Indian Democracy: సర్ సంకటంలో భారత ప్రజాస్వామ్యం
ABN , Publish Date - Jul 17 , 2025 | 01:51 AM
భారత ప్రజాస్వామ్యానికి ఉపశమనం, సందేహం లేదు. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ..
భారత ప్రజాస్వామ్యానికి ఉపశమనం, సందేహం లేదు. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ –సర్)కు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లపై విచారణలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల గురించి నేను ప్రస్తావిస్తున్నాను. సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాలను స్వాగతించవలసిందే. అయితే అసలు సమస్యపై నుంచి మన దృష్టిని మళ్లించే ఒక తీవ్రప్రమాదమూ వాటిలో అంతర్భాగంగా ఉంది. వయోజనులను ఓటర్‌గా నమోదు చేసేందుకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. అలాగే సర్ ప్రక్రియ కేవలం నెల రోజులలో పూర్తి చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. బిహార్‌లోని కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సమగ్ర సవరణకు ఎదురయ్యే అవరోధాలనూ ప్రస్తావించింది. నిజమే, అవన్నీ నిజమైన సమస్యలు, జరూరుగా పరిష్కరించవలసినవి. కానీ, ప్రస్తావిత అంశాలపైనే మన దృష్టి కేంద్రీకృతమైతే ప్రాథమిక ప్రాధాన్యమున్న అంశం ఉపేక్షితమయ్యే అవకాశమున్నది. అది బిహార్‌కు మాత్రమే కాదు, సమస్త భారతదేశాన్నీ ప్రభావితం చేసే అంశమది. మరింత కచ్చితంగా చెప్పాలంటే భారత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య భవిష్యత్తును ప్రతి కూలంగా ప్రభావితం చేసే సమస్య అది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణతో భారత ప్రజాస్వామ్యానికి దాపురించిన ప్రమాదమేమిటో మనం స్పష్టంగా గుర్తించాలి. అది కేవలం బిహార్‌కు మాత్రమే పరిమితమైనది కాదు. బిహార్ ఆరంభం మాత్రమే. ఆ రాష్ట్రంలో ఆ ప్రక్రియను పూర్తి చేసిన తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలోను, అనంతరం దేశవ్యాప్తంగా ఆ ప్రక్రియను అమలుపరిచేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే ‘సర్’ అమలుకు సన్నద్ధమవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఈసీఐ ఆదేశించింది. ‘సర్’ చట్టబద్ధతపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఈసీ ఆ ఆదేశం జారీ చేయడం గమనార్హం. ‘సర్’ కేవలం ఓటర్ల జాబితా సవరణ కాదు. అది ఓటర్ల జాబితాను సమూలంగా సరికొత్తగా రూపొందించడమే. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఓటర్ల జాబితాను ఎలా సృష్టించాలనే విషయమై నియమాలు, విధానాలు, మార్గదర్శక సూత్రాలను తిరగరాయడమే. ఈ ప్రక్రియ వల్ల సార్వత్రిక వయోజన ఓటుహక్కు పునాది సూత్రమే ప్రమాదంలో పడుతుంది. బిహార్ విషయంలో ఉపశమనం లభించినప్పటికీ ఆ ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి తీరాలని మనం డిమాండ్ చేయవలసిన అవసరమున్నది.
సార్వత్రిక వయోజన ఓటు హక్కు మన స్వాతంత్ర్యోద్యమ ప్రధాన లక్ష్యాలలో ఒకటి. 1928లో మోతీలాల్ నెహ్రూ కమిటీ తొట్టతొలుత ఈ సమున్నత లక్ష్యాన్ని ప్రతిపాదించింది. 1929లో లాహోర్ కాంగ్రెస్‌లో ఆమోదించిన పూర్ణ స్వరాజ్ తీర్మానంలో ఆ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. భారత రాజ్యాంగం ‘వయోజన ఓటు హక్కు’ సూత్రాన్ని అధికరణ 326 ద్వారా చేర్చుకున్నది : లోక్‌సభ, శాసనసభలకు వయోజన ఓటుహక్కు విధానంపై ఆధారపడి ఎన్నికలు జరుగుతాయి అనగా భారతీయులై ఉండి, నిర్దేశిత తేదీకి 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటుహక్కు ఉంటుంది’. భారతీయ పౌరసత్వానికి ప్రాతిపదిక భారతదేశంలో పుట్టుక, నివాసంపై ఆధారపడి ఉంటుందని అధికరణ 5 పేర్కొంది. ప్రతి పౌరుడి పౌరసత్వానికి అధికరణ 10 భద్రత కల్పించింది: ‘భారత పౌరుడు అయిన వ్యక్తి, భారత పౌరుడుగా భావించబడే వ్యక్తి తన పౌరసత్వ హక్కును, పార్లమెంటు ఆమోదించే పౌరసత్వ హక్కు సంబంధిత చట్టాలకు లోబడి ఎన్నటికీ కోల్పోడు’. భారత పౌరసత్వానికి సంబంధించి ఈ రాజ్యాంగ బద్ధ హామీని వాస్తవం చేసేందుకు భారత గణతంత్ర రాజ్యం గత 75 ఏళ్లుగా పరిపూర్ణంగా నెరవేర్చింది. వయోజన ఓటుహక్కు ప్రతి ఒక్కరికీ లభించేందుకు, తద్వారా పౌర సత్వ హోదా ప్రతి ఒక్కరికీ కల్పించేందుకు భారత రాజ్య వ్యవస్థ కట్టుబడి ఉన్నదని అనుపమరాయ్ తన పుస్తకం ‘మ్యాపింగ్ ఆఫ్ సిటిజెన్‌షిప్ ఇన్ ఇండియా’లో వివరించారు. ‘అవశేష’ పౌరులకు (వలస, పేదరికం లేదా సామాజిక విధానాలు ఇత్యాది కారణాల వల్ల సమాజంలో సంపూర్ణ భాగస్వామ్యం నుండి మినహాయింపబడిన వ్యక్తులు) సైతం ఓటింగ్ హక్కులు నిరాకరించడం జరగలేదు. కనుకనే స్వతంత్ర భారతదేశంలో ఓటు వేయడమనేది ఒక లౌకిక ఆచారంగా రూపొంది పవిత్ర హోదాను సంతరించుకున్నదని రాజకీయ మానవశాస్త్రవేత్త ముకూలికా బెనర్జీ వాదించారు.
ఆమె వాదన విస్తృత ఆమోదం పొందింది. ఈ శుభ పరిణామం యాదృచ్ఛికంగా సంభవించలేదు. ఏ ఒక్క వయోజనుడు మినహాయింపబడకుండా ఓటర్ల జాబితాలో స్థానం పొందేందుకు అవసరమైన చట్టాలు చేసి, వాటిని అమలుపరుస్తున్నారు. అమెరికా, ఇతర ప్రజాస్వామ్య దేశాలలో ఓటరుగా నమోదయేందుకు స్వయంగా ప్రతివ్యక్తి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అయితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఓటుహక్కుకు అర్హుడైన ప్రతి పౌరుడినీ ఓటరుగా నమోదు చేసే బాధ్యతను రాజ్య వ్యవస్థపై మోపింది. ఈ కారణంగా అమెరికాలో మొత్తం వయోజనులలో 74 శాతం మంది మాత్రమే ఓటర్ల జాబితాలో ఉండగా మన దేశంలో 96 శాతం మంది వయోజనులు ఓటర్ల జాబితాలో ఉంటున్నారు. ఓటర్ల జాబితాలో నమోదుకు వ్యక్తులు విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే భారత పౌరుడు అయిన ప్రతి వయోజనుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యత అంతిమంగా ఎన్నికల అధికారులపై ఉంచారు. ఓటుహక్కుకు అర్హుడైన ఏ వయోజనుడినీ ఓటర్ల జాబితాల చేర్చకుండా వదిలివేయకూడదు. నిర్దిష్ట ప్రాంతంలో నివాసముంటున్న ప్రతి వ్యక్తినీ పౌరుడుగా భావించి, అతని పేరు విధిగా ఓటర్ల జాబితాలో చేర్చాలి. అయితే నిర్దిష్ట ప్రదేశంలో నివాసం ఉండకపోవడం, మానసిక అస్వస్థత, నేరాలకు పాల్పడడం, అవినీతి, చట్ట వ్యతిరేక చర్యలు మొదలగు కారణాలపై రాజ్యాంగం క్రిందగానీ, మరేదైనా శాసనం క్రిందగానీ ఓటర్లుగా అనర్హులైనవారికి ఓటర్లుగా నమోదయ్యే అర్హత ఉండదు’ అని రాజ్యాంగ అధికరణ 326 స్పష్టం చేసింది. ఒకసారి ఓటరుగా నమోదైన తరువాత సరైన ప్రక్రియను అనుసరించకుండా ఎవరి పేరునూ ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదు.
