Share News

Tamilnadu Politics: గత్యంతరం లేక

ABN , Publish Date - May 06 , 2025 | 02:13 AM

తమిళనాడు మంత్రులు సెంథిల్‌ బాలాజీ, పొన్ముడి లు న్యాయస్థానాల ఒత్తిడి వల్ల రాజీనామా చేయాల్సి వచ్చింది. డీఎంకె ప్రభుత్వం వారి అవినీతికి మద్దతు ఇచ్చినందుకు తీవ్ర విమర్శల పాలైంది.

Tamilnadu Politics: గత్యంతరం లేక

న్యాయస్థానాలతో మొట్టికాయలు వేయించుకోవడం, అదికూడా ఎన్నికలు ఇంకో ఏడాదిలో ఉండగా ఏ ప్రభుత్వానికైనా ఇబ్బందికరమైన విషయమే. తమిళనాడు మంత్రివర్గంనుంచి ఇటీవల ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం వెనుక చాలా అంశాలు పనిచేశాయి. ఓ వారం గడువు ఇచ్చి, పదవికావాలో, జైలుకావాలో తేల్చుకోమని సుప్రీంకోర్టు చెప్పిన తరువాత, తన బెయిల్‌ రద్దుకావడం ఖాయమని సెంథల్‌ బాలాజీకి అర్థమైపోయింది. సెంథిల్‌ విషయంలో డీఎంకె ప్రభుత్వం ఆదినుంచీ ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తూవచ్చిందో తెలియనిదేమీ కాదు. మరోమంత్రి పొన్ముడి కూడా హిందూమత సంబంధిత వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా మద్రాస్‌ హైకోర్టుతో చీవాట్లు తిని రాజీనామా చేయాల్సివచ్చింది. ఏడాదిలో ఎన్నికలున్న నేపథ్యంలో, న్యాయస్థానాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రులను గ్రక్కున విడవకపోతే, వారి నిష్క్రమణ వల్ల రేపటి ఎన్నికల్లో కలిగే రాజకీయనష్టం కంటే ప్రజల్లో ముందుగానే అప్రదిష్టపాలవుతామన్న భయం డీఎంకె అధినాయత్వాన్నీ వెంటాడి ఉంటుంది.

వీరి రాజీనామాలను డీఎంకె నాయకులు ఏ విధంగానైనా సమర్థించుకోవచ్చును గానీ, న్యాయస్థానాలే వీళ్ళిద్దరినీ బయటకు గెంటేశాయన్నది వాస్తవం. సెంథిల్‌ రాజీనామా విషయం తెలియగానే, ఆయన బెయిల్‌ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. క్యాష్‌ ఫర్‌ జాబ్స్‌ కుంభకోణంలో ఉన్న మంత్రిగారు బయటవుంటే అందరినీ ప్రభావితం చేస్తారు కనుక, మళ్ళీ జైలుకు పంపేయాలని ఒక బాధితుడితోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ కూడా కోరిన విషయం తెలిసిందే. కేసు తేలేవరకూ సెంథిల్‌కు మళ్ళీ మంత్రిపదవి ఇవ్వకూడదన్న నిబంధన విధించాలంటూ న్యాయమూర్తిని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అభ్యర్థిస్తూ, ఆ నియమం లేకుంటే మరో నెలలో, అంటే, మే 24న సదరు న్యాయమూర్తి రిటైర్ అయిన మర్నాడే సెంథిల్‌ మళ్ళీ మంత్రి అయిపోవచ్చునని ఓ హెచ్చరిక కూడా చేశారు. అదేకనుక జరిగితే అప్పుడు మళ్ళీ బెయిల్‌ రద్దుకోసం రండి అంటూ న్యాయమూర్తి అన్నారు. నిజానికి, సెంథిల్‌ బాలాజీ విషయంలో డీఎంకె ఆదినుంచీ అదేరీతిన వ్యవహరిస్తూ వచ్చింది. 2023 జూన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ ఈయనను అరెస్టుచేసింది.


ఈ కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయని నిర్ధారించినప్పటికీ, దర్యాప్తు సాగక, బాలాజీ అన్యాయంగా జైల్లో మగ్గిపోతున్నారని, 21వ అధికరణ ఉల్లంఘన జరుగుతోందని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు గత ఏడాది సెప్టెంబర్‌లో బెయిల్‌ మంజూరుచేసింది. డీఎంకె శ్రేణుల ఘనస్వాగత సత్కారాల మధ్య జైలు నుంచి బయటకు వచ్చిన సెంథిల్‌ను నలభైఎనిమిదిగంటల్లోనే స్టాలిన్‌ మళ్ళీ మంత్రిని చేసేశారు. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్‌ మాత్రమే ఇచ్చిందనీ, నిర్దోషి అనలేదని స్టాలిన్‌కు తెలియకపోదు.

జయలలిత హయాంలో ప్రభుత్వ రవాణాసంస్థలో ఉద్యోగాలు అమ్ముకున్న ఆరోపణలమీద సిట్‌ దర్యాప్తులో సెంథిల్‌ కుట్రంతా వెలుగుచూసి న్యాయస్థానాలకు చేరింది. నిజానికి, సెంథిల్‌ అవినీతిమీద విపక్షనేతగా స్టాలిన్‌ స్వయంగా పోరాడారు. తాను శాసనసభలో సాక్ష్యాలు సమర్పించినా చర్యలు లేనందుకు జయలలిత ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ తరువాత జయలలిత దూరం పెడితే డీఎంకెలో చేరిన సెంథిల్‌ను చేరదీసి, మరింత నిస్సిగ్గుగా ఆయన పక్షాన వ్యవహరించడం ఆరంభించారు.

సెంథిల్‌ పదవిలో ఉంటే దర్యాప్తు ప్రక్రియకు విఘాతం కలుగుతుందంటూ అప్పట్లో రాజ్‌భవన్‌ సస్పెండ్‌ చేస్తూ ఇచ్చిన ప్రకటన ఇప్పుడు చాలామందికి గుర్తుకొస్తున్నది. సెంథిల్‌ జైల్లో ఉన్నా కూడా ఎనిమిదినెలలపాటు పోర్టుఫోలియో లేని మంత్రిగా కొనసాగారు. క్యాష్‌ ఫర్‌ జాబ్స్‌, మనీలాండరింగ్‌ ఆరోపణలతో పాటు, అంతకుపూర్వంనుంచే ఆయనపై అనేక క్రిమినల్‌ కేసులున్నాయి. అటువంటి వ్యక్తిని ఇప్పుడు సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పదవినుంచి తప్పించినప్పటికీ, ఒక అవినీతిపరుడిని వెనకేసుకొచ్చిన అప్రదిష్ఠ స్టాలిన్‌కు తప్పదు. మరో మంత్రి పొన్ముడి సైతం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో ఇరుక్కొని, కేవలం న్యాయస్థానాల ఉపశమనాల కారణంగా బయట తిరుగుతూ, చిత్తం వచ్చినట్టు మాట్లాడుతూ స్వేచ్ఛను దుర్వినియోగం చేసినవారే. కోర్టుల కారణంగా ఈ ఇద్దరు మంత్రులను వదిలించుకున్నంత మాత్రాన స్టాలిన్‌కు అంత సులభంగా మచ్చ తొలిగిపోదు.

Updated Date - May 06 , 2025 | 02:14 AM