Share News

Cultural Commander of Our Times: మన కాలపు కల్చరల్‌ కమాండర్‌

ABN , Publish Date - Sep 06 , 2025 | 02:31 AM

తెలుగు సాంస్కృతిక రంగాన్ని బహుజన విముక్తి దిశగా పదునెక్కించిన ప్రజావాగ్గేయకారుల్లో ముందువరసలో నిలిచే పేరు మాస్టార్జీ. తన ఏడుపదుల జీవితంలో ...

Cultural Commander of Our Times: మన కాలపు కల్చరల్‌ కమాండర్‌

తెలుగు సాంస్కృతిక రంగాన్ని బహుజన విముక్తి దిశగా పదునెక్కించిన ప్రజావాగ్గేయకారుల్లో ముందువరసలో నిలిచే పేరు మాస్టార్జీ. తన ఏడుపదుల జీవితంలో అరవయ్యేళ్లను కళకే అంకితం చేసిన సాంస్కృతిక సేనాని. ఎర్రజెండా పాటకు దీటుగా బహుజన పాటను నిలబెట్టాడు మాస్టార్జీ. తెలుగు సమాజంలో లక్షలాదిమందికి బహుజన సోయిని అందించిన మహావాగ్గేయకారుడు. మూలాల్లోకి వెళ్లి, ఆ చరిత్రనంతా వందలాది పాటల్లోకి ఎక్కించి బహుజన రాజకీయాలు బోధించినవాడు. మూలవాసీ సిద్ధాంతాన్ని యాభై యేళ్ల క్రితమే తెలుగు నేలకు పరిచయం చేసిన దార్శనికుడు. విప్లవోద్యమ పాట పెద్దయెత్తున వెలువడుతున్న కాలంలో మాస్టార్జీ మాత్రం అంబేడ్కరిస్ట్‌ సాంస్కృతిక ఉద్యమానికి పునాదులు వేశాడు. నలుగురు నడిచే దారుల్లో ఎవ్వరైనా నడవగలరు. అలా కాకుండా కొత్త తొవ్వ వేయడం అందరివల్లా కాదు. అలాంటి ప్రత్యేకతను కలిగినవాడు మాస్టార్జీ. ఆయన పాటందుకుంటే అందులో బహుజన రాజకీయ పాఠమే ఉంటుంది తప్ప, అలరించే నిష్ప్రయోజనత ఉండదు.

మాస్టార్జీ అసలు పేరు గంగాధరి శ్రీరాములు. తెలుగు నేల మీద చెరగని ప్రభావాన్ని వేసిన సాంస్కృతిక అధ్యాయం జననాట్యమండలి. దాని కళాకారులకు ‘రగల్‌ జెండా’ బ్యాలే, దీపారాధన, బాంగ్డా వంటి డ్యాన్సులు నేర్పడానికి మాస్టర్‌గా వెళ్లాడు. అట్లా ఆయనను అందరు మాస్టార్జీగా సంబోధించడంతో, అదే పేరు స్థిరపడిపోయింది. 1952 సెప్టెంబర్‌ 7న సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని బొల్లారంలో సాధారణ మాదిగ కుటుంబంలో సత్యమ్మ, రాజయ్య దంపతులకు జన్మించాడు. తండ్రి రాజయ్య కూడా వీధి భాగవతం చెప్పేవాడు. ఆ ప్రభావం మాస్టార్జీపైన చిన్ననాడే పడింది. ఇక తన మేనత్త చంద్రమ్మ పాడే జానపద పాటలు కూడా మాస్టార్జీని కళాకారునిగా తీర్చిదిద్దాయి. తన ఏడవ ఏటనే పాటలు రాసే పని మొదలుపెట్టాడు.


తెలుగు సమాజంలో విప్లవ గాలులు వీచడం మొదలయ్యాయి. అయినా సరే మాస్టార్జీ మాత్రం అంబేడ్కర్‌ మార్గంలో తన పయనాన్ని కొనసాగించాడు. అందుకు కారణం కులవివక్ష పట్ల ఆయనకు చిన్ననాటి నుంచి తీవ్ర వ్యతిరేకత ఉండడమే. మరోవైపు ఉత్తర భారతాన 1970వ దశకంలో బిహార్‌లోని బెల్చీలో 12 మంది దళితులను ఠాకూర్లు ఊచకోత కోశారు. అలాగే 1975లో భగల్పూర్‌ జైలులో నలుగురు దళితుల కళ్లు పీకేశారు. ఈ రెండు సంఘటనలు మాస్టార్జీపై తీవ్ర ప్రభావం చూపాయి. దళితుల విముక్తి జరగాలంటే కులనిర్మూలన జరగాలని నిర్ణయించుకున్నాడు ఆయన. అలా ఇప్పటికీ సుమారు 400లకు పైగా పాటలు రచించి బహుజనులను ఆలోచింపజేశాడు.

