Medical Education: కనుమరుగవుతున్న కుటుంబ వైద్యం
ABN , Publish Date - Jul 01 , 2025 | 12:32 AM
భారతరత్న గ్రహీత, ప్రముఖ వైద్యులు, దాత, విద్యావేత్త, చాలాకాలం పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పని చేసిన డాక్టర్ బి.సి. రాయ్ సేవలను స్మరించేందుకు ప్రతి ఏటా జూలై 1ని జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుతారు. ఈ రోజు నాకు వ్యక్తిగతంగా కూడా ముఖ్యమైన రోజు.
భారతరత్న గ్రహీత, ప్రముఖ వైద్యులు, దాత, విద్యావేత్త, చాలాకాలం పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పని చేసిన డాక్టర్ బి.సి. రాయ్ సేవలను స్మరించేందుకు ప్రతి ఏటా జూలై 1ని జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుతారు. ఈ రోజు నాకు వ్యక్తిగతంగా కూడా ముఖ్యమైన రోజు. ఎందుకంటే సరిగ్గా 34 ఏళ్ల క్రితం (1991లో), ఇదే రోజున నేను వైద్యుడిగా పట్టభద్రుడిని అయ్యాను. అంతేగాక తొమ్మిదేళ్ల క్రితం (2016లో), భారతదేశంలో వైద్యులకు లభించే అత్యున్నత గౌరవమైన డాక్టర్ బి.సి. రాయ్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నాను. అందువల్ల, ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం. ప్రస్తుతం మన దేశంలో సమర్థవంతమైన ఆరోగ్య సేవలు ఎంతో కీలకమైనప్పటికీ, ఎంతో నిర్లక్ష్యానికి గురవుతున్న ‘ఫ్యామిలీ మెడిసిన్’ గురించి నా ఆలోచనలను పంచుకోవాలనుకుంటున్నాను. ఒకానొక కాలంలో కుటుంబంలో ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా మొదట ‘ఫ్యామిలీ డాక్టర్’ దగ్గరకే వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఈ ‘ఫ్యామిలీ డాక్టర్’ అనే భావన క్రమక్రమంగా అదృశ్యమవుతున్నది. దాంతో రోగులు చిన్నపాటి సమస్యలకు కూడా నేరుగా ఆసుపత్రులకే పరుగులు పెడుతున్నారు. తద్వారా ఇప్పటికే రోగులతో నిండిపోయిన ఆసుపత్రులపై మరింత భారం పడుతున్నది. అనేక అభివృద్ధి చెందిన దేశాలలో ‘ఫ్యామిలీ మెడిసిన్’ను ఒక ప్రత్యేక వైద్యశాఖగా పరిగణిస్తారు. అక్కడ ప్రత్యేకమైన పోస్టు గ్రాడ్యుయేట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్స్ ద్వారా ఇందులో శిక్షణనూ అందిస్తున్నారు. భారతదేశంలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలను ప్రోత్సహించడంతో పాటు, ‘ఫ్యామిలీ మెడిసిన్’ను ఒక ప్రత్యేక స్పెషాలిటీగా అభివృద్ధి చేయాలన్న దిశగా కృషి చేస్తోంది. అయితే ఇప్పటికీ ‘ఫ్యామిలీ మెడిసిన్’ను ఎంబీబీఎస్ స్థాయిలో అండర్ గ్రాడ్యుయేట్ శిక్షణలో భాగంగా చేర్చలేకపోయింది. భారతదేశంలో ఫ్యామిలీ మెడిసిన్‌లో మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు 2011లో కేరళ రాష్ట్రం, కొజికోడ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రారంభమైంది. అయితే, ఇప్పుడు 2025లోకి వచ్చేసరికి, దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది ఫ్యామిలీ మెడిసిన్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్థాయిలో అందుబాటులో ఉన్న సీట్లు 150కంటే తక్కువ ఉన్నాయి. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇది ఆశ్చర్యపరిచే సంఖ్య! ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లలో మెజారిటీ వైద్యలను కొన్ని విభాగాల్లో స్పెషలిస్టులుగా మార్చే దిశగానే కేటాయించబడ్డాయి.
