Share News

Tensions Reignite in Gaza: గాజాలో మళ్ళీ

ABN , Publish Date - Oct 30 , 2025 | 01:38 AM

గాజామీద ప్రళయభీకరంగా విరుచుకుపడాలని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమీన్‌ నెతన్యాహూ తన సైన్యాన్ని ఆదేశించడంతో, రాత్రివేళల్లో జరిగిన ఆ విచక్షణారహిత దాడుల్లో పసిపిల్లలతో సహా...

Tensions Reignite in Gaza: గాజాలో మళ్ళీ

గాజామీద ప్రళయభీకరంగా విరుచుకుపడాలని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమీన్‌ నెతన్యాహూ తన సైన్యాన్ని ఆదేశించడంతో, రాత్రివేళల్లో జరిగిన ఆ విచక్షణారహిత దాడుల్లో పసిపిల్లలతో సహా అనేకమంది మరణించారని వార్తలు వచ్చాయి. దక్షిణగాజాలో తమ బలగాలమీద హమాస్‌ కాల్పులు జరిపిందనీ, ప్రతీకారంగా ఈ వైమానిక దాడులకు ఆదేశాలు ఇచ్చామని నెతన్యాహూ చెప్పుకున్నారు. తాము కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడే ఉన్నామని, మాట తప్పిన నెతన్యాహూ మళ్ళీ మంటలు రేపుతున్నాడనీ, ఇదే వైఖరి కొనసాగితే మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యం అవుతుందని హమాస్‌ హెచ్చరిస్తోంది. అది ఇంకా డజనుకుపైగా మృతదేహాలు ఇజ్రాయెల్‌కు అప్పగించాల్సి ఉన్నందున, వాటిని అడ్డుపెట్టుకొని ఇజ్రాయెల్‌ దూకుడుకు కళ్ళెం వేయగలనని అనుకుంటోంది. ఇజ్రాయెల్‌ మళ్ళీ భీకరయుద్ధానికి దిగడంతో ట్రంప్‌ కష్టపడి కుదర్చిన ఆ శాంతిఒప్పందం కూలిపోతుందేమోనని మిగతా ప్రపంచం తెగ బాధపడుతోంది. రెండేళ్ళపాటు బందీలను అడ్డుపెట్టుకొని పోరాడిన హమాస్‌కు, తాను రక్షణకవచంలాగా వాడుకున్నవారిని అప్పగించగానే ఇజ్రాయెల్‌ ఎంత నిర్దయగా విరుచుకుపడుతుందో తెలియదనుకోలేం. బందీల విడుదల, హమాస్‌ నిర్మూలన లక్ష్యంగా యుద్ధాన్ని ఆరంభించిన నెతన్యాహూ ఆ రెండిటినీ సాధించలేక కొట్టుమిట్టాడుతున్న స్థితిలో ట్రంప్‌ కుదర్చిన శాంతి ఒప్పందం అందుకు దారులు పరిచింది. బందీల అప్పగింత జరిగిపోయింది కనుక, ఆ రెండో లక్ష్యం సాధించుకోవడం నెతన్యాహూకు ఇక సులభమే. హమాస్‌ చేతిలో సజీవంగా ఉన్నవారంతా తన చేతుల్లోకి వచ్చీరాగానే, మృతదేహాల లెక్కల్లో తేడాపాడాలున్నాయంటూ నెతన్యాహూ అప్పట్లోనే విరుచుకుపడ్డారు. హమాస్‌ సోమవారం అప్పగించిన ఒక మృతదేహం విషయంలో ఆయనకు ఏకంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం కనిపించింది. వెనువెంటనే మంత్రిపుంగవులతోనూ, భద్రతాధికారులతోనూ ఆంతరంగిక సమావేశాన్ని ఏర్పాటుచేసి, ప్రతీకారంగా ఒక్కరోజులో వందమంది పాలస్తీనియన్లను మృతదేహాలుగా మార్చేశారు. ఇజ్రాయెల్‌ సైనికుల మీద తాము ఏ దాడులూ చేయలేదన్న హమాస్‌ ప్రకటనను విశ్వసించడం ఆయనకు ఇష్టంలేకపోయింది.


