Share News

Regional Identity: ప్రాంతీయ అస్తిత్వం భ్రమలూ, వాస్తవాలూ

ABN , Publish Date - Jul 29 , 2025 | 03:06 AM

ప్రాంతేతరుల విగ్రహాల ఏర్పాటు తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకం అని ఈ మధ్య ఒక వార్త చదివాను.

Regional Identity: ప్రాంతీయ అస్తిత్వం భ్రమలూ, వాస్తవాలూ

ప్రాంతేతరుల విగ్రహాల ఏర్పాటు తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకం’ అని ఈ మధ్య ఒక వార్త చదివాను. ఈ వార్త, ‘తెలంగాణ పరిరక్షణ వేదిక’ వారికి సంబంధించినది. ‘‘టాంక్ బండ్‌పై ఉన్న ఆంధ్ర ప్రాంత వైతాళికుల విగ్రహాలను గౌరవంగా ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని తీర్మానించారు. వాటి స్థానంలో తెలంగాణ స్ఫూర్తిప్రదాతల విగ్రహాలు నెలకొల్పాలని డిమాండ్ చేశారు’’ అని కూడా, ఆ వార్తలో ఉంది. ‘‘ఇంకెన్నాళ్ళు ఆంధ్రోళ్ళకు జాగా? మాకెందుకు మీ విగ్రహాలు?’’ అంటూ కూడా, ఆ సమావేశం జరిగినట్టు ఆ వార్తలో ఉంది. ఆ వార్త, ప్రాంతీయ అస్తిత్వం గురించీ, దానికి ఒక గుర్తుగా భావించే విగ్రహాల గురించీ, మరోసారి ఆలోచించేలా చేస్తుంది.


ప్రాంతీయ అస్తిత్వ స్పృహ కలిగించే ఒక భ్రమ ఏమిటంటే, ఒక ప్రాంతం అంతా, ఒకే రాయినించీ చెక్కిన శిల్పం అని! ఆ భ్రమలో పడినప్పుడు, ఆ ప్రాంతంలోనే ఉన్న అసమానతలూ, వైరుధ్యాలూ కనపడవు. అవి ఏవంటే: ప్రతీ ప్రాంతంలోనూ (ప్రస్తుత విగ్రహ తరలింపు ఉద్యమకారులు ప్రస్తావిస్తున్న ‘ఆంధ్రోళ్ళు’న్న ఆంధ్రప్రదేశ్‌తో సహా, అన్ని ప్రాంతాలలోనూ), ఏ శ్రమలూ చెయ్యని ఆస్తిపర వర్గాలూ– ప్రధానంగా శ్రమల మీదే జీవించే శ్రామిక వర్గాలూ ఉంటాయి. అంటే, ఒక ప్రాంతంలో జనాభా, భూములూ, పరిశ్రమలూ, గనులూ, రవాణా వంటి అనేక రకాల ఉత్పత్తి సాధనాలను ఆస్తిగా కలిగిన వారిగానూ; అవేవీ లేనివారిగానూ, ఉన్నా అతి తక్కువ స్థాయిలో కలిగివున్న వారిగానూ, విడిపోయి ఉంటారు. ‘ఉన్నత స్థాయి’ మేధా శ్రమలు చేసేవారూ, ‘అట్టడుగు స్థాయి’ శారీరక శ్రమలు చేసేవారూ ఉంటారు. ప్రతీ ప్రాంతంలోనూ, అనేక కులాలు, వాటి మధ్య ఎన్నో అసమానతలుండడమూ చూడవచ్చు. ఒకే ప్రాంతంలో, మళ్ళీ కొన్ని ప్రాంతాలు ‘అభివృద్ధి’ చెందినవనీ, ‘వెనకబడినవి’ అనీ కొన్ని తేడాలు కనిపిస్తాయి. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో, స్త్రీ–పురుష అసమానత్వమూ ఉంటుంది. స్థానికంగా ఉన్న ఇన్ని రకాల అసమానత్వాల్నీ, వైరుధ్యాల్నీ, ప్రాంతీయ అస్తిత్వ స్పృహ అనే మాయతెర కప్పివేస్తుంది. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం జరిగిన కాలంలో, కొంత బలహీనంగానైనా, కొన్ని అసమానతల గురించీ, అణచివేతల గురించీ స్పృహ ఉండేది. అందుకే అప్పట్లో ‘సామాజిక తెలంగాణ’ కావాలనీ, ‘ప్రజాస్వామిక తెలంగాణ’ రావాలనీ, నినాదాలు కొన్ని వినవచ్చాయి. అలా అన్న ఉద్యమకారుల్లో కొందరు మేధావులు, ఆకర్షణీయమైన ‘నియామకాలు’ పొంది, పదేళ్ళ పాటు అప్పటి కొత్త పాలకుల ఒడిలో, బరువెక్కిన ‘పర్సు’లతో, సేద తీరారు. మరికొందరు ఇప్పటి పాలకుల ఒడిలో సేద తీరుతున్నారు. ఇప్పుడు ఈ కొత్త వార్త ప్రకారం, ఆ నినాదాలు తెరమరుగై, స్థానిక విగ్రహారాధనా నినాదం మొదలైంది. ‘గౌరవంగా’నే అయినా, స్థానికేతరుల విగ్రహాలను తరలించాలన్నప్పుడు, ‘ఆంధ్రోళ్ళు’ మాత్రమే స్థానికేతరులా అనే ప్రశ్న వస్తుంది. తెలంగాణలో పుట్టిపెరిగిన వారు కానివారందరూ, స్థానికేతరులే అవుతారు గదా? అలాంటప్పుడు, అంబేద్కర్ విగ్రహాన్ని మధ్యప్రదేశ్‌లోని మహోవ పట్టణానికీ, ఫూలే విగ్రహాన్ని మహారాష్ట్రలోని పూణే నగరానికీ, జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని బిహారులోని చాంద్వా గ్రామానికీ, గాంధీ విగ్రహాన్ని గుజరాత్‌లోని పోరుబందరుకీ, ఇలా ‘గౌరవంగా’నే తరలించాల్సిందే గదా?


