Social Justice Movement: ఈదుమూడిలో వర్గీకరణ విజయోత్సవం
ABN , Publish Date - Jul 05 , 2025 | 01:10 AM
ఈ ఏడాది ఉభయ తెలుగు రాష్ట్రాలలో, దేశంలోనూ కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాలు జరిగాయి. ఈ ఏడాదికి వర్గీకరణ నామ సంవత్సరంగా ప్రాధాన్యం ఉంది.
వేలాది మాదిగ ఉద్యమ కార్యకర్తలు కనీ వినీ ఎరుగని స్థాయిలో దండోరా మహోద్యమాన్ని నిర్మించారు. దీనితో పౌర సమాజం మాదిగల న్యాయమైన ఉద్యమానికి సంఘీభావంగా నిలబడింది. సమాజంలోని ప్రజాసంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, చివరికి అత్యున్నత న్యాయవ్యవస్థ కూడా మాదిగలకు న్యాయం చెయ్యాలని సంకల్పించాయి.
ఈ ఏడాది ఉభయ తెలుగు రాష్ట్రాలలో, దేశంలోనూ కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాలు జరిగాయి. ఈ ఏడాదికి వర్గీకరణ నామ సంవత్సరంగా ప్రాధాన్యం ఉంది. అంతేకాదు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం, ఈదుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) స్థాపితమై ఈ నెల ఏడో తేదీకి ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌లోని వివిధ గ్రూపులు, మాదిగ సంఘాలు, మాదిగ దండోరా ఉద్యమ సీనియర్ నాయకులు, కార్యకర్తలు జూలై ఏడున ఈదుమూడి గ్రామం వేదికగా జాతీయ స్థాయి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మహోత్సవాన్ని జరపాలని తలపెట్టారు. ఆ రోజు ఉదయానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వర్గీకరణ ఉద్యమ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమాభిమానులు పెద్ద సంఖ్యలో ఈదుమూడి గ్రామానికి చేరుకోనున్నారు.
1994 జూలై ఏడో తేదీన ఎమ్మార్పీఎస్ ప్రారంభించిన నాడు, ఐదేళ్లలో రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ (వర్గీకరణ) సాధించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే, ప్రారంభించిన మూడేళ్లలోనే తన లక్ష్యాన్ని ఎమ్మార్పీఎస్ చేరుకున్నది. 1997 జూన్ ఆరో తేదీన హైదరాబాద్ అసెంబ్లీ దిగ్బంధనం సందర్భంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 68, 69 జీవోలను విడుదల చేసింది. కాగా, జాతీయ ఎస్సీ కమిషన్‌ను సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు విడుదల చెయ్యడం... అధికరణం 338 ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని, మాల కులస్తులలో వర్గీకరణ వ్యతిరేకులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఈ జీవోలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం వర్గీకరణ పరిరక్షణ కొరకు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
అయితే, ఏక నాయకత్వం పేరుతో చెలామణిలోకి వచ్చిన మాదిగ నాయకుడు చేసిన డిమాండ్ మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నది. ఆనాడు ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకునేలా ఏక నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఉండకపోతే– రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరణ చేసి తీరాల్సిందేనని 2024 ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు... పాతికేళ్ల క్రితమే వచ్చి ఉండేది. దానివల్ల వర్గీకరణ సమస్య అప్పట్లోనే పరిష్కారమై ఉండేది. ‘ఏక నాయకత్వం’ ఏకపక్ష విధానాల వల్ల తదుపరి 25 ఏళ్లకు పైగా మాదిగ దండోరా ఉద్యమం సుదీర్ఘ సాగతీతకు లోనయ్యింది. కమ్యూనిటీకి, అణగారిన కులాలు, జాతులకు ఈ లోగా అపార నష్టం జరిగిపోయింది.
అయినప్పటికీ, వేలాది మాదిగ ఉద్యమ కార్యకర్తలు, నాయకులు చదువులు, వృత్తులు, ఉద్యోగాలను, వారి ఆదాయ మార్గాలను, కుటుంబాలను వదిలిపెట్టి, ఎంతో పట్టుదలతో, దీక్షతో గ్రామాల్లోని ప్రతీ మాదిగ పల్లెకూ విద్య, ఉద్యోగ వర్గీకరణ హక్కుల సాధనా సందేశాన్ని తీసుకెళ్లారు. లక్షలాది మందిని కూడగట్టారు. కనీ వినీ ఎరుగని స్థాయిలో దండోరా మహోద్యమాన్ని నిర్మించారు. దీనితో పౌర సమాజం మాదిగల న్యాయమైన ఉద్యమానికి సంఘీభావంగా నిలబడింది. సమాజంలోని ప్రజాసంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చివరికి అత్యున్నత న్యాయవ్యవస్థ కూడా మాదిగలకు న్యాయం చెయ్యాలని సంకల్పించాయి. ఎట్టకేలకు సుదీర్ఘమైన ఉద్యమంతో, రాజ్యాంగ సంరక్షణల్లో తమ భాగస్వామ్య హక్కులను పొందే లక్ష్యాన్ని ఈ ఏడాది నెరవేర్చుకోగలిగారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాధించుకున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆర్డినెన్సు, చట్టం, జీవోలు విద్య, ఉద్యోగ అవకాశాల ఆస్తి పంపక పత్రాలు. వీటి సాధన వెనుక, పది మంది కార్యకర్తల, నాయకుల ప్రాణత్యాగాలు ఉన్నాయి. వేలాది మంది కార్యకర్తలు, నాయకులు జైళ్ల పాలై, కేసుల పాలై, కుటుంబాలు ఛిద్రమై, ఆర్థికంగా దెబ్బతిని, అనారోగ్యాల పాలై, యవ్వనాలను త్యాగం చేసి, ఉద్యమించిన చరిత్ర ఉంది. ఎంతో సంతోషకరమైన, ఉద్వేగభరితమైన ఈ వర్గీకరణ విజయోత్సవ ఆత్మీయ కలయికకు రెండు రాష్ట్రాల నుంచి మాదిగ, మాదిగ అనుబంధ కులాల కార్యకర్తలు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో ఈదుమూడికి తరలి రావాలి. మాదిగ, మాదిగ అనుబంధ కులాల సమగ్ర అభివృద్ధికి, రాజ్యాధికార సాధన కోసం భవిష్యత్తులో జరిగే అన్ని కార్యక్రమాలలో సహకారంతో, సమన్వయంతో కలిసి ముందుకు సాగుదాం. ఈదుమూడిలో జూలై ఏడో తేదీన జరగనున్న ‘ఎస్సీ వర్గీకరణ జాతీయ విజయోత్సవం’ సందర్భంగా మాదిగ ఉద్యమానికి అండగా నిలిచిన, పౌర సమాజానికి, ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలు, సుప్రీంకోర్టుకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు.
-కృపాకర్ మాదిగ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి
, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి