ముస్లిం సంక్షేమానికే వక్ఫ్ సవరణలు
ABN , Publish Date - Apr 09 , 2025 | 05:12 AM
ఇస్లాంలోని మతపరమైన, దాతృత్వ కార్యక్రమాల కోసం వక్ఫ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగిస్తారు. వక్ఫ్ దానం చేసిన వారిని వాకీఫ్ (దానకర్తలు) అని, ఈ సంపదను పర్యవేక్షించడానికి నియమించబడిన వ్యక్తిని ముతావల్లీ అని అంటారు...

ఇస్లాంలోని మతపరమైన, దాతృత్వ కార్యక్రమాల కోసం వక్ఫ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగిస్తారు. వక్ఫ్ దానం చేసిన వారిని వాకీఫ్ (దానకర్తలు) అని, ఈ సంపదను పర్యవేక్షించడానికి నియమించబడిన వ్యక్తిని ముతావల్లీ అని అంటారు. వక్ఫ్ బ్రిటిష్ కాలం నుండి అనేక రూపాంతరాలు చెందింది. ముసల్మాన్ వక్ఫ్ వాలిడేటింగ్ యాక్ట్– 1913; ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్–1923; వక్ఫ్ ఆక్ట్–1954... వీటికి సవరణలు 1959, 1964, 1969, 1984 సంవత్సరాల్లో చేశారు. వక్ఫ్–1954 యాక్టును మార్చి 1995లో కొత్త యాక్ట్ చేశారు. అలానే 2013లో సవరణలు ద్వారా వక్ఫ్‌కు భారతదేశంలోని ఏ సంస్థకూ లేని అధికారం ఇచ్చి అవినీతికి రాచమార్గం వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ప్రపంచంలో వక్ఫ్‌కు అత్యంత ఎక్కువ ఆస్తులు ఉన్నది భారతదేశంలోనే. 2024 నాటికి మొత్తం వక్ఫ్ ఆస్తులు 9.4 లక్షల ఎకరాలు. వాటి విలువ దాదాపు రూ.1.2 లక్షల కోట్లు. అందులో 5,32,819 ఎకరాలకు లెక్కలు లేవు, లేదా కబ్జాలో ఉన్నవి. ఇక సచార్ కమిటీ రిపోర్ట్ ప్రకారం వక్ఫ్ ఆస్తుల నుంచి ఏడాదికి కనీసం రూ.12,000కోట్ల ఆదాయం రావాలి. కానీ 2019లో రూ.163 కోట్లు వస్తే, 2024 మొత్తం దేశంలో కేవలం రూ.1.6 కోట్ల ఆదాయం వచ్చింది! భారతదేశంలో రక్షణ రంగం, రైల్వేల తర్వాత అత్యధిక ఆస్తులు ఇస్లాం మతపరమైన వక్ఫ్ సంపదే! పేద ముస్లింలకు ఒక వరం కావలిసిన వక్ఫ్ శాపంగా మారింది.
వక్ఫ్ బోర్డులో కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. 1. అక్కడ అధికారం కొండంత, జవాబుదారీతనం శూన్యం. 2. కబ్జాలు, కోర్ట్ కేసులు, బంధువులకు అప్పగింత వంటివి విచ్చలవిడిగా జరుగుతున్నాయి. 3. కోట్ల ఆస్తులు, పైసల్లో లీజు లేదా రెంటు! ఏకంగా 30 ఏండ్లకు లీజులు; 4. వక్ఫ్ బోర్డు సభ్యులలో అందరూ ఒక సిండికేటే. మొత్తం ఆస్తులు ముస్లింలోని లీడర్లు, నవాబులు, ఉన్నత వర్గాల హస్తగతం అయ్యింది. అత్యధిక ఆస్తులు వారి హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, కమర్షియల్ బిల్డింగ్స్, అపార్టుమెంట్స్... ఇలా దుర్వినియోగం అవుతున్నది; 5. 2013లో కాంగ్రెస్ పార్టీ గద్దె దిగేటప్పుడు సెక్షన్ 40 తెచ్చింది. ఇది ఒక రాజ్యాంగ ఉల్లంఘన. సెక్షన్ 40 ప్రకారం ఎలాంటి ప్రామాణికత లేకుండా ముతావల్లీ ఎక్కడైనా సరే భూమిని వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించే అవకాశం కల్పించారు. భారతదేశంలోని ఏ కోర్టుకూ వక్ఫ్ ట్రిబ్యునల్ లేదా ముతావల్లీ చర్యలను సమీక్షించే అవకాశం లేకుండా చేసారు. ౬. వక్ఫ్ బోర్డులో ముస్లిం వెనుకపడిన వర్గాలకు, స్త్రీలకు రిజర్వేషన్ లేనందున కేవలం ముస్లింలోని ఉన్నత వర్గాలకే లబ్ధి చేకూరుతున్నది. 7. వక్ఫ్‌పై దేశంలో 40 వేల కేసులు ఉంటే అందులో 10 వేలు ముస్లింలు వక్ఫ్‌పై వేసిన కేసులే!