2009లో టాంక్ బండ్ ఘటన తర్వాత, ఈ వార్త వల్ల, మరోసారి తేలింది ఏమంటే: విగ్రహాలకు ప్రాంతీయ భేదాలుంటాయి అని! అంతేకాదు, వాటికి కులపరమైనా, రాజకీయపరమైనా భేదాలూ, శతృత్వాలూ ఉంటాయి! ఈ విషయం, విగ్రహారాధకులకు తెలియనిది కాదు. దేశంలో కొన్ని చోట్ల, అంబేద్కర్ విగ్రహాల్నీ, పెరియార్ విగ్రహాల్నీ వికృత పరిచినప్పుడూ, విరగ్గొట్టినప్పుడూ; త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చివేసినప్పుడూ, ఆ శతృత్వాల గురించి వినలేదా, చూడలేదా? యాబై ఏళ్ళనాడు, కలకత్తాలో, గత కాలపు సంఘసంస్కర్తల విగ్రహాలను, నక్సల్బరీ ఉద్యమకారులు విరగ్గొట్టలేదా? స్థానిక విగ్రహారాధకులు అందరూ, అందరి విగ్రహాలనీ అంగీకరిస్తారని ఏమీ లేదు. వారి రాజకీయ వైఖరిని బట్టో, మత విశ్వాసాల్ని బట్టో, కులాభిమానాన్ని బట్టో, కులమతాల దామాషాలను బట్టో, వాదనలు చేసే అవకాశం ఉంది. స్ఫూర్తిప్రదాతల విగ్రహాలలో ‘ఫలానా మతం వారివి ఇన్నీ, ఫలానా కులం వారివి ఇన్నీ, మళ్ళీ అందులో ఫలానా వారే స్ఫూర్తిప్రదాతలు’– ఇలా ప్రతిపాదనలు చేయడానికి అవకాశం ఉంది. ఒకరు నిజాం విగ్రహం వద్దు, పటేల్ విగ్రహం ఉండాలనొచ్చు! ఇంకొకరు రాజా వెంకట్రామారెడ్డి విగ్రహం వద్దు, భాగ్యరెడ్డి వర్మ విగ్రహం ఉండాలనొచ్చు.


