Rahul Gandhis Fight for Electoral Integrity : ప్రజాస్వామ్య నైతికత
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:37 AM
భారతీయ నాగరికత ప్రభవ ప్రాభవాలకు హిమాలయాలు ఎంత ముఖ్యమో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య విశిష్టతా వికాసాలకు...
భారతీయ నాగరికత ప్రభవ ప్రాభవాలకు హిమాలయాలు ఎంత ముఖ్యమో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య విశిష్టతా వికాసాలకు సార్వజనీన ఓటు హక్కు అంతే ప్రధానమైనది. కులమతాలకు అతీతంగా, విద్యార్హతలు, ఆర్థిక స్థాయితో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం ద్వారా భారత గణతంత్ర రాజ్య వ్యవస్థాపకులు భారతీయుల ప్రజాస్వామిక ప్రస్థానాన్ని సుస్థిరమూ, స్ఫూర్తిదాయకమూ చేశారు. అతడు/ఆమె ప్రజాస్వామిక ప్రక్రియలో విధిగా పాల్గొనేలా చేయడంలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) బాధ్యత బృహత్తరమైనది. మన గణతంత్ర రాజ్యం కంటే ఒక రోజు ముందే (జనవరి 25, 1950) ఏర్పడిన ఈ రాజ్యాంగ సంస్థ ఇటీవలి కాలంలో తన గురుతర బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదనే సందేహాలు సామాన్యులలోను, పాలకపక్షం ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా వ్యవహరిస్తోందనే భయాందోళనలు రాజకీయ పక్షాలలోను వ్యక్తమవుతున్నాయి. ఆ భయ సందేహాలు సహేతుకమైనవని సోమవారం నాడు పట్నాలో ముగిసిన జాతీయ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఓటర్ అధికార్ యాత్ర నిర్ధారించింది. మూడు సంవత్సరాల క్రితం కన్యాకుమారి నుంచి నుంచి కశ్మీర్ దాకా రాహుల్ నిర్వహించిన భారత్ జోడో యాత్ర భారత జాతీయ కాంగ్రెస్‌కు ప్రజాదరణను పెంపొందించింది. గత ఏడాది సార్వత్రక ఎన్నికలలో ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ ఆధిక్యతను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు గణనీయంగా దెబ్బతీశాయి. లోక్‌సభ ఎన్నికల అనంతరం నాలుగు నెలల వ్యవధిలో మహారాష్ట్ర, హర్యానా శాసనసభలకు జరిగిన ఎన్నికలలో బీజేపీ విజయం సాధించింది. మహారాష్ట్రలో, ఓటర్ల జాబితాలో మోసపూరితంగా దాదాపు నలభై లక్షల కొత్త ఓటర్లను చేర్చడం, అక్రమంగా పలువురు ఓటర్ల పేర్లను తొలగించడం వల్లే బీజేపీకి విజయం సాధ్యమయిందని రాహుల్ ఆరోపించారు. అలాగే గత లోక్‌సభ ఎన్నికలలో కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ ఓటర్ జాబితాలలో ఘోరమైన అవకతవకలు చోటుచేసుకున్నాయని, లక్షకు పైగా ఓట్లు అనుమానాస్పదమైనవని ఈసీ ఇచ్చిన జాబితాల ఆధారంగానే రాహుల్ నిరూపించారు. ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు ఈసీఐ సరైన సమాధానాలు ఇవ్వలేకపోయింది.
జూన్‌లో బిహార్‌లో ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఈసీఐ చేపట్టింది. ఈ సంవత్స రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంత తక్కువ వ్యవధిలో హడావుడిగా ఈ సవరణ కార్యక్రమాన్ని చేపట్టడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. బీజేపీకి తోడ్పడేందుకే లక్షలాది ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణను ఈసీఐ చేపట్టిందని రాహుల్ తప్పుపట్టారు. ఆగస్టు 1న ఈసీఐ ప్రకటించిన ముసాయిదా ఓటర్ జాబితాలలో 65 లక్షల పేర్లను మినహాయించినట్టు వెల్లడవడంతో ప్రజల సందేహాలు మరింత బలపడ్డాయి. ముసాయిదా జాబితాలను నిశితంగా పరిశీలిస్తే పేర్ల తొలగింపుతో నష్టపోయిన ఓటర్లలో అత్యధికులు అణగారిన వర్గాలవారు, మతపరమైన మైనారిటీలు, మహిళలు ఉన్నారు. ఈ ప్రత్యేక సమగ్ర సవరణను వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలోను, పిదప దేశమంతటా నిర్వహిస్తామని ఈసీఐ ఇప్పటికే ప్రకటించడంతో కోట్లాది పౌరులు తమ ఓటుహక్కును కోల్పోయే ముప్పు వాటిల్లనున్నది. ఇదే జరిగితే ప్రజాప్రాతినిధ్యానికి అర్థమేమున్నది.? ఈ విపత్కర పరిస్థితులపై ప్రజలను జాగృతం చేసేందుకే జాతీయ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ బిహార్‌లో 16 రోజుల పాటు ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించారు. ప్రజలు అపూర్వంగా ప్రతిస్పందించారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలో సమైక్యత వెల్లివిరిసింది. ఈ సానుకూల పరిస్థితులను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు రాహుల్ మరింత దృఢ సంకల్పంతోను, రాజనీతిజ్ఞతతోను వ్యవహరించవలసి ఉన్నది. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఎన్నికల వ్యవస్థలో ఇటువంటి అపసవ్యతలు చోటుచేసుకున్నప్పుడు అధికారంలో ఉన్నవారిని వేలెత్తి చూపకుండా ప్రతిపక్షాలు ఉండలేవు. ఎందుకంటే ప్రజాస్వామ్య నైతికతే ఓటుహక్కు. ఆ నైతికత భ్రష్టం కాకుండా భద్రంగా, ప్రయోజనకరంగా ఉండేలా జాగ్రత్త వహించడం ప్రతి విద్యావంతుడి విద్యుక్తధర్మం.