ఒప్పందానికి అనుగుణంగా డెబ్బైరెండుగంటల్లో బందీలను సవ్యంగా అప్పగించిన హమాస్‌, మృతదేహాలను కూడా ఇచ్చేస్తుందన్న టెన్షన్‌ నెతన్యాహూకు ఉన్నదేమో! ఒకపక్క హమాస్‌ స్థావరాలు, నాయకులు లక్ష్యంగా తాను భీకరదాడులు జరుపుతూంటే, మిగిలిన దేహాలు ఇవ్వడం హమాస్‌కు కష్టమనీ, అది తెగించనూవచ్చని నెతన్యాహూకు తెలియకపోదు. శాంతి ఒప్పందం అమల్లో ఉండగా, ఇజ్రాయెల్‌ ప్రధాని సైనికచర్యకు ఆదేశించడమంటే దానిని ఉల్లంఘించడమేనని అమెరికా అధ్యక్షుడికీ తెలుసు. అయినా, ఆయన మళ్ళీ ఇజ్రాయెల్ ప్రతీకారదాడులు సరైనవేనంటూ సమర్థించుకొచ్చారు, హమాస్‌ను తప్పుబట్టారు. ట్రంప్‌కు చెప్పకుండా నెతన్యాహూ ఇంత ధైర్యంగా దాడులు చేయరన్నది నిజం. ట్రంప్‌ బలవంతంగా కుదర్చిన ఆ శాంతి ఒప్పందంలో దాడులు తప్పుకానీ, ప్రతీకారదాడులు చేయవచ్చునని ఉన్నదేమో మరి.

ఇజ్రాయెల్‌ను నియంత్రించనిపక్షంలో కాల్పుల విరమణ నిలవదు, మృతదేహాల అప్పగింత ముందుకు సాగదు. ఉద్రిక్తతలు పెరిగిపోతూ, శాంతి ఆశలు మళ్ళీ పతనమైపోవడం బందీల బంధువులకు తీరని వ్యధ. సుదీర్ఘనిరీక్షణ తరువాత ఇప్పుడే వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. అల్‌షిఫా ఆస్పత్రి పరిసరాల్లో వైమానిక దాడులు జరపడం, పసిపిల్లలను సైతం పొట్టనబెట్టుకోవడం క్షమించరాని నేరం. హమాస్‌ను విశ్వసించమని ఎవరూ అనడం లేదు. దేహాల అప్పగింతలో అది ఉద్దేశపూర్వకమైన జాప్యం చేస్తుండవచ్చు. హామీకి అనుగుణంగా వ్యవహారం నడవకపోవచ్చును. కానీ, ఆ సంస్థ లక్ష్యంగా సాగిన రెండేళ్ళ యుద్ధం లక్షమంది అమాయకుల ప్రాణాలు తీసిందే తప్ప ప్రకటిత లక్ష్యాలు సాధించలేకపోయింది. ఆహారసరఫరాలను అడ్డుకుంటూ, సాయాన్ని నిలిపివేస్తూ గాజావాసులమీద ఇజ్రాయెల్‌ ఇంకా ఎంతకాలం కక్షసాధించినా, ఊచకోతలు కోసినా హమాస్‌కు పోయేదేమీ లేదు. గాజాను వల్లకాడు చేయడం వినా, ఒక్కబందీని కూడా విడిపించుకోలేకపోయిన ఇజ్రాయెల్‌కు ఈ ఒప్పందం ఒక మంచి అవకాశం. రెడ్‌క్రాస్‌ వంటి సంస్థలు మధ్యలో ఉన్నందున అది సహనంతో, సంయమనంతో వ్యవహరించడం అవసరం. పాలస్తీనియన్లకు న్యాయం చేయని, ఇజ్రాయెల్‌ పక్షాన రాసిన ఈ ఒప్పందాన్ని నిలబెట్టడం ట్రంప్‌ చేతుల్లో ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నదని అంటూనే ఇజ్రాయెల్‌, అమెరికా కలసి ఆడుతున్న ఈ నాటకాన్ని మిగతా ప్రపంచం కొనసాగనివ్వకూడదు.

ఇవి కూడా చదవండి:

Bhatti Vikramarka: ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Azharuddin: తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఎప్పుడంటే..

Updated Date - Oct 30 , 2025 | 01:38 AM