విగ్రహాల తయారీ అనేది, నిస్సందేహంగా ఒక గొప్ప కళే! అయినా, వాటిని బహిరంగ ప్రదేశాలలో పెట్టడం వల్ల, విగ్రహాల రూపంలో ఉన్న ఆ వ్యక్తులకి అవమానమే! దుమ్మూ, ధూళితో; పిట్టల రెట్టలతో కొన్నాళ్ళు – జయంతులో, వర్ధంతులో వచ్చేవరకూ – అలా అశుభ్రంగా పడివుండడం ఒక అవమానం. ఆ విగ్రహాల అసలు మనుషుల భావజాలాన్ని వ్యతిరేకించేవారి దాడులు, ఇంకో రకం అవమానం! వర్గాలుగా, వర్గ విభాగాలుగా; వందల కులాలుగా, వేల ఉపకులాలుగా, చీలిపోయివున్న సమాజంలో, విగ్రహాలు– అవి స్థానికులవైనా, జాతీయస్థాయి వారివైనా, అంతర్జాతీయస్థాయి వారివైనా– దాడులకూ, అగౌరవాలకూ గురికావలిసిందే! అందుకే, ఆ విగ్రహాలను, వాటి ఆరాధకులు, స్వంత మ్యూజియంలలోనో, ఇళ్ళల్లోనో, తమ సంస్థల ఆవరణల్లోనో పెట్టుకుని ‘పరిరక్షించు’కోవాలి. అంతేగానీ, బహిరంగ ప్రదేశాలలో పెట్టడం సరికాదు!


అసలు, ‘వైతాళికులు’, ‘మహానాయకులు’, ‘త్యాగధనులు’, ‘సంస్కర్తలు’, ‘విప్లవకారులు’, ‘మహా కవులు’– అనే పేర్లతో, కోట్లాది మానవుల్లో కొందరిని విడదీసి, వారి విగ్రహాలు తయారు చేయించడం సమానత్వ సూత్రానికి విరుద్ధం. ఆ ‘గొప్ప, గొప్ప’ వారందరూ, అలా గొప్ప స్థాయికి రావడానికి, అనేక అనుకూల పరిస్థితులుండడమే కారణం. వాళ్ళు పుట్టుకతోనే మహాత్ములు కాదు. వాళ్ళు, తమకు చేతనైనదీ, చేయగలిగినదీ చేశారు. వాళ్ళనెవరూ బలవంతం చెయ్యలేదు. వాళ్ళేమీ, తమని విగ్రహాలుగా మలచమనీ, ఆరాధించమనీ కోరలేదు. పైగా, వాళ్ళల్లో కొందరి రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక భావాలు, అసమానతలకూ, అణచివేతలకూ అనుకూలమైనవిగానూ, కొందరివి వ్యతిరేకమైనవిగానూ ఉంటాయి.


ప్రాంతీయ అస్తిత్వం మత్తులో, అందరినీ నెత్తిన పెట్టుకోవాలా? శిల్పకళాకారులు, భుక్తి కోసం కాక, కళా దృష్టితో, తమ కళాభినివేశాన్ని వ్యక్తపరచుకోవడానికి, శిల్పాలని చెక్కడం, విగ్రహాలను తయారు చేయడం, సహజంగా జరగవలిసిన కార్యం. అలాకాక, ప్రభుత్వాల కోసమో, ఉద్యమ సంస్థల కోసమో, కొంత ‘కిరాయి’కి జరగవలిసిన కార్యం కాదు. ‘రైతుల ఆత్మహత్యలతో, కులోన్మాద హత్యలతో, క్రూరమైన కార్మిక వ్యతిరేక చట్టాలతో, పౌరహక్కుల్ని కాలరాసే నిర్బంధ చట్టాలతో, నిరుద్యోగ సమస్యతో, అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు చెయ్యాలో, అసమానతలకు గురి అవుతున్న వారిని ఎలా సంఘటితపరచాలో, ఆలోచించడం మాని జరిపే ఈ స్థానిక విగ్రహారాధనా ఉద్యమం, మైకు ముందు మేధోకాలక్షేపానికి తప్ప దేనికి పనికివస్తుంది? ‘‘ఔర్ భీ దుఖ్ హై జమానే మె మొహొబ్బత్ కే సివా’’ (‘‘ప్రపంచంలో, ప్రేమని మించిన దుఃఖం ఉంది!’’) అన్నాడు ఫైజ్ అహమద్ ఫైజ్ అనే కవి. ‘ప్రేమ’ అన్న చోట, ‘స్థానిక విగ్రహాల మీద ప్రేమ’ అనే మాటని పెట్టుకోవాలి ఇప్పుడు!

-బి.ఆర్. బాపూజీ

Updated Date - Jul 29 , 2025 | 03:06 AM