Share News

Zhoran Mamdani New York Mayor: కాంతిరేఖ మమ్దానీ

ABN , Publish Date - Nov 06 , 2025 | 05:15 AM

బాలీవుడ్‌ దర్శకురాలు మీరా నాయర్‌ (నయ్యర్‌) పుత్రరత్నం న్యూయార్క్‌ మహానగరం మేయర్‌ అయ్యాడు. ముప్పైనాలుగేళ్ళ జోహ్రాన్‌ క్వామే మమ్దానీ నూటముప్పైయేళ్ళలో ఆ మహానగరం తొలిపౌరుడిగా...

Zhoran Mamdani New York Mayor: కాంతిరేఖ మమ్దానీ

బాలీవుడ్‌ దర్శకురాలు మీరా నాయర్‌ (నయ్యర్‌) పుత్రరత్నం న్యూయార్క్‌ మహానగరం మేయర్‌ అయ్యాడు. ముప్పైనాలుగేళ్ళ జోహ్రాన్‌ క్వామే మమ్దానీ నూటముప్పైయేళ్ళలో ఆ మహానగరం తొలిపౌరుడిగా ఎన్నికైన పిన్నవయస్కుడే కాదు, తొలి ముస్లిం, దక్షిణాసియామూలాలున్న తొలివ్యక్తి కూడా. మమ్దానీ తన విజయోత్సవ ప్రసంగంలో మార్పు మొదలైందని గర్జించాడు. తదనుగుణంగా జవాహర్‌లాల్‌ నెహ్రూ చరిత్రాత్మక ‘ట్రిస్ట్‌ విత్‌ డెస్టినీ’ నుంచి కొన్ని వాక్యాలను ఉటంకించాడు. రెండు చేతులా నమస్కరిస్తూ వేదికమీదకు చీరకట్టులో వచ్చిన పంజాబీ తల్లినీ, గుజరాతీ మూలాలున్న తండ్రినీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. పాత వదిలి కొత్తలోకి అడుగుపెడుతున్న ఈ ఘట్టాన్ని ట్రంప్‌ వింటున్నారు, కంటున్నారంటూ హెచ్చరికలు చేసిన మమ్దానీ, తన విజయదుందుభి ట్రంప్‌ చెవుల్లో మారుమోగాలని కాబోలు, బాలీవుడ్‌ గీతం ‘ధూమ్‌ మచాలే’ని ఈ వేడుకకు నేపథ్యగీతం చేశాడు. మిగతా ప్రపంచాన్ని పలు రకాలుగా బెదిరిస్తూ, వీరంగాలు వేస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌కు జోహ్రాన్‌ మమ్దానీ విజయం నైతికంగా పెద్ద ఎదురుదెబ్బ, రాజకీయంగా ఘాటైన హెచ్చరిక.

ట్రంప్‌ రెండోరాకడ తరువాత జరిగిన ఈ అతిపెద్ద ఎన్నికల ఫలితాలు డెమెక్రాట్లకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయి. న్యూయార్క్‌ను మమ్దానీ గెలుచుకోవడంతో పాటు, న్యూజెర్సీ, వర్జీనియా గవర్నర్లుగా డెమోక్రటిక్‌ పార్టీకి చెందినవారే గెలవడం విశేషం. వర్జీనియా లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా హైదరాబాద్‌లో జన్మించిన గజాలా హష్మీ చక్కని మెజారిటీతో ఎన్నికైనారు. భారతీయ సంతతికి చెందిన అఫ్తాబ్‌ పూరేవాల్‌ అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్‌ సోదరుడిని ఓడించి, సిన్సినాటి మేయర్‌గా మారోమారు విజయం సాధించడం విశేషమైన పరిణామం. ట్రంప్‌ పార్టీ, ఆయన బృందం, మతవాదులూ మితవాదులు కలసికట్టుగా ముస్లిం వ్యతిరేకతను ఎంతగా రేపినప్పటికీ మమ్దానీ, హష్మీల విజయం ఓటర్ల రాజకీయ పరిణతికీ, మతసహనానికీ నిదర్శనం. మమ్దానీకి యూదులు అత్యధికంగా ఓటుచేశారన్న విశ్లేషణలు మరింత ఆశ్చర్యం కలిగిస్తాయి. గాజా ఊచకోతలను ఘాటుగా విమర్శిస్తూ, నెతాన్యాహూను చీల్చిచెండాడంలో మమ్దానీ ఎన్నడూ ఏ మాత్రం తగ్గలేదు. యూదువ్యతిరేకిగా మమ్దానీని ఎంతగా చిత్రీకరించినా, అతడికి ఓటుచేయడంలో యూదులు ముందంజలో ఉన్నందుకు ట్రంప్‌ ఇప్పుడు వారిని తిట్టిపోస్తున్నారు. ఆఫ్రో అమెరికన్లు, ఆసియన్లు సహా ఇతర శ్వేతజాతేతరుల ఓట్లు మమ్దానీకి అధికంగా పడతాయన్నది ఊహించిందే.


డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున నగర మేయర్‌ అభ్యర్థిత్వానికి పోటీపడిన పదకొండుమందిని వెనక్కునెట్టి జూన్‌ 24న మమ్దానీ ఎన్నికకావడం మిగతా ప్రపంచాన్ని ఆకర్షించింది, ట్రంప్‌ను భయపెట్టింది. అతని విజయం ఖాయమని అర్థం అవుతున్నకొద్దీ ట్రంప్‌ దాడిహెచ్చింది, దూకుడు పెరిగింది. ఓటర్లకు మమ్దానీ మత, సైద్ధాంతిక మూలాలను ట్రంప్‌ పదేపదే గుర్తుచేస్తూ, ఈ కమ్యూనిస్టు ఏలుబడిలో నగరం నాశనమైపోతుందని హెచ్చరించారు. వెయ్యేళ్ళ విఫలకమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఆచరణలోకితెచ్చి ఆర్థికంగా, సామాజికంగా నగరాన్ని భ్రష్టుపట్టిస్తాడన్నారు. మమ్దానీని ఎన్నుకుంటే నిధులివ్వకుండా నగరాన్ని నిలువునా మాడ్చేస్తానని కూడా పౌరులను ట్రంప్‌ బెదిరించారు. డెమోక్రాట్‌ బెర్నీ శాండర్స్‌ బాటలో తనను సోషలిస్టుగా ప్రకటించుకున్న మమ్దానీ కనుక గెలిస్తే తమ పెట్టుబడిదారీ సమాజం మీద ఆ ప్రభావం అధికంగా ఉంటుందని ట్రంప్ భయం. పునాదిలోనే దానిని చిదిమేయడానికి తన పార్టీని ఈ ఎన్నికల్లో పోటీచేయనివ్వకుండా, డెమోక్రాటిక్‌ పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆండ్రూ కుమోకు మద్దతు ప్రకటించారు. కమ్యూనిస్టు కంటే ఒక చెత్త డెమోక్రాట్‌ ఉత్తమమంటూ తన ఓటర్లను సైతం అటు మళ్ళించాడు. డెమోక్రాటిక్‌ పార్టీ ప్రస్తుత మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ కూడా కుమోకు మద్దతు ఇచ్చారు. ఇలా రెండుపార్టీలనుంచీ మమ్దానీని బలహీనపరిచే ప్రయత్నాలు బలంగా సాగాయి. మతఛాందసులు, పార్టీలకు అతీతంగా ఒక్కటైన పెట్టుబడిదారులు, ఆయన మతాన్నే కాదు, ఆహారపు అలవాట్లను సైతం ఎగతాళి చేస్తూ విషం చిమ్మిన ట్రంప్‌ అనుకూల మీడియా ఎంత ప్రయత్నించినా, సామాన్యులు, కార్మికులు మమ్దానీ పక్షాన నిలిచి గెలిపించారు. డెమోక్రాటిక్‌ పార్టీ భవిష్యత్తును నిర్ణయించేది దాని నాయకత్వం కాదు, కార్మికవర్గమేనని బెర్నీశాండర్స్‌ మరోమారు గుర్తుచేస్తున్నారు. తన విజయాన్ని కారు చీకటిలో కాంతిరేఖగా మమ్దానీ అభివర్ణించడం సముచితం. రెండుపార్టీల మధ్యా పెద్ద తేడాలేకుండా ఘనీభవించిపోయిన అమెరికాలో సామాన్యుల సంక్షేమానికీ, శ్రేయస్సుకూ హామీపడుతున్న ఎజెండాతో కొత్త రాజకీయానికి మమ్దానీ తెరదీశారని అనేకుల ఆశ. ఇస్లామోఫోబియా హెచ్చుతూ, వలసదారులను తరిమేస్తున్న రాజ్యంలో ఒక ముస్లిం, అదీ వలసదారుల సంతానం విజయం సాధించినందుకు సంతోషించవలసిందే.

ఈ వార్తలు కూడా చదవండి:

Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు

PM with World Cup Winners: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు

Updated Date - Nov 06 , 2025 | 05:15 AM