Share News

Revolution In India: అరణ్యవాసంలోనే విప్లవప్రభాతం

ABN , Publish Date - Jul 25 , 2025 | 02:07 AM

విప్లవం ఏమిటి విప్లవ సాధనకు హింస తప్పనిసరి అని విశ్వసిస్తారు. సాయుధ పోరాటంతో..

Revolution In India: అరణ్యవాసంలోనే విప్లవప్రభాతం

విప్లవం ఏమిటి? విప్లవ సాధనకు హింస తప్పనిసరి అని విశ్వసిస్తారు. సాయుధ పోరాటంతో విప్లవాన్ని ముడిపెడతారు. విప్లవానికి తుపాకీ ప్రతీక కాదు. ఒక సమాజంలోని ప్రజలు తమ దుస్తర పరిస్థితులపై తిరుగుబాటు చేసి మౌలిక మార్పులు సాధించుకోవడమే విప్లవం. 1970ల్లో భారతీయ యువత తుపాకీని తిరుగులేని విప్లవ సాధనంగా ఆరాధించేది. కారణమేమిటి? భారతీయ ప్రజాస్వామ్యం ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని సాధించకపోవడమే. పైగా కమ్యూనిస్టులు తెలంగాణ విప్లవ మార్గాన్ని విడనాడి పార్లమెంటరీ ప్రజాస్వామ్య మార్గానికి మళ్లారు. నా తరం విద్యార్థులు మార్క్సిజాన్ని, లెనిన్‌ విప్లవాత్మక కార్యాచరణను అభిమానించేవారు. ఈ ప్రభావాల కారణంగా ఆ నాటి విద్యార్థి లోకం దేశ రాజకీయాల పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుండేది. 1975 నాటికి మన దేశంలో విప్లవం విజయవంతమవుతుందని విప్లవ కమ్యూనిస్టు పార్టీ నాయకులు పదేపదే ఉద్ఘాటిస్తుండేవారు. అవును, వారి ప్రబోధాలు, ఉద్ఘోషలతో విప్లవం నిజంగానే తుపాకీ గొట్టం ద్వారా వస్తుందని పరిపూర్ణంగా నమ్మేవాళ్లం. మా స్వప్నాలను విప్లవ ఝంఝ ఊపివేస్తుండేది. ఖమ్మంలో విద్యార్థిగా ఉన్నప్పుడు నాకు ఒక తుపాకీని పంపారు. విప్లవోత్సాహంలో ఉన్న నా మిత్రులు కొంతమంది నడిగూడెంలోని ఒక బ్యాంకులో దోపిడీకి పాల్పడి అరెస్టయ్యారు వారి రాజకీయాలు అంతటితో ముగిశాయి. స్థానిక కాంగ్రెస్‌ నాయకుడు ఒకరిని హతమార్చేందుకు నా విప్లవ మిత్రులు పథకం రచించారని తెలిసి నేను వారితో విభేదించాను. విప్లవ కార్యకలాపాలకు దూరంగా ఉన్నాను.


మార్క్స్‌ సిద్ధాంతాన్ని మరింతగా అధ్యయనం చేసేందుకు నేను జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చేరాను. నా సహచర విద్యార్థులలో అత్యధికులు ఉన్నత, విద్యాధిక వర్గాల వారి విద్యా సంస్థగా పేరుపొందిన (ఢిల్లీలోని) సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాల నుంచి వచ్చినవారే. సుదీర్ఘ చర్చలతో భారతదేశ సమస్యలకు నక్సలైట్‌ ఉద్యమం పరిష్కారం కాదనే నిర్ణయానికి మేము వచ్చాము. వర్గ సంబంధాలు, వర్గ పోరాటాలను మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాం. సామాజిక ఆధిపత్యాలను, సామాన్యుల అస్తిత్వ పోరాటాల తీరుతెన్నులను మరింతగా అర్థం చేసుకునేందుకు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజల భాగస్వామ్యాన్ని అవగాహన చేసుకోవడంపై నా దృష్టిని కేంద్రీకరించాను. బెంగాల్‌లోని నక్సల్‌బరీ గ్రామంలో ప్రారంభమైన నక్సలైట్‌ ఉద్యమం వెనుకబడిన ప్రాంతాలు అయిన ఇల్లందు, శ్రీకాకుళం, కరీంనగర్‌లో కొనసాగింది. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో వలె భూములను పేదలకు పంపిణీ చేశారు. అయితే రైతులు పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాలలో భాగస్వాములయ్యారు. నాటి ప్రధాని ఇందిర తన మితవాద ప్రత్యర్థులను చిత్తుచేసేందుకు భూ సంస్కరణలను ప్రవేశపెట్టారు. దళితుల సంక్షేమానికి అగ్రప్రాధాన్యమిచ్చారు. అదే సామ్యవాదమని ఉధృతంగా ప్రచారం జరిగింది.


