Old Pension Scheme: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని
ABN , Publish Date - Aug 23 , 2025 | 05:24 AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,449 ఉపాధ్యాయుల నియామకాల కోసం 2003 నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,449 ఉపాధ్యాయుల నియామకాల కోసం 2003 నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో పరీక్షలు నిర్వహించి, ఫలితాలను 2004 జూన్‌లో విడుదల చేసింది. అదే నెలలో అభ్యర్థుల ఎంపిక జాబితాలను ప్రకటించి, సర్టిఫికెట్లను పరిశీలించి, వెంటనే నియామకాల కోసం షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వం పరిపాలనాపరమైన కారణాలతో కాలయాపన చేసింది. దీంతో ఎంపికయిన డీఎస్సీ–-2003 అభ్యర్థులు ఉద్యమ బాట పట్టడంతో ప్రభుత్వం నవంబర్ -2005లో నియామకాలు పూర్తిచేసింది. జనవరి -1, 2004 నుంచి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు నూతన్ పెన్షన్ విధానాన్ని (ఎన్‌పీఎస్) అమల్లోకి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 2004లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను కేంద్రం అమలుచేసింది. ఈ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 1, 2004 నుంచి విధుల్లోకి వచ్చిన ఉద్యోగులకు డిఫైన్డ్ పెన్షన్ స్కీం(పాత పెన్షన్) రద్దుచేసి, సీపీఎస్ విధానాన్ని అమలు చేసింది. కానీ 2003లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో సీపీఎస్ విధానం అమలు గురించి గానీ, నియామక ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఉండే విషయాలు వర్తిస్తాయని గాని ఎక్కడా పేర్కొనలేదు. డీఎస్సీ–2003 ద్వారా నియామకమైన వారికి జీపీఎఫ్ స్థానంలో సీపీఎస్ ఖాతా ప్రారంభించింది. దీంతో ఆందోళనకు గురైన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఫోరం తరపున ప్రభుత్వ పెద్దలను అనేకసార్లు కలిసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని విజ్ఞప్తులు చేసినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉపాధ్యాయులే కాక, డిసెంబర్ 1999లో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా గ్రూప్–2 పోస్టులకు; డిసెంబర్ 2003లో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి కొన్ని అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్, 2004 తర్వాత నియామకాలు జరిగాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1) డీఎస్సీ-–2003 ఉపాధ్యాయులు 7,361 మంది, పోలీస్ కానిస్టేబుల్స్ 1,821, గ్రూప్–2 సర్వీస్ ఉద్యోగులు 1,800... మొత్తంగా 10,982 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఉద్యోగ, ఉపాధ్యాయులకు వజ్రాయుధం అయింది.
జనవరి 1, 2004కు ముందు నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నూతన పెన్షన్ విధానంలోకి అనివార్యంగా వచ్చిన సందర్భంలో వారు కోర్టులను ఆశ్రయించారు. వివిధ రాష్ట్రాల హైకోర్టులు, కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ కోర్టు తీర్పులను సూచిస్తూ, వివిధ ప్రాతినిధ్యాలు, నిర్ణయాల దృష్ట్యా డిసెంబర్ 22, 2003కి ముందు ఎంపికై జనవరి 1, -2004 తరువాత నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ మెమో 57 ప్రకారం వన్ టైం ఓపీఎస్ (పాత పెన్షన్) ఆప్షన్‌ను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇప్పటివరకు భారతదేశంలో మెమో 57 ప్రకారం భారతీయ రైల్వే, తపాలా, సెంట్రల్ బెటాలియన్ ఫోర్స్ తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు; సుమారు 16 రాష్ట్రాల్లోని ఉద్యోగులకు పాత పెన్షన్‌ను పునరుద్ధరించారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పాత పెన్షన్ అమలుకై నిర్ణయం తీసుకోలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వంలోని ముగ్గురు ఐఏఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం -2023లో గత రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. అత్యున్నత హోదాలో ఉన్న అధికారులకు ఒక న్యాయం, దిగువ స్థాయిలో ఉన్న ఉద్యోగ–ఉపాధ్యాయులకు ఒక న్యాయం సరైన విధానం కాదు. రాష్ట్రంలో గత ప్రభుత్వం 2022లో ఉద్యోగ సమస్యలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం కేంద్ర ప్రభుత్వ మెమో 57 అనుసరించి డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి అంగీకరించింది. అలాగే 2024 ఫిబ్రవరిలో ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కూడా అర్హత గల ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి లిఖితపూర్వక హామీ ఇచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ, నిబంధనలకు సంబంధించి సీజేఐ జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నవంబర్ 7, 2023న కీలక తీర్పు వెల్లడించింది. రిక్రూట్‌మెంట్ మధ్యలో రూల్స్ మార్చకూడదని, ఉద్యోగ నియామక ప్రక్రియ నిబంధనలు ఏకపక్షంగా ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 14కు అనుగుణంగా ఉండాలని, వివక్షకు తావు ఉండరాదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా సెప్టెంబర్ 1, 2004కు ముందు రిక్రూట్ అయిన ఉద్యోగుల వివరాలను 2020 నుంచి ఇప్పటివరకు దాదాపు 20సార్లు రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. గత ప్రభుత్వం ఉద్యోగులకు హామీ ఇచ్చి కూడా మొండి చేయి చూపించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏడాది దాటినా ఈ సమస్య పట్ల సాచివేత ధోరణితోనే ఉంది. మాకు సంబంధించిన ఫైల్ ఆర్థికశాఖ వద్ద సంవత్సర కాలంగా పెండింగ్‌లో ఉంది. మెమో 57 ప్రకారం పాత పెన్షన్ పునరుద్ధరణకు కేంద్రం, రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వనవసరం లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణం స్పందించి రాష్ట్రంలో ఉన్న 11,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
-కొమ్మనబోయిన లక్ష్మీశ్రీనాథ్ రాష్ట్ర కన్వీనర్,
డీఎస్సీ–2003 ఉపాధ్యాయుల ఫోరం