Share News

Injustice For Farmers: రెవిన్యూ తప్పులకు రైతులకు శిక్షా

ABN , Publish Date - Jul 04 , 2025 | 02:16 AM

జగన్ జమానాలో జరిగిన రీ సర్వే రైతులను సమస్యల ఉబిలో పడేసింది. వందేళ్ల తరువాత మేమే సర్వే చేస్తున్నాం అని గొప్పగా చాటుకొని రైతాంగానికి ఎన్నో సమస్యలను అంటగట్టింది జగన్‌ ప్రభుత్వం.

Injustice For Farmers: రెవిన్యూ తప్పులకు రైతులకు శిక్షా

గన్ జమానాలో జరిగిన రీ సర్వే రైతులను సమస్యల ఉబిలో పడేసింది. ‘వందేళ్ల తరువాత మేమే సర్వే చేస్తున్నాం’ అని గొప్పగా చాటుకొని రైతాంగానికి ఎన్నో సమస్యలను అంటగట్టింది జగన్‌ ప్రభుత్వం. రైతుల సమక్షంలో రీ సర్వే చేయకుండా.. అత్యాధునిక పరికరాలతో సర్వే చేస్తున్నామని పదే పదే చెప్పిన నాటి ఉన్నతాధికారులు.. సర్వేను, నమోదును తమ ఇష్టానుసారం చేశారు. ఒక రైతు పేరిట ఉన్న సర్వే నెంబర్‌ను మార్చి, పక్కనే ఉన్న ఇద్దరి ముగ్గురు రైతులను కలిపి ఎల్‌పీఎం పేరుతో ఒకే సర్వే నెంబర్ ఇచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన వారినే కాకుండా, ఇతరులతో కలిపి జాయింట్ ఎల్‌పీఎం ఇచ్చారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అధికారులు ‘ఆ జాయింట్ ఎల్‌పీఎంను విడదీసి, ప్రతి వారికి ప్రత్యేకంగా ఒక సర్వే నెంబర్ కేటాయిస్తే తప్ప రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేదు’ అంటున్నారు.


దీనివల్ల లక్షలాది మంది రైతులు తమ భూమిని కుటుంబ అవసరాలకు అమ్ముకోవడానికి, బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడానికి వీలుకాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ తప్పిదాన్ని గుర్తించింది. రీ సర్వే చేసి జాయింట్ ఎల్‌పీఎంలను విడదీయడానికి రూ. 50 చెల్లించాలని, జూన్ 30 వరకు మాత్రమే ఈ అవకాశం అని రైతులకు తెలిపింది. జులై 1 తర్వాత దరఖాస్తు చేసుకుంటే వారు రూ. 550 కట్టాలని చెప్పింది.


తప్పులు చేసింది రెవిన్యూ అధికారులు, శిక్ష రైతులకా! అని రైతన్నలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో వందల సర్వేయర్లను ప్రభుత్వం నియమించింది. వారితో ఉచితంగా సర్వే చేయించకుండా రైతులతో 550 రూపాయలు కట్టించుకోవడం సరికాదని ప్రభుత్వానికి రైతులు విన్నవిస్తున్నారు. ఇలాంటి వాటివల్ల లక్షలాది మంది రైతుల్లో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉంది. ఈ సమస్యపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి. రీ సర్వే చేసి రైతుల చిక్కులను తొలగించాలి.

– మారిశెట్టి జితేంద్ర, రాజమహేంద్రవరం

Updated Date - Jul 04 , 2025 | 02:16 AM