Reduce Transport Fares: సింగపూర్ వలె రవాణా చార్జీలు తగ్గించాలి
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:59 AM
మన రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా పెంచిన బస్సు చార్జీల కారణంగా, సొంత వాహనంలో ప్రయాణించటం చౌక అని భావించి దూరప్రాంతాలకు సైతం కుటుంబీకులు తమ సొంత కార్లలో, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం ఎక్కువైంది....
మన రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా పెంచిన బస్సు చార్జీల కారణంగా, సొంత వాహనంలో ప్రయాణించటం చౌక అని భావించి దూరప్రాంతాలకు సైతం కుటుంబీకులు తమ సొంత కార్లలో, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం ఎక్కువైంది. అంతేగాక కారుచౌక వాహన రుణాలతో నగరాలూ, పట్టణాల్లో ఇంటికొక కారు, మనిషికొక ద్విచక్ర వాహనం అనే స్థితి వస్తున్నది. ఫలితంగా విపరీతంగా రద్దీ పెరిగి పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలతో పాటు రోడ్డు ప్రమాదాల వంటివి నిత్యకృత్యాలుగా మారాయి.
ఇంతకు ముందు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు కూడా మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించినా, గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే తాజా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఓటింగ్ శాతం తగ్గిపోయింది. అంటే ఆ అనుచిత పథకాల కంటే ప్రజలు సుపరిపాలననే కోరుకున్నారు. మన రాష్ట్రంలో కూడా సుపరిపాలన కోసమే వైసీపీ ప్రభుత్వ బటన్ నొక్కుడు జనాకర్షక పథకాలను పట్టించుకోకుండా, క్రమశిక్షణ గల పార్టీగా భావించి ప్రజలు టీడీపీని గద్దె నెక్కించారు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టింది. ఇందుకు ప్రభుత్వంపై, అంటే మళ్ళీ ప్రజలపై పడే అదనపు భారం సాలుకి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలట. ఈ ఉచిత బస్సు పథకంలో హేతుబద్ధత లేదు. ఎందుకంటే మహిళా ఉద్యోగులు, సంపన్న మహిళలు కూడా ఉచితంగా ప్రయాణిస్తుంటే ఉద్యోగాల కోసం తిరిగే పేద నిరుద్యోగులు, మగ ప్రయాణికులు మాత్రం ఈ అధిక చార్జీల భారం మోయాలి. మున్ముందు బస్సుల రద్దీ, కొరత వంటి సమస్యల వల్ల సిబ్బందికి కూడ ఇబ్బందులు రావచ్చు.
ఇక సింగపూర్, మరికొన్ని యూరప్ దేశాలు ట్రాఫిక్, వాయు కాలుష్యాలు, పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గించటానికి చౌక రవాణా వ్యవస్థను ఏర్పాటు చేశాయి. మనది అధిక జనాభా కలిగిన ఉష్ణ మండల దేశం, కనుక మన రాష్ట్రంలో కూడా గత వైసీపీ ప్రభుత్వం భారీగా పెంచిన బస్సు చార్జీలతో పాటు, మరికొంత చార్జీలు తగ్గిస్తే మహిళలతో పాటు ప్రజానీకం మొత్తానికి ప్రయోజనం కలుగుతుంది, వ్యక్తిగత వాహన ప్రయాణాలు తగ్గి ఇంధన వాడకం, వాయు కాలుష్యాల వంటివి తగ్గుతాయి. తాత్కాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు ముఖ్యం, కాబట్టి ప్రజలు కూడ హర్షిస్తారు. కొందరు మంచి పనులను కూడా విమర్శిస్తూనే ఉంటారు. వారిని పరిగణనలోకి తీసుకోకుండా ఆ పనులు చేసుకుంటూ పోవటమే ప్రభుత్వం బాధ్యత.
– తిరుమలశెట్టి సాంబశివరావు, గుంటూరు