Rising Industrial Accidents: ఆందోళన కలిగిస్తున్న పారిశ్రామిక ప్రమాదాలు!
ABN , Publish Date - Nov 29 , 2025 | 01:54 AM
పరిశ్రమల్లో ప్రమాదకర రసాయనాల వల్ల అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు సంభవించడం నిత్యకృత్యంగా పరిణమించింది. దేశంలో 139 పారిశ్రామిక ప్రమాదాలు సంభవించి... 259 మంది కార్మికులు....
పరిశ్రమల్లో ప్రమాదకర రసాయనాల వల్ల అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు సంభవించడం నిత్యకృత్యంగా పరిణమించింది. దేశంలో 139 పారిశ్రామిక ప్రమాదాలు సంభవించి... 259 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 560 మంది గాయపడ్డారని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకటించిన గణాంకాలు కలవరపెడుతున్నాయి. వందేళ్ల నాటి పారిశ్రామిక భద్రతాచట్టాలను సమూలంగా మార్చాల్సిన అవసరాన్ని తరచూ జరిగే ఈ దుర్ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
విజయవాడ నగరం నడిబొడ్డున ఎనిమిది ఎకరాల్లో 1950లో ప్రస్థానం ప్రారంభించిన అరవై ఏళ్ల చరిత్ర కలిగిన సిరిస్ ఔషధ కర్మాగారంలో 2000, 2013 సంవత్సరాల్లో ప్రమాదాలు జరగడం, చివరకు మూతబడటం తెలిసిందే. ఈ జూన్ 30న తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచీ ఫార్మా కర్మాగారంలో జరిగిన భారీ పేలుడులో 46 మంది మృతి చెందగా, 333 మంది గాయపడ్డారు. గత ఏడాది ఆగస్ట్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా విశాఖ పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రమాదాలు గత కొన్నేళ్లుగా వరుసగా సంభవిస్తున్నాయంటే అది పరిశ్రమ నిర్వాహకుల, ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణికి ప్రబల నిదర్శనం. విశాఖపట్నంలోని వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కర్మాగారంలో 2020 మే 7న స్టైరీన్ గ్యాస్ లీకై, ఆ విషవాయువు 3 కిలోమీటర్లు వ్యాపించి సమీప గ్రామాలను ప్రభావితం చేయడం, 12 మంది మృతిచెందటం, చాలా మంది అస్వస్థతకు గురవ్వడం మరిచిపోలేం. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరిశ్రమల్లో ముఖ్యంగా ఫార్మా పరిశ్రమల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, విశాఖపట్నం సమీపంలో పరవాడ ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీల్లో వరుస పేలుళ్లు, అగ్నిప్రమాదాలు యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలువుటద్దాలు. అచ్యుతాపురం సెజ్‌తో పాటు పరవాడ ప్రాంతంలోని ఫార్మా, రసాయన పరిశ్రమల్లో రియాక్టర్ల పేలుళ్లు, అగ్నిప్రమాదాలు సంభవించాయి.
2022 అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నూతన భద్రతా ప్రమాణాలను అమలులోకి తెచ్చినా, పరిశ్రమలు వాటిని కచ్చితంగా పాటించకపోవడం, ప్రభుత్వం పకడ్బందీగా అమలుచేయకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. కార్మిక భద్రతకి ఇపుడున్న చట్టాలు సైతం ఊతమివ్వడం లేదు. ప్రతి రసాయనాన్ని సురక్షితంగా నిర్వహించే పారిశ్రామిక వాతావరణం మనకు లేదనడానికి దేశంలో గత దశాబ్ద కాలంలో జరిగిన 130 ప్రధానమైన పారిశ్రామిక ప్రమాదాలే సజీవ సాక్ష్యం. అంతెందుకు 1984 నాటి భోపాల్ గ్యాస్ విషాదం ఇప్పటికీ మనం మర్చిపోలేనిది. విషవాయువు మిథైల్ ఐసో సైనేట్ విడుదలై వేలాదిమంది మృతిచెందిన ఆ చేదు జ్ఞాపకం మనల్ని వెంటాడుతోంది. రసాయన పరిశ్రమలు ఆహారం నుంచి ఔషధం వరకు, సౌందర్య సాధనాలు, పెయింట్, దైనందిన జీవితంలో మనం ఉపయోగించే అనేక ఇతర వస్తువులకు అవసరమయ్యే రసాయనాలను పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నాయి. పరిశ్రమలో ఉపయోగించే రసాయనాలు తరచుగా శుద్ధి, ఇతర పదార్థాలతో మిశ్రమం కావడం వగైరా ప్రక్రియలకు లోనవుతాయి. ప్లాస్టిక్, ఔషధాలు, సౌందర్య సాధనాలు మొదలైన వాటి తయారీకి రసాయనాల తయారీ అనివార్యమే అయినా, ప్రతి ప్రక్రియకు వేర్వేరు భద్రతా సమస్యలు ఉంటాయి. ప్రతి రసాయనాన్ని సురక్షితంగా నిర్వహించడం బాధ్యతతో కూడుకున్న అంశం.
పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి అయ్యే కొన్ని ప్రమాదకర రసాయనాలు జిలీన్, టోలున్, నాఫ్తా, అసిటోన్ మొదలైన ద్రావకాలు, సల్ఫ్యూరిక్, నైట్రిక్, హైడ్రోక్లోరిక్, ఎసిటిక్ వంటి ఆమ్లాలు, సోడియం, పొటాషియం, కాల్షియం హైడ్రాక్సైడ్లు వంటివి పీల్చినా కూడా ప్రమాదకరమే. ఈ రసాయనాల వల్ల గాలి, నేల, భూగర్భజలాలు, ఉపరితల నీరు తీవ్రంగా కలుషితమవుతున్న నేపథ్యంలో, వీటి నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా నియమాలు, ప్రత్యేక నిల్వ, రవాణా పద్ధతులు అవసరం. ప్రభుత్వాలు, పరిశ్రమలు కలిసి ప్రమాదాలను తగ్గించడానికి, ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడటానికి చర్యలు తీసుకోవాలి.
-నిమ్మగడ్డ లలితప్రసాద్
బ్రహ్మయ్య అండ్ కో, విజయవాడ