ఓటర్ల నమోదు ప్రక్రియలో వదిలివేయబడిన సంచార సామాజిక సమూహాలకు చెందినవారు, ఇల్లూ వాకిలి లేనివారు, సెక్స్ వర్కర్స్, ట్రాన్స్‌జెండర్ పర్సన్స్, అనాధలు, సరైన డాక్యుమెంట్లు లేనివారు, ప్రవాస భారతీయులను సైతం ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఈసీఐ కట్టుబడి, మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తున్న నేపథ్యంలో, సర్ ప్రక్రియ ఆ సదాశయానికి పూర్తి వ్యతిరేకమైనది. పరిధిని విస్తరిస్తూ, విస్తృత చేర్పులతో సార్వత్రక వయోజన ఓటుహక్కు పునాదిని బలోపేతం చేసే లక్ష్యం బలహీనపడుతుంది. చెప్పవచ్చినదేమిటంటే ‘సర్’ ప్రక్రియ డాక్టర్ అంబేడ్కర్ పేర్కొన్న పౌరసత్వ క్రమానుగత అసమానత (Graded Inequality of Citizenship)లకు దారితీస్తుంది. ప్రతిపౌరుడినీ ఒక రాజకీయ సమూహంలో స్వేచ్ఛాయుత, సమాన భాగస్వామిగా చేయడంలో భారత రాజ్య వ్యవస్థ విఫలమయింది. రాజనీతి శాస్త్రవేత్త టిహెచ్ మార్షల్ మాటల్లో చెప్పాలంటే అధికారిక రాజకీయ రంగం నుండి ఒక ముఖ్యమైన సామాజిక రంగం వైపు పరివర్తన అనేది జరగలేదు. నీరజా గోపాల్ తన ‘Citizenship Imperilled :Indias Fragile Democracy’లో రాజకీయ మార్పులు, సామాజిక ఉద్యమాల ప్రభావంతో పౌరసత్వ భావనను నిర్వచిస్తున్న, పౌరసత్వాన్ని పొందుతున్న పద్ధతులు, పౌరసత్వం రద్దు కావడమనే మార్పులను వివరంగా పేర్కొన్నారు. వీటి కారణంగా పౌరసత్వం పరిపూర్ణత పొందకపోగా అధికారిక పౌరసత్వం క్షీణించి పోతుందని ఆమె వ్యాఖ్యనించారు. ఈ తిరోగామి మార్పులు ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ ప్రక్రియతో మరింత వేగవంతమవుతున్నాయి. ఫలితంగా పౌరసత్వ ప్రాతిపదిక జస్ సోలి (పుట్టుక నివాసం ఆధారంగా పౌరసత్వాన్ని పొందడం) అనే సూత్రం నుంచి జస్ సాంగులిన్ (తల్లిదండ్రుల వారసత్వం ఆధారంగా పౌరసత్వాన్ని ఇవ్వడం) అనే సూత్రానికి మారుతోందని నీరజా జయాల్ వ్యాఖ్యానించారు.
సార్వత్రిక వయోజన ఓటుహక్కు అమలయ్యేందుకు దోహదం చేస్తున్న ఆచరణలు అన్నిటినీ సర్ తలకిందులు చేస్తోంది. తొలుత ఓటర్ల జాబితాలో తమ పేరు ఉండేలా చేసుకునే బాధ్యతను ఓటుహక్కుకు అర్హులైనవారిపైనే మోపింది. ఎన్యూమరేషన్ ఫామ్‌లను సకల వివరాలతో నింపి, సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో సహా సమర్పించాలని ఎటువంటి మినహాయింపు లేకుండా సంభావ్య ఓటర్లు అందరినీ సర్ నిర్దేశించింది. ఓటర్లకు ఇటువంటి పరిస్థితి కల్పించడం ఇదే మొదటిసారి. నిర్దేశించిన రీతిలో ఎన్యూమరేషన్ ఫామ్‌లను ఇవ్వనిపక్షంలో ముసాయిదా ఓటర్ల జాబితాలో సైతం సంబంధితుల పేర్లు చోటు చేసుకోవని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 2003 నాటి ఓటర్ల జాబితాలో పేరు లేని పక్షంలో ఓటర్ల జాబితాలో ఉన్నప్పటికీ ప్రయోజనముండదు (అసలు 2003ను కటాఫ్ పాయింట్‌గా తీసుకోవడమే అర్థరహితం. ఆనాడు ఆ జాబితా తయారీలో కూడా పౌరసత్వ ధ్రువీకరణ డాక్యుమెంట్ల ద్వారా జరగనే లేదు. మరో ముఖ్యమైన బాధ్యత మీరు చట్టవిరుద్ధంగా దేశంలో నివసించడం లేదనే విషయాన్ని మీరు నిరూపించుకోవల్సిన అవసరమున్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ, తమ పేరు ఉన్నట్టు రుజువు చేస్తున్న 2003 ఓటర్ల జాబితా కాపీని, బర్త్ సర్టిఫికెట్, నివాసానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని కూడా సమర్పించవలసి ఉంటుంది. ఇలా జరగడం కూడా ఇదే మొదటిసారి. గమనార్హమైన విషయమేమిటంటే ప్రభుత్వం వీటిని ఎవరికీ సమకూర్చలేదు. వాటిని విధిగా సమకూర్చుకోవల్సిన అవసరం అత్యధికులకు లేదు. బిహార్‌లో సర్ గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోంది. ఏక కాలంలో విషాదమూ, ప్రహసనమూ చోటు చేసుకుంటున్నాయి. సర్‌ను అమలుపరుస్తోన్న అధికారుల అసమర్థతే అందుకు కారణమా? అదే కావచ్చు. అయితే అధికారుల అసమర్థత అసలు సమస్య కాదనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. ఎన్నికల సంఘం అమలుపరుస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పథకమే దురుద్దేశపూరితమైనది, రాజ్యాంగ విరుద్ధమైనది, ప్రజాస్వామ్య వ్యతిరేకమైనది.
-యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)