గౌరవించడం, వారికి ఆశ–ధైర్యం అనే సందేశాన్ని ఇవ్వడం వంటివి ఈ నెలలో నిర్వహిస్తారు. మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు సమాజంలో అవగాహన కల్పించడం, చట్టాలను తయారు చేసే వారిని చైతన్యపరచి, ఈ జబ్బు నిర్మూలనకు చర్యలు తీసుకునేలా చేయడం ఎంతో అవసరం. మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. లక్షమందికి పైగా మహిళలు ఏటా ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి. ఈ వ్యాధిపై మహిళలకు అవగాహన లేకపోవడం, దేశవ్యాప్తంగా ఒక బలమైన స్క్రీనింగ్ కార్యక్రమం లేకపోవడం, ఈ క్యాన్సర్ చికిత్సకు ఆస్పత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వంటివి ఇందులో ప్రధానమైనవి. గ్రామీణ భారతంలో రొమ్ము క్యాన్సర్ ఇంకా ‘రహస్య సమస్య’ గానే మిగిలి ఉన్నది. ఈ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, మహిళలకు శక్తినివ్వాలనే దృఢ సంకల్పంతో 2007లో ‘ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్’ను స్థాపించాను. మా అమ్మగారు కూడా ఈ వ్యాధితో వ్యక్తిగత పోరాటం చేసినందున, ఆమె ధైర్యాన్ని గౌరవిస్తూ ఈ ఫౌండేషన్‌ను ఆమె పేరుతో స్థాపించాను. ఫౌండేషన్ లక్ష్యాన్ని నాలుగు అంశాల్లో ఇలా వివరించవచ్చు. 1) సమాజంలో రొమ్ము క్యాన్సర్‌పై ఉన్న అపోహలు తొలగించి, దాని గురించి ప్రజలందరూ బహిరంగంగా మాట్లాడుకునేలా చేయడం. 2) ఈ సమస్యకు సంబంధించి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో నమ్మకం ఏర్పరచడం. 3) రాజకీయ అవగాహనను కల్పించి, చట్టాలను తయారు చేసే వారు రొమ్ము క్యాన్సర్‌ నిర్మూలనా చర్యలు చేపట్టేలా ప్రభావితం చేయడం. 4) ఈ సమస్యను ప్రజా ఆరోగ్య చర్చల్లో చేర్చడం. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫౌండేషన్‌ తరఫున ‘పింక్ రిబ్బన్’ కార్యక్రమాన్ని ఆరంభించాం. గత పద్దెనిమిది సంవత్సరాల్లో ఇది దేశంలోనే ‘అత్యంత ప్రభావవంతమైన ఆరోగ్య అవగాహన ప్రచారాల’లో ఒకటిగా నిలిచింది. సినీ, ఇతర ప్రముఖులు ఈ సమస్యపై తమ గళాన్ని వినిపిస్తున్నారు. ‘పింక్ రిబ్బన్ వాక్’, ‘పింట్ ది సిటీ పింక్’ వంటివి ఈ ‘అంతర్జాతీయ రొమ్ము క్యాన్సర్ అవగాహన’ నెలలో ఏటా సంప్రదాయాలుగా మారాయి. హైదరాబాద్‌ నగరంలో వరుసగా 16 సంవత్సరాల పాటు అక్టోబర్‌ నెలలో ఏదైనా ఒక రోజున జీహెచ్‌ఎంసీ సిటీ మొత్తాన్ని పింక్‌ లైట్ల వెలుగుతో నింపుతోంది. తద్వారా రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనా కార్యక్రమాల నిర్వహణలో హైదరాబాద్‌ ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా దృష్టి నుంచి ప్రేరణ పొంది బ్రెస్ట్ హెల్త్‌కు సంబంధించి ప్రపంచంలోనే మొదటి మొబైల్ యాప్‌ (ABCs of Breast Health)ను మా ఫౌండేషన్‌ రూపొందించింది. ఇంగ్లీష్‌తో పాటు, 11 ప్రధాన భారతీయ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. మా ‘పింక్ కనెక్షన్’ దక్షిణాసియాలోనే మొదటి త్రైమాసిక బ్రెస్ట్ హెల్త్ మ్యాగజైన్.


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల భాగస్వామ్యంతో మా ఫౌండేషన్‌ తరఫున ‘క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ (సీబీఈ)ను నిర్వహించాం. 2012 నుంచి 2016 వరకు, నాలుగువేల గ్రామాల పరిధిలో 35–65 వయసు మధ్య ఉన్న రెండు లక్షలకు పైగా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు మా ఫౌండేషన్‌ స్క్రీనింగ్‌ నిర్వహించింది. క్యాన్సర్‌ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందించింది. రొమ్ము కాన్సర్‌తో బాధపడుతున్న నిరుపేద మహిళలకు ఇది తక్కువ ఖర్చు కలిగిన మార్గం. 2016లో నేను సభ్యుడిగా ఉన్న ‘కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్టీరింగ్ కమిటీ, టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్’ దీన్ని జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఆమోదించింది. మా ‘పింక్‌ రిబ్బన్‌’ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎంతగానో ప్రభావం చూపింది. ఇటీవల ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా మా ఫౌండేషన్‌ సేవలను అభినందించడం సంతోషాన్ని కలిగించే విషయం. గత ఇరవై ఏళ్లుగా ‘రొమ్ము క్యాన్సర్‌’కు సంబంధించి మా ఫౌండేషన్‌ విస్తృత కార్యక్రమాల్లో భాగస్వామ్యమైంది. అవగాహన కల్పించడం అంటే రొమ్ము క్యాన్సర్‌ సమస్యపై ఒక ఉద్యమాన్ని సృష్టించడమే. ఇప్పటికే ఈ కార్యక్రమాల ద్వారా ఎన్నో ప్రాణాలు రక్షించబడ్డాయి. ఒకప్పుడు నిశ్శబ్దంలో ముంచిన ఈ వ్యాధి గురించి నేడు ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు. ఇంకా చర్చల్లోకి రావాలి. నేటి నుంచి అక్టోబర్‌ నెలంతా ‘రొమ్ము క్యాన్సర్‌’పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. మా ఫౌండేషన్‌ ద్వారా లక్షలాది మంది రోగులకు ఆశ, ధైర్యాన్ని అందించడం నా జీవితంలో అత్యంత గౌరవంగా భావిస్తాను.

డా. పి.రఘురామ్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్

Updated Date - Oct 01 , 2025 | 01:00 AM