గ్రామాలలో రైతులు వాణిజ్య పంటలు సాగుచేసి ధనవంతులయ్యారు. వారి జీవనశైలి మారింది. విద్యా సదుపాయాల అభివృద్ధితో గ్రామీణ భారతంలో పార్లమెంటరీ రాజకీయాలకు ఇతోధిక ఆదరణ లభించింది. పరిశ్రమల ప్రైవేటీకరణతో కార్మిక వర్గం సైతం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఆదరించింది. కొత్త సాంకేతికతలు, మేనేజ్‌మెంట్‌ పద్ధతులతో పట్టణీకరణ విస్తరించింది. మొత్తంమీద భారతీయ సమాజం పెట్టుబడిదారీ విధానాన్ని అంగీకరించింది. నగరాలు, పట్టణాలు, గ్రామాలలో ప్రజల ఆలోచనారీతులు మౌలికంగా మారిపోయాయి. ఆస్తుల ఆర్జనకు, బిడ్డల చదువులకు ప్రాధాన్యం పెరిగింది. మార్క్సిస్టులు బూర్జువా విప్లవంగా పేర్కొనే పెట్టుబడిదారీ అభివృద్ధి విధానం సువ్యవస్థితంగా సుస్థిరమయింది. ఇదిలా వుంటే నక్సలైట్లు తమ పాత విప్లవ విధానాలనే కొనసాగించారు. ఫలితంగా రైతు కూలీల మద్దతును పొందడంలో విఫలమయ్యారు. ఈ కారణంగా వారికి అరణ్యవాసం అనివార్యమయింది. అడవి బిడ్డలు అయిన ఆదివాసీల మద్దతుతో విప్లవ సాధనకు నక్సల్స్‌ పూనుకున్నారు. ఆదివాసీల చైతన్యశీలత తమ భూములను ఆక్రమించుకున్న మైదాన ప్రాంతాల రైతులు, వడ్డీ వ్యాపారస్తులు, అటవీశాఖ అధికారులకు వ్యతిరేకంగా సంప్రదాయ పద్ధతులలో పోరాడేందుకు పరిమితమయింది. తుపాకులతో నక్సల్స్‌ చేసే పోరాటాలు గిరిజనుల మన్ననలు పొందలేకపోయాయి. మైదాన ప్రాంతాల నక్సలైట్‌ నాయకులే అడవులలోనూ ప్రధాన నాయకులుగా కొనసాగారు. అమాయకులు అయిన ఆదివాసీలు తమ ప్రాంతాలలో జరుగుతున్న వినూత్నరీతుల పోరాటాల గురించి తమలో తాము చర్చించుకున్నారు. పోలీసులు నక్సల్స్‌ ఉద్యమ వివరాలను గురించి ఆదివాసీల నుంచే తెలుసుకున్నారు. నక్సలైట్‌ ఉద్యమం తమకు అనుకూలమైనదనే వాస్తవం సైతం ఆ అమాయక ఆదివాసీలకు తెలియదు. కొంతమంది ఆదివాసీలను ఇన్ఫార్మర్లు అనే అభియోగంతో నక్సలైట్లు కాల్చివేయడం జరిగింది. అదే సమయంలో నక్సల్స్‌ సానుభూతిపరులు అనే మిషతో అమాయక అడవి బిడ్డలను పోలీసులు నానా విధాలుగా హింసించడం, వేధించడం జరిగింది.


