A Journey Through Emotions: సహజీవమే
ABN , Publish Date - Dec 15 , 2025 | 03:29 AM
మాట్లాడుకోకపోవడం అంటూ ఏమీ ఉండదు మదిని దాటే పలుకులకేమీ కొదువలేదు థర్మోకోల్ ముత్యాల్ని......
మాట్లాడుకోకపోవడం అంటూ ఏమీ ఉండదు
మదిని దాటే పలుకులకేమీ కొదువలేదు
థర్మోకోల్ ముత్యాల్ని
గదిన రాశులుగా కొలుస్తూనే ఉంటావు
అనేకసార్లు
నన్నేనాని అడుగుతూ పొరబడుతూ
గొఱ్ఱె తల వేలాడేసుకుని
వెనుదిరుగుతూ ఉంటావు
అది గూగుల్ గుసగుసలేనని
కట్టుకున్నోళ్లతో కన్నోళ్ళతో కాదని
వేరే చెప్పక్కర్లేదనుకుంటా!
ప్రేమాన్విత సమయ సందర్భాలు
సీతాకోకచిలుకలై విహరిస్తాయి
మధ్యన
వెన్నెల–వెలుగు నక్షత్రాల–మెరుపు
రాత్రుల్ని నీలం చేస్తాయి
పైకప్పుకు అతికిన బొమ్మలు అవన్నీ
అని ఆశ్చర్యపోనక్కర్లేదనుకుంటా!
విడుదల దినాల్ని
జైలు గోడల మీద గీస్తున్న బందీలా
కలిసిన జతకూడిన
కరుగు కాలాన్ని లెక్కిస్తూ
బంధాల్లో ఉంటావు
యుద్ధం ముగియదు
దేహాలు రక్తమోడవు అంగాలు తెగిపడవు
ఐనా
తీతువు సంగీతం పరీవ్యాప్తమై ఉంటుంది
నీ ఒంటిన ఇంటిన నిండారుగా
అచట కాగే
పగటి రాత్రుల్ని రాత్రి పగళ్ళని చూసి
విరుద్ధ ప్రకృతికి విస్తుపోతారు
సూర్యచంద్రాదులు
ఎడారి సంద్రాల ఒంటరివని
ఎరుక కలుగ వెచ్చించిన సమయం
ఓ జీవితయానమవడం
హెచ్చించిన పెనువిషాదం
ఇపుడు
పిన్నంశెట్టి కిషన్
& 97002 30310