ముఖ్యంగా సెక్షన్ 40 సృష్టిస్తున్న అరాచకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. భారత దేశం మొత్తంలో కోర్టుల పర్యవేక్షణకు అవకాశం లేని ఏకైక చట్టం అది. కొన్ని ఉదంతాలను గమనిస్తే– తమిళనాడులోని ఒక గ్రామం (తిరుచునాతీరు) మొత్తం వక్ఫ్ ఆస్తి అని ప్రకటించారు. సూరత్‌లోని మునిసిపల్ కార్పొరేషన్ బిల్డింగ్, ఆవరణ మొత్తం మాదేనని వక్ఫ్ ప్రకటించింది. సూరత్‌లోని శివశక్తి సొసైటీలో రెండు ప్లాట్లు వక్ఫ్ అని ప్రకటించి అక్కడ మసీదు నిర్మాణం చేసారు. తిరుచెండూరు దేవాలయం 600 ఎకరాలు, బెంగళూరులో 600 ఎకరాలు, విజయపురి జిల్లా కర్ణాటకలో 1500 ఎకరాలు, కర్ణాటక దత్తపీట్ మందిర్, కర్నటక పాళీపుర టెంపుల్ 600 ఎకరాలు... ఇలా సెక్షన్ 40ను అడ్డం పెట్టుకొని వివిధ రాష్ట్రాలలో 36 లక్షల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించారు!
తెలంగాణ విషయానికి వస్తే– ఈ రాష్ట్రంలో మొత్తం వక్ఫ్ ఆస్తులు 77,538 ఎకరాలు. అందులో 75శాతం కబ్జా, 3500 కేసులు. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.4లక్షల కోట్లు ఉన్న ఈ ఆస్తుల వల్ల వచ్చే ఆదాయం సున్నా. ఉదారణకు చార్మినార్ దగ్గర మదీనా కాంప్లెక్స్ అనే కమర్సియల్ కాంప్లెక్స్ వక్ఫ్ ఆస్తి. ఇక్కడ కోట్ల ఆదాయం వస్తున్నా వక్ఫ్ సంస్థకు ఇచ్చే రెంట్ ఏడాదికి రూ.10వేలు కూడా లేదు. తెలంగాణలో కబ్జా అయిన భూముల్లో అత్యధికంగా బడా నేతల, బడా వ్యాపారుల ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ విద్యా సంస్థలు, ఫంక్షన్ హాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, కంపెనీలు ఉండటం విశేషం. కొన్ని నామమాత్రం లీజు, అత్యధికంగా కబ్జా.
2005 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల ఆర్థిక, సామాజిక, విద్యాపరమైన ఎదుగుదల కోసం జస్టిస్ సచార్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. 1. ముతావల్లీ పనితీరు పారదర్శకంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి, 2. రికార్డులు మొత్తం పారదర్శకంగా ఉండాలి, 3. వక్ఫ్ బోర్డులో ఏ మతంవారైనా టెక్నికల్ నిపుణులను నియమించాలి, 4. బోర్డులో మహిళలు, వెనకపడ్డ వర్గాలు, ముస్లింలలో ఉన్న ఇతర తెగలకు స్థానం కల్పించాలి 5. జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులకు కౌన్సిల్, బోర్డులలో స్థానం కల్పించాలి. 6. వక్ఫ్ బోర్డును ఫైనాన్సియల్ అడిట్ పరిధిలోకి తేవాలి.
యూనిఫైడ్ వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సమర్థత & అభివృద్ధి చట్టం (2025) -ద్వారా ముస్లిం సమాజానికి పలు లాభాలు ఉన్నాయి. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుంది. డిజిటల్ రికార్డింగ్ జరుగుతుంది. వక్ఫ్ ఆస్తుల ఆదాయాన్ని సామాజిక, విద్యా అభివృద్ధికి వాడవచ్చు. ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. చట్టపరమైన రక్షణ లభిస్తుంది. వక్ఫ్ బోర్డుల పనితీరులో సమర్థత, సమన్వయం పెరుగుతాయి. వక్ఫ్ నిర్వహణలో మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుంది.. ముస్లింలలో వెనుకబడ్డ, అల్పసంఖ్యాక వర్గాలు షియా, అఘకాని, బోరా, ఇస్మాయిలి వర్గాలకు ప్రాతినిధ్యం లభిస్తుంది. పేద ముస్లింలకు విద్యా, ఆరోగ్య పరిరక్షణకు వక్ఫ్ ఆదాయం వినియోగం అవుతుంది. వక్ఫ్ బోర్డుల నిర్ణయాలకు వ్యతిరేకంగా ఫిర్యాదుకు అవకాశం ఉంటుంది. ఆడిట్ నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
ఇప్పటి వరకు వక్ఫ్ చట్టం కేవలం నాయకులకు, ధనిక వర్గాలకు, ఆక్రమణదారులకు ఒక అడ్డాగా మారింది. పేదవర్గాలకు చేరవలసిన ఫలాలను ధనిక ముస్లిం వర్గాలు కొల్లగొట్టాయి. అల్లాహ్ ఆస్తులు ముస్లిం వర్గాలలోని పేద వర్గాలకు, మహిళలకు అందించాలన్నదే మోదీ ప్రయత్నం. ఆ దిశగానే వక్ఫ్ చట్ట సవరణలు. ఇందువల్ల హిందూ సమాజానికి కానీ, ఇతర మతస్థులకు కానీ వచ్చే లాభం ఏమీ లేదు.
డాక్టర్ బూర నర్సయ్యగౌడ్
మాజీ ఎంపీ, బోనగిరి