Road Safety: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
ABN , Publish Date - Nov 06 , 2025 | 05:33 AM
మన జీవన ప్రయాణంలో రోడ్లు, రవాణా అనేవి అత్యంత కీలకమైనవి. రోడ్డు భద్రత అనేది ప్రభుత్వం ఒక్కటే భరించే బాధ్యత కాదు, ప్రతి పౌరుడి వ్యక్తిగత ధర్మం కూడా. మన దేశంలో ప్రతిరోజూ వందలాది మంది...
మన జీవన ప్రయాణంలో రోడ్లు, రవాణా అనేవి అత్యంత కీలకమైనవి. రోడ్డు భద్రత అనేది ప్రభుత్వం ఒక్కటే భరించే బాధ్యత కాదు, ప్రతి పౌరుడి వ్యక్తిగత ధర్మం కూడా. మన దేశంలో ప్రతిరోజూ వందలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది కుటుంబాలు శాశ్వత దుఃఖంలో మునిగిపోతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల వ్యక్తిగత నష్టం మాత్రమే జరగడం లేదు. కుటుంబాల ఆర్థిక వెన్నెముకలు తెగిపోతున్నాయి, సామాజిక స్థిరత్వం దెబ్బతింటున్నది, తద్వారా దేశ అభివృద్ధి కుంటుపడుతున్నది. అతివేగం, రెడ్ సిగ్నల్ దాటడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి నిర్లక్ష్యాలు యువకుల జీవితాలను, వారి కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. మన జీవితాలు మన బాధ్యత. మనందరి సమష్టి బాధ్యత! తెలంగాణ ప్రభుత్వం రోడ్డు భద్రతను అత్యంత ప్రాధాన్యం గల అంశంగా తీసుకుంటోంది.
‘‘ఆగండి... జీవితం కొనసాగేందుకు!’’ అన్నది ప్రభుత్వం నినాదం. ఈ నినాదం మాటలకే పరిమితం కాకుండా, రోజువారీ జీవితంలో ఒక అలవాటుగా మారాలి. ప్రతి రోడ్డు ప్రయాణం ఒక సంతోషకరమైన అనుభవంగా మారాలి. మనం సురక్షితంగా ఇంటికి చేరుకుంటే, మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. సమాజం బలంగా నిలుస్తుంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశంలో రవాణాశాఖ రోడ్డు భద్రతను బలోపేతం చేస్తోంది. టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టాం. డ్రైవర్ అలిసిపోయినప్పుడు హెచ్చరించే వ్యవస్థలు, సీసీ కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్, వేగ నియంత్రణ పరికరాలు.. మొదలైన వాటి ఏర్పాటు ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తోంది. ప్రతి డ్రైవర్‌కు, కండక్టర్‌కు సురక్షిత డ్రైవింగ్, ఫస్ట్ ఎయిడ్, అత్యవసర సహాయంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రమాద సమయంలో తక్షణ చర్యలు సాధ్యం అవుతున్నాయి. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, సిగ్నల్ లైట్లు, రోడ్డు సైనేజీ, రంప్‌లు ఏర్పాటు చేస్తున్నాం. పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో ‘రోడ్డు భద్రతా వారోత్సవాలు’ నిర్వహించడం లాంటి అవగాహన కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ప్రజల్లో, ముఖ్యంగా యువతలో భద్రతా భావనను నాటుతున్నాం. ప్రమాదం జరిగిన మొదటి గంటలోనే ‘గోల్డెన్ అవర్ రెస్పాన్స్’లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు, ఫైర్ సర్వీసెస్, ఆరోగ్య శాఖల సమన్వయంతో ప్రాణరక్షణ చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి అనేక చర్యలు ప్రభుత్వ నిబద్ధతను చాటుతున్నాయి. కానీ ఇవన్నీ సఫలం కావాలంటే ప్రజల సహకారం అవసరం. ప్రభుత్వ చర్యలు– ప్రజల బాధ్యతలు కలిస్తేనే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. సురక్షిత ప్రయాణాలు సాధ్యమవుతాయి.
చట్టాలు, సదుపాయాలు ఎన్ని ఉన్నా మనలో బాధ్యత లేకపోతే మార్పు రాదు. ప్రతి వాహనదారుడు రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణానికీ బాధ్యత వహించాలి. తాగి వాహనం నడపడాన్ని మానుకోవాలి. మన ప్రాణాలను కాపాడే హెల్మెట్, సీటుబెల్టులను తప్పనిసరిగా ధరించాలి. తలకు గాయాలవ్వడం వల్లనే 70శాతం మరణాలు జరుగుతున్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. ప్రయాణ సందర్భంలో ఫోన్‌లను ఉపయోగించకండి, వేగాన్ని తగ్గించండి. అతివేగం 60శాతం ప్రమాదాలకు కారణమవుతున్నది. ఒక్క క్షణం ఏమారినా మనకు, మన కుటుంబాలకు శాశ్వత నష్టం జరుగుతుందనే వాస్తవాన్ని గుర్తెరగండి. రోడ్డు మనందరిది– పాదచారులకు, సైకిలిస్టులకు ప్రాధాన్యం ఇవ్వండి. ఓవర్ లోడింగ్ విషయంలోను, రాత్రి ప్రయాణాల సమయంలోను జాగ్రత్తలు తీసుకోండి. ఈ సామాజిక బాధ్యతలు మనలో సానుకూల మార్పును తెస్తాయి. మన సమాజాన్ని మరింత బలంగా, సంతోషంగా నిర్మిస్తాయి. ప్రతి చిన్న అడుగు కూడా ఒక పెద్ద మార్పునకు దారి తీస్తుంది.
రోడ్డు అనేది మనందరం పంచుకునే స్థలం, అంతేగానీ పోటీ మైదానం కాదు. రోడ్డు మీద ‘నాకు మాత్రమే అర్జెంట్ పని ఉంది’ అనే ఆలోచనను వదిలేయాలి. క్రమశిక్షణ, సహనం, ఇతరుల భద్రత పట్ల గౌరవం ఇవ్వడం లాంటివే రోడ్డు భద్రతకు మూలస్తంభాలు. ప్రతి ప్రయాణం సురక్షితంగా ముగియాలి. ప్రతి ఆగడం జీవితాన్ని కొనసాగించే మొదటి అడుగు కావాలి. మనమందరం కలిసి నడిస్తేనే సురక్షిత రోడ్డు, రక్షిత ప్రయాణం మన సొంతం! ఈ సంస్కృతి మన రోజువారీ జీవితంలో సానుకూల శక్తిని నింపుతుంది. మన పిల్లలకు మంచి భవిష్యత్తును అందిస్తుంది. సురక్షిత రోడ్డు మన సమాజాన్ని మరింత ఐక్యంగా, సంతోషంగా చేస్తుంది. తెలంగాణ రవాణా శాఖ తరఫున నేను ప్రతి పారునికీ ఈ పిలుపునిస్తున్నాను: మనమంతా రోడ్డు భద్రతా రాయబారులుగా మారుదాం!
పొన్నం ప్రభాకర్
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి
ఈ వార్తలు కూడా చదవండి:
Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు
PM with World Cup Winners: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు