Share News

Democratic Rights Is Essential: ప్రజల హక్కులు గౌరవిస్తేనే సుస్థిరత

ABN , Publish Date - Sep 18 , 2025 | 06:22 AM

ఇటీవల కాలంలో మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌, మయన్మార్‌, శ్రీలంక, పాకిస్థాన్‌ వంటి దేశాలలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నేపాల్‌లో ప్రజల తీవ్ర ఆందోళనల మధ్య ఆ దేశ ప్రధానమంత్రి రాజీనామా చేయవలసి వచ్చింది.....

Democratic Rights Is Essential: ప్రజల హక్కులు గౌరవిస్తేనే సుస్థిరత

ఇటీవల కాలంలో మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌, మయన్మార్‌, శ్రీలంక, పాకిస్థాన్‌ వంటి దేశాలలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నేపాల్‌లో ప్రజల తీవ్ర ఆందోళనల మధ్య ఆ దేశ ప్రధానమంత్రి రాజీనామా చేయవలసి వచ్చింది. దానికంటే ముందు బంగ్లాదేశ్‌లో కూడా అలాంటి ఆందోళనల మధ్య ఆ దేశ ప్రధాని రాజీనామా చేసి, భారతదేశంలో తలదాచుకోవాల్సి వచ్చింది. కొన్ని సందర్భాలలో ఆందోళనలు అరాచకరూపం కూడా తీసుకున్నాయి. ఈ ఆందోళనల వెనక ఉన్న ప్రధానమైన కారణం ఆ దేశ ప్రజల సమస్యలు పెరగడం, వాటిని పరిష్కారం చేయకపోగా, ఆయా పాలకులు ప్రజల అసంతృప్తిని అణచివేయడానికి చేసే ప్రయత్నాలే ప్రధానంగా కనపడతాయి. నేపాల్‌లో వాస్తవంగా గత దశాబ్దంన్నర కాలంలో చాలా చైతన్యవంతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం వైపుగా ఆ దేశం అడుగులు వేసింది. సాయుధ పోరాట మార్గాన్ని వదిలి మావోయిస్టు పార్టీ కూడా ప్రధాన జీవన స్రవంతిలో కలిసి ఎన్నికలలో భాగస్వాములు కావడం వంటి అనేక పరిణామాలు ఆ దేశంలో చోటుచేసుకున్నాయి. అయితే వరుసగా ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం చేయడంలో విఫలమయ్యాయి. దీనికి తోడు ప్రజల అసంతృప్తిని అణచివేయడానికి తీవ్ర నిర్బంధ చర్యలకు కూడా పాల్పడ్డాయి. చివరకు సోషల్‌ మీడియా మీద కూడా నిషేధం విధించడంతో ప్రజల అసంతృప్తి కట్టలు తెంచుకుంది. అప్పటిదాకా ఓర్పుతో ఉన్న ప్రజానీకం ఒక్కసారిగా రోడ్లమీదకు వచ్చి తిరగబడింది. అది హింసా రూపం కూడా తీసుకుంది. దాదాపు ఇలాంటి పరిణామాలే బంగ్లాదేశ్‌లో కూడా గత సంవత్సరం చోటుచేసుకున్నాయి.


ఈ సందర్భంగా మన దేశంలోని పాలకులు ఈ పరిణామాల నుంచి నేర్చుకోవలసిన విలువైన పాఠాలు ఉన్నాయి. నేడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనతో దేశ ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక అసమానతలు, పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగం, గిట్టుబాటు ధర, మహిళలపై అత్యాచారాలు, పరస్పర అపనమ్మకాలు వంటివి ఈ రోజు దేశంలో నిత్యకృత్యమయ్యాయి. ఇవన్నీ పాలకుల కార్పొరేట్‌ అనుకూల విధానాల ఫలితాలే. వివిధ తరగతుల ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తిని అణచివేయడానికి ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తోంది. అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను సుదీర్ఘకాలం పాటు విచారణ చేపట్టకుండా జైల్లో నిర్బంధించిన ఉదంతాలు ఉన్నాయి. ఇవన్నీ దేనికి సంకేతాలుగా నిలుస్తున్నాయి అన్నది పరిశీలిస్తే నేడు దేశంలో నెలకొన్న వాతావరణం అవగతమవుతుంది. ఇన్ని తీవ్ర సమస్యలు ఉన్నా మన దేశంలో పొరుగు దేశాలలో లాగా ఆందోళనలు ఎందుకు జరగడం లేదు అన్న సందేహం సహజంగానే కలుగుతుంది. దీనికి ప్రధాన కారణం ప్రజలలో అసంతృప్తి లేకపోవడం మాత్రం కాదు. దీనికి భిన్నంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్‌ తాజాగా పేర్కొన్నట్లు మన రాజ్యాంగం విశిష్టతే దీనికి ప్రధాన కారణం. భారతదేశ రాజ్యాంగంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు, ప్రభుత్వాలను ఎన్నుకునే ప్రజాస్వామ్య హక్కులు వంటివి అనేకం ఉన్నాయి. అలాగే అత్యంత విలువైన ఓటు హక్కును కూడా మన రాజ్యాంగం కల్పించింది. వీటి ద్వారా ప్రజలు తమ అసంతృప్తిని ఎన్నికల సందర్భాలలో తమకు నచ్చని ప్రభుత్వాలను మార్చేసే రూపంలో వ్యక్తం చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ హక్కులు ఎంతో కొంత మేరకు కొనసాగడం వల్లనే మన దేశంలో అటువంటి అరాచకాలు, ఆందోళనలు జరగలేదు. కానీ పరిస్థితి ఎల్లకాలం ఇలాగే ఉంటుందని అనుకోలేమని కొన్ని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.


కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలలోని పాలక పార్టీలు.. ప్రజల అసంతృప్తిని అణచి వేయడానికి తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాయి. కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా సెక్షన్‌ 144, సెక్షన్‌ 30 వంటివి నిరవధికంగా కొనసాగిస్తున్నాయి. సభలకు, ప్రదర్శనలకు, నిరసనలకు సైతం అనుమతులు నిరాకరిస్తున్నారు. ప్రజలు తమ అసంతృప్తిని వెలిబుచ్చే గొప్ప ప్రజాస్వామ్య అవకాశం మన దేశంలో ఎన్నికల వ్యవస్థ కల్పించింది. దీన్ని కూడా పూర్తిగా నిలిపివేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతోంది. ఎన్నికల కమిషన్‌ నియామక ప్రక్రియనే పూర్తిగా మార్చేసి, తమకు అనుకూలమైన వారిని నియమించుకొని, స్వతంత్రంగా ఉండవలసిన ఆ కమిషన్‌ను తన గుప్పెట్లో పెట్టుకుంది. అయినా గెలుస్తామనే నమ్మకం లేక ఓటర్లను డబ్బు, మతం, కులం పేరుతో తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇంకా గెలుపుపై నమ్మకం కుదరకపోవడంతో తమకు రావనుకునే ఓట్లను తొలగించే పనికి కూడా పూనుకుంది. బిహార్‌ రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న ఎన్నికల సవరణ ఇందులో భాగమే. కొత్త ఓటర్లను చేర్చడం, పాత ఓటర్లను తొలగించడం వంటి చర్యల ద్వారా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేలా ఎలా వ్యవహరించారో కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్‌ పార్లమెంటు స్థానంలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గ ఉదాహరణ ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఇలాంటివి దేశంలో చాలా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై స్పందించి, జరిగిన తప్పులను ఆమోదించి, సరిచేయవలసిన ఎన్నికల కమిషన్‌, ఆ పని చేయకపోగా తిరిగి ప్రశ్నించిన వారిపై ఎదురు దాడికి దిగడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. కేంద్ర ప్రభుత్వ ఈ చర్యలన్నీ మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి.


ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తిని బలవంతంగా అణచివేయడం ఎల్లకాలమూ సాధ్యం కాదని మనకు పొరుగు దేశాల అనుభవాలు తేటతెల్లం చేస్తున్నాయి. అందువల్ల నేడు మన దేశ పాలకుల వద్ద రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ప్రజానుకూల విధానాలను అవలంబించడంతో పాటు, ప్రజలు తమ అసంతృప్తిని వెలిబుచ్చే అన్ని ప్రజాస్వామ్య హక్కులను గౌరవించి, రాజ్యాంగ విలువలను పరిరక్షించడం. కానీ విచిత్రంగా మన పాలకులు ఆ రెండూ చేయడం లేదు. ఇంకా విచిత్రంగా ఇటీవల కొంతమంది కొన్ని వింత వాదనలు చేస్తున్నారు. అవేమిటంటే దేశంలోని ప్రజలకు– ముఖ్యంగా యువతకు భూత దయ, యోగా, ధ్యానం వంటివి అలవాటు చేస్తే వారి జీవితం ఆనందదాయకమై, మన దేశం సుభిక్షంగా ఉంటుందని. తద్వారా సమాజంలో జరుగుతున్న పరిణామాలు గురించి పట్టించుకోకుండా, వారు ఎటువంటి ఆందోళనలు చేయకుండా ప్రశాంత జీవనం గడుపుతారని సెలవిస్తున్నారు. అందుకేనేమో మోదీ ప్రభుత్వం పాఠ్యాంశాలలో ఇలాంటివి చేర్చింది. ఇంతకంటే విడ్డూరం మరొకటి ఉండదు. సమాజాన్ని సరైన మార్గంలో నడిపే బాధ్యత వహించవలసిన పాలకులు ఆ పని చేయకుండా, ఒక పక్క ప్రజలపై పెను భారాలు వేస్తూ, మరో పక్క ఆ ప్రజలు ఏమీ మాట్లాడకుండా యోగా, ధ్యానం వంటివి చేసుకుంటూ, నోరు మూసుకొని ఉండాలని ఉద్బోధిస్తోంది! దీని వెనుక దాగి ఉన్న ప్రభుత్వ ఉద్దేశ్యాలను కూడా ప్రజలు గమనించాలి. మన పొరుగు దేశాలలో జరుగుతున్న పరిణామాల వంటివి మనదేశంలో జరగకుండా ఉండడం... ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియను, భారత రాజ్యాంగ స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకోవడం ద్వారానే సాధ్యం. అప్పుడు మాత్రమే భారత్‌ ఒక గౌరవప్రదమైన సమాజంగా రూపుదిద్దుకోగలదు.

-ఎ. అజశర్మ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Updated Date - Sep 18 , 2025 | 06:22 AM