Share News

Supreme Court: మధ్యేమార్గం

ABN , Publish Date - Sep 18 , 2025 | 06:03 AM

వక్ఫ్‌ సవరణ చట్టమే దురుద్దేశపూరితమైనది కనుక, ఓ మూడు నిబంధనలను సర్వోన్నతన్యాయస్థానం నిలిపివేసినంతమాత్రాన సంతోషించాల్సిందేమీ.....

Supreme Court: మధ్యేమార్గం

క్ఫ్‌ సవరణ చట్టమే దురుద్దేశపూరితమైనది కనుక, ఓ మూడు నిబంధనలను సర్వోన్నతన్యాయస్థానం నిలిపివేసినంతమాత్రాన సంతోషించాల్సిందేమీ లేదని మైనారిటీ నేతల అభిప్రాయం. కుట్రపూరిత ఆలోచనలూ లక్ష్యాలతో తయారైన చట్టాన్ని సమూలంగా కొట్టివేయాల్సి ఉండగా, చిన్నపాటి సవరణలతో దానిని మొత్తంగా అనుమతించిన సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు మైనారిటీలకు ఏ మాత్రం ఉపశమనాన్ని కల్పించలేదని వారి బాధ. వక్ఫ్‌ స్ఫూర్తికి పూర్తిభిన్నంగా, ఆ ఆశయాలను వమ్ముచేస్తూ పలు వివాదాస్పద ప్రతిపాదనలను గుదిగుచ్చిన ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు సరేననడం సరికాదంటున్నారు వారు. ఇది రాజీమార్గం కాదు, కీలక నిబంధనలను కాదంటూ మిగతా చట్టాన్ని అనుమతించడం ద్వారా సుప్రీంకోర్టు మధ్యేమార్గాన్ని ఎంచుకొని మంచిపనిచేసిందని మిగతావారంటున్నారు. ఇది మా విజయం అని పాలకులు కూడా సంబరపడుతున్నందున అసలు విజేతలు ఎవరో, న్యాయం ఎవరికి దక్కిందో ఒక పట్టాన అర్థంకాదు.


అంతిమతీర్పు మిగిలే ఉంది. ఇంతలోగా ఆ కొన్ని ఆదేశాలు తాత్కాలిక ఉపశమనం. ఇది ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అని విపక్షాలు అంటున్నాయి. ముస్లిం ధార్మిక సంస్థల నిర్వహణను, వాటి మీద ప్రభుత్వపెత్తనాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని అంటున్నాయి. ఏది వక్ఫ్‌ ఆస్తి, ఏది కాదన్నది నిర్ణయించే అధికారం కలెక్టర్‌కు లేదని తేల్చేయడం పిటిషన్‌దారులకు పెద్ద ఉపశమనం. తరతరాలుగా వాడుకలో ఉన్న వక్ఫ్‌ ఆస్తిని జిల్లా కలెక్టర్‌ కాదని నిర్ధారించడంతోనే అది తన స్వరూపస్వభావాలు కోల్పోయే ప్రమాదాన్ని కోర్టు నివారించింది. ఆస్తులపై వివాదాలు ఎందుకు రేగుతాయో తెలిసిందే కనుక, తగువు తీర్చడానికి సిద్ధపడిన కలెక్టర్‌ ఏ మేరకు న్యాయం చేయగలుగుతారో ఊహించవచ్చు. అంతిమనిర్ణయాన్ని అటుంచితే, వివాదం రేగిన మరుక్షణం నుంచే అది వక్ఫ్‌ ఆస్తికాకపోవడం వంటి ప్రమాదకరమైన అంశాలు సైతం ఈ నిబంధనలో ఉన్నాయి. వక్ఫ్‌ ఆస్తిగా గుర్తించడానికి వాంగ్మూలాలు, దశాబ్దాల వినియోగం, చారిత్రక ఆధారాలు కాక, సర్వేలు, రికార్డులు, లిఖితపూర్వక దస్తావేజులు ఉండాల్సిందేనని కొత్త నిబంధనలు రాసుకున్నాక కలెక్టర్‌ తీర్పు ఊహకు అందనిదేమీ కాదు. అత్యధికశాతం వక్ఫ్‌ ఆస్తులు దురాక్రమణలోనో, వివాదంలోనో ఉన్నప్పుడు నిజనిర్ధారణ జరగాల్సిందే కానీ, కలెక్టర్‌ న్యాయాధికారి కాకూడదన్నది సుప్రీం అభిప్రాయం. ట్రిబ్యునళ్ళలోనూ, కోర్టుల్లోనూ తేలాల్సిన వ్యవహారాన్ని కార్యనిర్వాహకవర్గం తన చేతుల్లోకి తీసుకోవడం కోర్టుకు నచ్చలేదు. ఐదేళ్ళుగా ఇస్లాంను ఆచరిస్తున్నవారే ఆస్తుల దానానికి అర్హులన్న నిబంధన కూడా ఇటువంటిదే. ఆచరణ అంటే ఏమిటో, ఎవరు ఎలా అందుకు అర్హులవుతారో చట్టం చెప్పలేదు కనుక, తమ ఆస్తిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకొనే రాజ్యాంగ హక్కు, అధికారం పౌరులకు ఉన్నందున ప్రభుత్వాలు ఈ అంశాన్ని తేల్చేంతవరకూ దీనిని కూడా కోర్టు నిలిపివేసింది.


ఆస్తి నిర్వచనం నుంచి, వక్ఫ్‌బోర్డుల అధికారాలు, ట్రిబ్యునళ్ళ నిర్ణయాలను తిరగదోడటం వరకూ ప్రతీ అంశాన్నీ తన చేతుల్లోకి తీసుకొని వక్ఫ్‌ ఆస్తులపై పూర్తిపెత్తనం సాధించాలన్న లక్ష్యంతో ఈ చట్టం తయారైందన్నది ప్రధాన ఆరోపణ. వక్ఫ్‌ సంస్థల్లోకి ముస్లిమేతరులను ప్రవేశపెట్టడం అందుకు మార్గం సుగమం చేస్తుందన్న భయాలు నెలకొన్న తరుణంలో ఆ ప్రయత్నానికి సుప్రీంకోర్టు ముకుతాడు వేసింది. సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌లోని 22 మంది సభ్యుల్లో నలుగురు, స్టేట్‌ బోర్డుల్లోని 11 మందిలో ముగ్గురు మాత్రమే అన్యమతస్థులను కోర్టు అనుమతించింది. అయితే, ముస్లిమేతర మతాలకు చెందిన ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థల్లో ముస్లింలకు చోటులేనప్పుడు, కేవలం వక్ఫ్‌బోర్డుల్లో అన్యమతస్థులు ఎందుకు అని ప్రశ్నిస్తున్నవారికి ఈ వెసులుబాటు నచ్చకపోవడం సహజం, సముచితం. కొత్త వక్ఫ్‌చట్టం రాజ్యాంగ విహితమైనదో కాదో తేల్చేవరకూ ఈ మధ్యంతర ఉత్తర్వుల ద్వారా సర్వోన్నత న్యాయస్థానం పాలకుల దూకుడుకు కాస్తంత అడ్డుకట్టవేసింది. మిగతా కీలక నిబంధనలన్నింటినీ అనుమతించినందున కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉన్నదని ప్రభుత్వం భావించడంలో తప్పులేదు. వక్ఫ్‌భూముల వివాదాలను, దురాక్రమణలను పరిష్కరించి, నిర్వహణను చక్కదిద్దాలని అందరూ కోరుకుంటున్నదే. కానీ, ముస్లిం పెద్దలు, పర్సనల్‌ లాబోర్డుతోనే కాదు, కనీసం విపక్షాలతో కూడా సంప్రదింపులు జరపకుండా, చట్టసభలో విస్తృతచర్చ లేకుండా దానిని ముందుకు తోయడం సరికాదు. సర్వోన్నత న్యాయస్థానం అంతిమంగా ఏమి చెబుతుందన్నది అటుంచితే, ఏకాభిప్రాయసాధనకు ఇంకా సమయం మించిపోలేదు.

Updated Date - Sep 18 , 2025 | 06:03 AM