Jayant Vishnu Narlikar: విశ్వ శాస్త్రవేత్త
ABN , Publish Date - Jul 17 , 2025 | 01:15 AM
ఆధునిక భారతీయ ఖగోళశాస్త్రవేత్తలలో ప్రథమగణ్యుడు జయంత్ విష్ణు నార్లికర్. ఆయన ఈ ఏడాది మే 20న తనువు చాలించారు.
ఆధునిక భారతీయ ఖగోళశాస్త్రవేత్తలలో ప్రథమగణ్యుడు జయంత్ విష్ణు నార్లికర్. ఆయన ఈ ఏడాది మే 20న తనువు చాలించారు. అదేం కాకతాళీయమో.. ఆయన తన చివరి బ్లాగ్‌లో తాను స్థాపించిన ఐయూసీఏఏ గురించి ప్రస్తావిస్తూ, ‘కర్మయోగి భగవద్గీతలో చెప్పినట్టుగా.. వీడ్కోలు. ఇక్కడితో నా ప్రయాణం సమాప్తమైనట్టుగా భావిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు!
‘శాంతంగానే మాట్లాడండి. అయినా ఓ దుడ్డుకర్రను వెంటే ఉంచుకోండి’ (Speak softly and carry a big stick) అనే అమెరికన్ సామెతను నార్లికర్ అనుసరించారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఎర్నెస్ట్ మాక్ వంటి దిగ్గజాలు ప్రతిపాదించిన సిద్ధాంతాలను ఇరవై ఏళ్ల వయసులోనే తన ‘హోయల్ నార్లికర్ గురుత్వాకర్షణ సిద్ధాంతం’ ద్వారా సవాలు చేసే మేధో ధైర్యాన్ని ప్రదర్శించారు. ప్రఖ్యాత బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతాన్ని సవాలు చేస్తూ ‘స్థిర స్థితి సిద్ధాంతం’ (Steady State Theory) ప్రతిపాదించి సంచలనం సృష్టించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వం ఆది, అంతాలు లేని ఒక నిరంతరాయ ప్రక్రియ. విశ్వం విస్తరిస్తున్న కొద్దీ, కొత్త పదార్థం నిరంతరం ఏర్పడుతుంది. తద్వారా విశ్వం సాంద్రత స్థిరంగా ఉంటుంది. కానీ స్థిర స్థితి సిద్ధాంతం క్రమేణా ప్రాబల్యం కోల్పోయింది. విశ్వ పురోగతికి సంబంధించిన సాక్ష్యాలు, ముఖ్యంగా కాస్మిక్ మైక్రోవేవ్ నేపథ్య వికిరణాన్ని కనుగొనడం బిగ్‌బ్యాంగ్ నమూనాకు బలమైన మద్దతునిచ్చాయి. దీనికి సమాధానంగా 1993లో ఫ్రెడ్ హోయిల్, జియోఫ్రీ బర్బిడ్జ్క్వాతో కలసి క్వాసీ–స్థిర స్థితి సిద్ధాంతాన్ని (QSS) కొన్ని సవరణలతో ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం.. విశ్వంలో అక్కడక్కడా పదార్థం ఎప్పటికప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. ఈ సృష్టిని మినీ–బ్యాంగ్స్ లేదా మినీ–క్రియేషన్ ఈవెంట్స్ అంటారు. మాక్ సూత్రం, క్వాంటం విశ్వోద్భవ శాస్త్రం, క్వాసార్‌లు, బ్లాక్ హోల్స్‌కు సంబంధించిన అంశాలపై కూడా నార్లికర్ పరిశోధనలు చేశారు. ఇస్రో శాస్ర్తవేత్తతో కలిసి అనేక అంతరిక్ష పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల ఫలితంగా సేకరించిన నమూనాల్లో ప్రత్యక్ష కణాలు, బ్యాక్టీరియాను, గ్రహాంతరాలకు చెందిన సూక్ష్మజీవులను కనుగొన్నారు. దీంతో గ్రహాంతరాల్లో జీవం ఉందనే వాదనకు ఈ ప్రయోగం బలం చేకూర్చింది. ఈ ప్రయోగంలో నార్లికర్ కనుగొన్న సూక్ష్మజీవుల్లో ఒక జాతికి తన గురువైన ఫ్రెడ్ హోయల్, ఇంకో జాతికి ఇస్రో, మరో జాతికి ఆర్యభట్ట పేర్లను పెట్టటం విశేషం.
