BMC Elections: ముంబై మనోమిలన్
ABN , Publish Date - Dec 25 , 2025 | 02:31 AM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ చేతులు కలిపినంతగా, ఆలింగనాలు చేసుకున్నంతగా ప్రచారం చేస్తున్నారేమిటి? అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్...
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ చేతులు కలిపినంతగా, ఆలింగనాలు చేసుకున్నంతగా ప్రచారం చేస్తున్నారేమిటి? అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాను అడుగుతున్నారు. 20ఏళ్ళ తరువాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్‌ఠాక్రేలు చేయీచేయీ కలిపి, ఒకేవేదికమీదకు వచ్చిన సందర్భంపై వ్యాఖ్యానించమన్నందుకు ఫడ్నవీస్ ఈ ఎదురు ప్రశ్నవేశారు. గుర్తింపు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఠాక్రే సోదరులు ఎన్ని విన్యాసాలు చేసినా ఫలితం ఉండదని, ప్రజలు మరిచిపోయిన వారి పార్టీలు ఒక్కటైనా ఉపయోగం లేదని ఫడ్నవీస్ తేల్చేశారు.
బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పనిచేయబోతున్నట్టుగా ఉద్ధవ్ నాయకత్వంలోని యూబిటి, రాజ్‌ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ్‌సేన (ఎంఎన్‌ఎస్) బుధవారం ప్రకటించాయి. బాల్‌ఠాక్రే భారీ చిత్రం వెనుక ఉండగా, వేదికమీద సోదరులిద్దరూ ఉన్న ఆ దృశ్యం అభిమానులకు చూడముచ్చటగా ఉంది. బీఎంసి ఎన్నికలవరకే ఈ సోదరప్రేమ కొనసాగుతుందని జనం ఎక్కడ అనుకుంటారోనన్న అనుమానం ఉన్నదేమో, ఈ కలయిక ఎప్పటికీ కలిసివుండటానికేనని ఒకటికి రెండుసార్లు స్పష్టం చేశారు ఉద్ధవ్. బీజేపీమీద కోపం ఉన్నవాళ్ళంతా యూబీటీ–ఎంఎన్‌ఎస్ కూటమిలో చేరవచ్చునని కూడా పిలుపునిచ్చారు. మీడియా సమావేశానికి ముందు సోదరులు ఇద్దరూ బాలాసాహెబ్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. మరాఠీ ఓటుబ్యాంకును సుస్థిరం చేసుకొని, ఆస్మితను జనంలో ఆవహింపచేసి, అధికారంలో ఉన్న ‘మహాయుతి’ కూటమిని సవాలు చేయడానికి ఈ ఏకీకరణ ఉపకరిస్తుందని అభిమానులు అంటున్నారు. మాటకారి సంజయ్ రౌత్ దీనిని ‘మనోమిలన్’ (మనసుల కలయిక)గా అభివర్ణిస్తున్నారు. ఉద్ధవ్‌ను తన రాజకీయవారసుడుగా ప్రకటించినందుకు అలిగి, ఆగ్రహించిన రాజ్‌ఠాక్రే పెద్దాయన జీవించి ఉండగానే వేరుకుంపటి పెట్టుకున్నాడు. ఉద్ధవ్‌కు ఉన్న నిలకడతనం, నిబద్ధత రాజ్‌కు లేవని, మాట, మనసు మారిపోతూంటాయని, అందుకే బాలాసాహెబ్ అతడిని పక్కనపెట్టారని అంటారు. జూలైలో వీరిద్దరూ హిందీని వ్యతిరేకిస్తూ ఒకే వేదిక మీదకు వచ్చినప్పుడు ప్రజల్లో సానుకూల స్పందన కనిపించడంతో, చర్చోపచర్చల అనంతరం ఇలా ఒక్కటి కావడం సాధ్యపడింది. కీలకమైన సీట్ల పంపకం అంశం ఇంకా తేలాల్సివున్నప్పటికీ, బీజేపీ–శిండేశివసేన–అజిత్‌పవార్ ఎన్సీపీ కలగలసిన మహాయుతికి వీరు సవాలు విసరగలరని అభిమానుల నమ్మకం. పుట్టినిల్లు ముంబైని దీర్ఘకాలం శాసించి, ఏలిన శివసేన క్రమంగా చీలి, చితికిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అక్కడ తన ఉనికిని చాటుకోవడానికి ఇలా తాపత్రయపడుతోంది.
పదేళ్ళ విరామం తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార మహాయుతి ఇటీవల ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, ఠాక్రేల కలయిక మరింత అవసరపడింది. 288మునిసిపల్ కౌన్సిళ్ళలో మహాయుతి 207 గెలుచుకుంటే, విపక్ష మహావికాస్ అగాఢీకి 44 దక్కాయి. బీజేపీ 117, శిండే శివసేన 53, అజిత్‌పవార్ ఎన్సీపీ 37 మున్సిపల్ అధ్యక్షపదవులు దక్కించుకున్నాయి. మహాయుతిని గెలిపించిందుకు అభినందనలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్, యూబీటీ విమర్శించినప్పటికీ, అసలు పార్టీలకంటే చీలికపక్షాలకు ప్రజామోదం అధికంగా ఉన్నదని ఈ ఫలితాలు నిర్థారించాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోమారు ఇలా కిందిస్థాయిలో ప్రతిఫలించిన నేపథ్యంలో, జనం ఉద్ధవ్, శరద్‌పవార్ పక్షాన లేరనీ, తమనే ఆదరిస్తున్నారని ఏక్‌నాథ్ షిండే, అజిత్‌పవార్ మరింత గర్వంగా చెప్పుకోవచ్చు. సంస్థాగతంగా వీరు మరింత బలపడ్డారనడానికి కూడా ఈ ఫలితాలు నిదర్శనం. నేనే అసలు శివసేన అన్న షిండే వాదనను వివిధ వ్యవస్థలతో పాటు జనం కూడా సమర్థించి, ఇలా ఆరురెట్లు అధికస్థానాలతో ఆశీర్వదించడం ఉద్ధవ్‌కు పెద్ద ఎదురుదెబ్బ. అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర అన్యాయం జరిగిందని, ఎన్నికల సంఘం కుట్రలకు పాల్పడిందని ఆరోపించిన కాంగ్రెస్ ఈ స్థానిక ఎన్నికల్లో అనాదిగా తనకు పునాదిగా ఉన్న ప్రాంతాలను సైతం కోల్పోయింది. ఈ నేపథ్యంలో, జనవరి 15న జరగబోతున్న బీఎంసీ ఎన్నికల్లో మహాయుతి విజృంభించకుండా నిలువరించాలని ఉద్ధవ్ ప్రయత్నిస్తున్నారు. 75వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ముంబైని గెలుచుకోవడానికి సోదరుడితో చేయికలిపారు. మర్నాడు వెలువడే ఫలితాల్లో ముంబైవాసులను ఈ సోదరప్రేమ ఎంత ప్రభావితం చేసిందో తేలిపోతుంది.
ఇవి కూడా చదవండి
ఈ ఏడాది ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో తెగ ట్రెండ్ అయిన సంఘటనలు ఇవే..
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంఘటనలు ఇవే..