నక్సలైట్‌ ఉద్యమం పరిపూర్ణ ప్రజా ఉద్యమంగా పరిణమించలేదు. తుపాకీ పట్టిన యువజనులు, రాజ్య వ్యవస్థ భద్రతా బలగాల మధ్య సాయుధ పోరాటంగా మారిపోయింది. నక్సలైట్‌ ఉద్యమాన్ని శాంతిభద్రతల సమస్యగా ప్రభుత్వం పరిగణించింది. పట్టణాలు, నగరాలలో నక్సల్‌ ఉద్యమానికి మద్దతునిస్తున్నవారు విప్లవ భావనను ప్రచారం చేస్తూ యువజనులను ఆ ఉద్యమంలో చేరేందుకు ప్రోత్సహించారు. ఇటువంటి రాజకీయ వాతావరణం నుంచి ప్రభవించిందే పౌర హక్కుల ఉద్యమం. పలువురు బుద్ధిజీవులు నక్సలైట్‌ మేధావులుగా పేరు పొందారు. పట్టణాలు, నగరాలలోని నక్సల్స్‌ మద్దతుదారులు మార్క్స్‌, లెనిన్‌ గురించి మాట్లాడటం మినహా ఎలాంటి విప్లవ సిద్ధాంతాన్ని అభివృద్ధిపరచలేదు.


ప్రపంచ చరిత్రలోనే ఒక మహోన్నత స్ఫూర్తిదాయక జాతీయోద్యమం నుంచి స్వతంత్ర భారతదేశం ప్రభవించింది. సార్వత్రిక వయోజన ఓటుహక్కు పునాదిగా ప్రజాస్వామ్య వ్యవస్థను అభివృద్ధిపరచుకున్నది. రైతులు, రైతు కూలీలు, దళితులు, ఆదివాసులు, వెనుకబడిన కులాలవారు క్రమేణా ఈ ప్రజాస్వామ్య స్రవంతిలో సంలీనమయ్యారు. దళితులు, గిరిజనులు, బీసీలకు సామాజిక న్యాయాన్ని సమకూర్చేందుకు రాజ్యాంగబద్ధమైన భరోసాలు కల్పించారు. నక్సలైట్లు సాధన చేస్తున్న విప్లవం రాజ్య వ్యవస్థపై భారీ ఎత్తున ప్రజల తిరుగుబాటుగా రూపుదాల్చలేదు. నక్సలైట్‌ ఉద్యమాలు యాభై సంవత్సరాలుగా ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని గానీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థను గానీ ప్రభావితం చేయలేకపోయాయి. అయితే తమ సైద్ధాంతిక విశ్వాసాలకుగాను ఎంతో మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలు సామ్యవాద సమాజాల నిర్మాణానికి ఆస్కారం కల్పిస్తాయా? సంశయాస్పదమే. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలు అన్నీ మితవాద విధానాల వైపు మొగ్గుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలను కార్పొరేటీకరణ చేస్తున్నాయి. ఇది ఘనీభవించిన యథార్థం. నక్సలైట్లు తమ ఆయుధాలతో రాజ్యానికి లొంగిపోయి పునరావాసం పొందడానికి ప్రయత్నించాలి. లొంగిపోయిన నక్సల్స్‌కు సౌకర్యవంతమైన పునరావాసం కల్పిస్తామనే హమీతో వారిని పార్లమెంటరీ ప్రజాస్వామిక మార్గం వైపు మళ్లించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.

-ఇనుకొండ తిరుమలి చరిత్రకారుడు

Updated Date - Jul 25 , 2025 | 02:07 AM