సైన్స్‌ను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లడానికి నార్లికర్ విశేష కృషి చేశారు. బొమ్మలు, ఇతర బోధనా సాధనాల ద్వారా తన ఐయూసీఏఏ విద్యార్థుల సాయంతో సైన్స్‌ను ప్రతినెలా పాఠశాల విద్యార్థులకు బోధించారు. ఇది దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగింది. కష్టమైన సైన్స్ సిద్ధాంతాలను సులభమైన భాషలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమిళం, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో పుస్తకాలు, కథలు, నవలలు, వ్యాసాలు రాశారు. టీవీ, రేడియో, బుక్స్, బ్లాగుల ద్వారా విస్తృతంగా విజ్ఞానాన్ని పంచారు. తన మాతృభాష మరాఠీలో ఆయన రాసిన సైన్స్ ఫిక్షన్ కథ అనంతర కాలంలో ‘ధూమకేతు’ సినిమాగా రూపొందింది. నార్లికర్ ఆత్మకథ ‘చార్ నగరాంతలే మాజే విశ్వ’ (మై టేల్ ఆఫ్ ఫోర్ సిటీస్)కు జాతీయ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఖగోళ శాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషికి గాను 1965లో పద్మభూషణ్, 2004లో పద్మ విభూషణ్, ఫ్రెంచ్ ఖగోళ సంఘం అందజేసే ‘ప్రిక్స్ జూల్స్ జంస్సేన్’ అవార్డు, 2011లో మహారాష్ట్ర భూషణ్ పురస్కార్ లభించాయి.
‘అన్నీ మన వేదాల్లో ఉన్నాయ్’ అనే వాదనలను ఆయన తిరస్కరించారు. ‘విజ్ఞాన సంబంధమైన విషయాలన్నీ బలమైన ప్రమాణాలు, తర్కం మీదే ఆధారపడి ఉంటాయి తప్ప ఊహలు, ఊసుపోని కబుర్ల మీద కాద’ని ఆయన ప్రకటించారు. ఛాందసపు సిద్ధాంతాలను ఖండించేవారు. అదే సమయంలో మన పూర్వీకుల విజయాలైన ‘సున్నా ఆవిష్కరణ’ వంటి నిజంగా గుర్తింపు దక్కాల్సిన మన గత శాస్త్రీయ విజయాలకు ప్రోత్సాహం అందించాలని మన శాస్త్రవేత్తలకు నార్లికర్ పిలుపునిచ్చారు. తన పుస్తకం ‘సైంటిఫిక్ ఎడ్జ్’లో మూఢభక్తికి, శాస్త్రీయ విజ్ఞానానికి మధ్య ఉన్న తేడాను విపులంగా వివరించారు. యువ శాస్త్రవేత్తలకు ఆయన ‘పబ్లిష్ ఆర్ పెరిష్’ (ప్రచురించు లేదా నశించు)’ అనే పిలుపునిచ్చారు. ఆయన రచించిన ‘ది కామెట్’, ‘ది అడ్వెంచర్’ అధ్యాయాలను NCERT 8, 9 తరగతుల సైన్స్ పుస్తకాల్లో చేర్చారు. అత్యంత సాధారణ జీవితాన్ని ఇష్టపడి, ఆచరించిన నార్లికర్ తన 87వ ఏట పూణెలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మూఢత్వాన్ని వదిలి తర్కం, హేతువు ఆధారంగా మనమంతా వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలి. అదే నార్లికర్‌కు మనం ఇచ్చే అసలైన నివాళి.
-డి. శాంతిప్రియ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆస్ట్రానమి, ఓయూ)
నెక్కంటి ఆంత్రివేది (సామాజిక శాస్త్రవేత్త)