ఫలితంగా, పీజీ సీటు పొందలేకపోయిన చాలామంది వైద్యులు విదేశాలకు వెళ్లి ఉన్నతమైన స్పెషలిస్టు శిక్షణ తీసుకుంటున్నారు. మరోవైపు, ‘ఫ్యామిలీ మెడిసిన్’ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు దరఖాస్తు చేసేవాళ్ల సంఖ్య తక్కువగా ఉంటున్నది. భారతదేశ జనాభాలో 70శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నప్పటికీ, వైద్యులలో 25శాతం కంటే తక్కువమంది మాత్రమే ఈ ప్రాంతాల్లో పని చేస్తున్నారు. మెట్రో ప్రాంతాల వెలుపల, ఒక్కో ఫ్యామిలీ డాక్టర్‌కు సగటున 7,500 మంది రోగులు ఉండగా, అత్యంత దుర్భర ప్రాంతాల్లో ఈ నిష్పత్తి ఒక్కో ఫ్యామిలీ డాక్టర్‌కు సగటున 25,000 మందికి పడిపోతున్నది. ఇలా ఫ్యామిలీ డాక్టర్ల కొరత భారతదేశ ఆరోగ్య వ్యవస్థలోని అతి ముఖ్యమైన లోటుగా తయారైంది. దీనికి పరిష్కారంగా ఈ ఐదు పాయింట్ల అజెండాపై పాలకులు, విధాన నిర్ణేతలు దృష్టి పెట్టాలి: 1. ‘ఫ్యామిలీ మెడిసిన్’ను అండర్ గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్) పాఠ్యాంశాల్లో చేర్చాలి. భారతదేశం అంతటా ప్రతి వైద్య కళాశాలలో ఫ్యామిలీ మెడిసిన్ కోసం విభాగాలను ఏర్పాటు చేయాలి. ఈ విభాగంలో శిక్షణను అందించే వైద్య కళాశాలల సంఖ్యను పెంచాలి. 2. భారతదేశానికి స్పెషలిస్టు వైద్యుల అవసరం ఉన్నదనే విషయంలో అనుమానం లేదు. కానీ, ఫ్యామిలీ డాక్టర్ల సంఖ్యను పెంచడం ఇంతకన్నా ముఖ్యం. ఫ్యామిలీ డాక్టర్ల శిక్షణపై మన దేశం పెట్టుబడులు పెంచాలి. అదే సమయంలో, ఎంబీబీఎస్ కోర్సులో చేరిన యువ విద్యార్థులకు ఫ్యామిలీ మెడిసిన్ భావనపై అవగాహన కలిగిస్తూ, దీనిపై ప్రజాదరణనూ పెంచాలి. 3. భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సదుపాయాల నిర్మాణాన్ని బలోపేతం చేయాలి. అప్పుడే స్థానికంగా ఫ్యామిలీ డాక్టర్ల ద్వారా నాణ్యమైన వైద్య సేవలు రోగులకు అందుతాయి. దాంతోపాటు, పరీక్షలు చేయించుకోవడం లేదా చికిత్స పొందడానికి ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం తగ్గుతుంది. 4. సమాచార ప్రసార మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం– భారతదేశంలో 1.2 బిలియన్లకు పైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు, 850 మిలియన్లకు పైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. 2026 నాటికి దేశంలో 1 బిలియన్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉంటారని అంచనా. డిజిటల్ టెక్నాలజీలలో భారతదేశం ఇలా ప్రపంచాన్ని ముందుండి నడిపిస్తున్నప్పటికీ, దేశ వైద్యశాలల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రయోజనం వినియోగంలోకి రావటం లేదు.
ఈ లోటు తీరేలా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో సాంకేతిక పురోగతులను తీసుకురావాలి. 5. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) మోడల్‌ను మనం భారతదేశంలోనూ అనుసరించవచ్చు. భారతదేశంలో ఎక్కువ శాతం ఆరోగ్య సేవలు ప్రైవేట్ రంగం ద్వారానే అందుతున్నాయి. కనుక, ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణను బలోపేతం చేయటంలో ప్రైవేట్ రంగాన్ని భాగస్వామిగా తీసుకోవటానికి ఇక్కడ అనుకూలమైన పరిస్థితి ఉన్నది. భారతదేశం స్వాతంత్ర్యం సాధించుకొని 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడేళ్లు గడిచాయి. ‘అమృత కాలం’లోకి అడుగుపెట్టిన సందర్భంగా, 2047 నాటికి, అంటే స్వాతంత్ర్యపు 100వ సంవత్సరం నాటికైనా, ‘ఫ్యామిలీ డాక్టర్’ భావనను బలమైనదిగా, ప్రభావవంతమైనదిగా మార్చాలన్న లక్ష్యాన్ని ముందు పెట్టుకుని, ఆ దిశగా స్ఫూర్తిదాయకమైన, అమలు చేయగలిగే, స్పష్టమైన చర్యలు తీసుకోవాలి. అందుకు ఇదే తగిన సమయం. వైద్య నీతిని, ఆచరణను నిర్దేశించే గ్రీకుల కాలం నాటి హిపోక్రటిక్ ప్రతిజ్ఞలో కీలకమైన అంశం: ‘‘రోగికి మేలు చేకూర్చటమే వైద్యుడి అత్యున్నత ప్రాధాన్యంగా ఉండాలి’’ అన్నది. ఈ మార్గదర్శక నియమాన్ని చిత్తశుద్ధితో పాటించినప్పుడే భారతదేశ ఆరోగ్య సంరక్షణ విధానాన్ని సమర్థవంతంగా పునర్నిర్మించేందుకు మార్గం సుగమం అవుతుంది.
- డా. పి. రఘురామ్
సంస్థాపక డైరెక్టర్, కిమ్స్
–ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్
సంస్థాపకులు & చైర్మన్,
ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్
(నేడు జాతీయ వైద్యుల దినోత్సవం)