Share News

School Memories: బడులొచ్చేశాయి

ABN , Publish Date - Jun 12 , 2025 | 06:42 AM

ఆకులన్నీ రాల్చుకుని బట్టల్లేని నగ్నశిశువులా వొంటరిగా నిల్చొని ఉంది వేసవి బడి..

School Memories: బడులొచ్చేశాయి

ఆకులన్నీ రాల్చుకుని

బట్టల్లేని నగ్నశిశువులా

వొంటరిగా నిల్చొని ఉంది వేసవి బడి..

గిల్లి దండా, క్రికెట్, కబడ్డీ ఆటలన్నీ ఆడేసి

పిల్లలంతా ఒంటరిగా వొదిలేసి వెళ్ళిన

నేలచెక్కలా ఖాళీగా పడివుంది మైదానం.

కూలీలు లాక్‌డౌన్ ప్రకటించి

బోసిపోయిన గోడలతో

మిగిలిపోయిన ఫ్యాక్టరీలా

మౌనంగా రోదిస్తుంది ఖాళీగా ఉన్న బడి.

కోతలన్నీ ముగిసిపోయి

పేదజనం పరిగెలన్నీ ఏరుకొని వెళ్ళిపోయాక

కొంగలు కూడా పలకరించని

ఎండిన చెరువులా దీనంగా పడి ఉంది

ఆ బడి కమతం.

నిన్నంతా కాశీ అన్నపూర్ణమ్మ

నుదుటి బొట్టులా

ఆకాశాన్ని వెలిగించిన చందమామ

చుక్కలతో సహా పలాయనం

చిత్తగించిన ఆకాశంలాగా

ఖాళీగా, తేజోవిహీనంగా

వసంతం సమ్మె చేసిన తోటలా ఉంది

నిన్నటి పిల్లలు లేని బడి..

కుందేలు పిల్లల్లా

గున గున పరుగులు తీసే

పచ్చని తోటలా

అక్షరజ్యోతులను వెలిగించే బడులొచ్చేశాయి.

– ఈతకోట సుబ్బారావు

Updated Date - Jun 12 , 2025 | 06:43 AM