ఈ నేపథ్యంలోనే మాస్టార్జీ రాసిన ‘అందుకో దండాలు... బాబా అంబేడ్కరా’ పాట తెలుగు నేల దశదిశలకూ వ్యాపించింది. ఎక్కడ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ జరిగినా ఇప్పటికీ వినపడుతూ ఆ పాట చరిత్రను సృష్టించింది. అందుకే అది అనతి కాలంలోనే ఎనిమిది భారతీయ భాషల్లోకి సైతం అనువాదం అయ్యింది. ఈ క్రమంలో మాస్టార్జీ పేరు ఉమ్మడి రాష్ట్రంలో మార్మోగింది. అది కేవలం భారతదేశం వరకే ఆగిపోలేదు. 2001లో దక్షిణాఫ్రికాలో జరిగిన డర్బన్‌ సదస్సులో మాస్టార్జీ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ సదస్సులో నల్లజాతి ప్రజలపైన మాస్టార్జీ ఆశువుగా రాసిన పాటే ‘బ్లాక్ ఈజ్ బ్యూటీ’. ఈ పాటకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులంతా పులకించిపోయారు. అలాగే 2011లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సైతం విదేశీయులను మైమరపింపజేసింది మాస్టార్జీ పాట.


కళ ద్వారా బహుజనులను మేల్కొల్పాలని సంకల్పించాడు మాస్టార్జీ. అట్లా 1977లో విశ్వజన కళామండలిని స్థాపించాడు. ఇక సాహిత్యం వల్ల ప్రజల్లో కలిగే మార్పును ముందే గుర్తించాడు ఆయన. అందుకే తాను పాటల వరకే పరిమితం కాలేదు. తనలో ఆడి, పాడే కళ ఉంది. దానిని సానబెట్టి అనేక నృత్య రూపకాలు రచించి ప్రదర్శించాడు. వాటితో పాటు ప్రజలను ఆలోచింపజేయడానికి నాటకం మంచి వాహకమని నమ్మాడు. అందుకే ‘‘రిక్షా రాజయ్య, స్కోరెంత?, అఖండ విప్లవజ్యోతి అంబేడ్కర్‌, ఇందాకటిది ఉందా?, ఈ పిచ్చికి పేరు పెట్టండి, వంద గొంతులు వెయ్యి డప్పులు, ఔను మల్లా (వీధి నాటకం), కాముడు, అమ్మా...ఆవు’’ వంటి నాటికలు రచించి, ప్రదర్శించాడు. మట్టిపూలు అనే కవితా సంపుటిని ప్రచురించాడు. ఇక ‘గుర్తు కొస్తున్నాయి’ కథా సంపుటితో పాటు, అనేక పాటలను వివిధ సందర్భాల్లో పుస్తకాలుగా, సీడీలుగా వెలువరించాడు.

అంబేడ్కర్‌ అన్నట్టు ‘‘చరిత్ర తెలియనివారు చరిత్రను సృష్టించలేరు’’. అందుకే బహుజనులకు వారి చరిత్రను తెలియజేసేందుకు పాటను ఒక వాహికగా మార్చుకున్నాడు మాస్టార్జీ. పాట ద్వారా రాజకీయాలు బోధించాలనే సోయి ఆయనలో మెండుగా ఉంది. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎటు పయనిస్తున్నాం, ఇప్పుడు మనమున్న ఈ దుస్థితికి చరిత్రలో ఎక్కడ మోసం జరిగిందో పాటలోనే విడమరిచి చెప్పడంలో మాస్టార్జీ నిష్ణాతుడు. అందుకే ఆయన లక్షలాదిమంది బహుజనులను ఆలోచింపజేయగలిగాడు. అంతేకాదు మాస్టార్జీ మూలవాసీ సిద్ధాంతాన్ని తెలుగు నేలకు పరిచయం చేశాడు. చరిత్రను బహుజన కోణంలో స్పృశించాడు. ఎర్రజెండా పాటకు దీటుగా బహుజన పాటను సృజించాడు. ఇట్లా తన కాలంలో ముందుకు వచ్చిన ప్రతీ ఉద్యమానికి పాటల మద్దతు తెలియజేశాడు. అణగారిన బాధితుల పక్షాన నిజమైన ప్రజాస్వామికవాదిగా నిలిచాడు.

-డా. పసునూరి రవీందర్‌

తెలంగాణ సాంస్కృతిక శాఖ సలహామండలి సభ్యులు

Updated Date - Sep 06 , 2025 | 02:31 AM