Chaturika Telugu Novel: వందేళ్ల నాటి డిటెక్టివ్ నవల చతురిక
ABN , Publish Date - May 19 , 2025 | 01:05 AM
1917లో కర్నూలులో ప్రచురితమైన ‘చతురిక’ అనే తెలుగు నవల ఇటీవల తిరిగి వెలుగులోకి వచ్చింది, ఇది షెర్లాక్ హోమ్స్‌కు ప్రభావితమైన గూఢచారి కథనంగా నిలుస్తుంది. ఈ నవల రచయిత ఉయ్యాలవాడ రామచంద్రరావు రచనా నైపుణ్యం, అప్పటి సామాజిక పరిస్థితుల ప్రతిబింబంతోపాటు చారిత్రాత్మక, సాహిత్య విలువల్ని ప్రతిబింబిస్తుంది.
1917లో అంటే 108 ఏళ్ల కిందట కర్నూలులో ప్రచురితమైన ఉయ్యాలవాడ రామచంద్రరావు రచన ‘చతురిక’ నవల ఇటీవలే మళ్లీ వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలల క్రితం కర్నూలులో సాహితీ స్రవంతి కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంలో దీన్ని మళ్ళీ విడుదల చేశాం. సుందరయ్య విజ్ఞాన కేంద్రం గ్రంథాలయంలో పుస్తకాల డిజిటల్ కాపీలు ఆన్‌లైన్‌లో తిరగేస్తుండగా ఇది నాకు కనిపించడం అనూహ్యమే. నాకు గతంలో తెలిసిన మేరకు, లేదా- ఇది కనిపించిన తర్వాత పరిశోధించిన మేరకు ఎక్కడా ఈ నవల, రచయిత నమోదు కాలేదు. రాయలసీమ నవలలపై పరిశోధనలతో సహా ఇంతవరకూ ఎక్కడా ఈ నవల గురించి ప్రస్తావన లేదు. కర్నూలు డిప్యూటీ కలెక్టరుగా పనిచేసిన నరహరి గోపాల కృష్ణమ శెట్టి 1872లో వెలువరించిన ‘శ్రీరంగరాజ చరిత్రము’ మొదటి నవల కాగా, 1878లో కందుకూరి వీరేశలింగం ప్రచురించిన ‘రాజశేఖర చరిత్ర’ రెండవ నవల అని సాహిత్య చరిత్ర చర్చలో ఒక దీర్ఘకాలిక అభిప్రాయం. అంతకన్నా ముందే చరిత్రకు సంబంధించిన నవలలు తెలంగాణలో వచ్చాయని మిత్రులు పలు వివరాలు ప్రకటించారు.
తెలుగు నవలా వికాసం గురించి ఇంకా చాలా సమాచారం, ఆధారాలు ఉన్నా ఇక్కడ ఆ వివరాల్లోకి పోలేం. స్థూలంగా తెలుగు సాంఘిక నవల అన్న కోణం మాత్రమే తీసుకుంటున్నాను. ఈ ‘చతురిక’ రచయిత ఉయ్యాలవాడ రామచంద్రరావు ఈ నవల నేరుగా షెర్లాక్ హోమ్స్‌కు అనుసరణ అని రాశారు. అయితే ఈ చిన్న నవల మొత్తంలో అనుకరణ కన్నా దేశీయతనే అధికంగా కనిపిస్తుంది. కథనానికి అనుసరించిన శిల్పం కూడా కృత్రిమత్వానికి చోటివ్వలేదు. భాష పరంగా అర్ధ గ్రాంథికం అనొచ్చు. అప్పటికీ ఇప్పటికీ పదాల వినియోగంలో వచ్చిన మార్పువల్ల కొంత బుర్రకు పనిపెట్టాల్సిన అగత్యమేర్పడుతుంది. అదే సమయంలో బ్రిటిష్ ప్రభావాలు, పదాలను పోకడలను గురించి కూడా కొంత చెప్పడానికి రచయిత ప్రయత్నించారు. భాష కొంత సమస్యగా కనిపించినా కథనం అప్పటి పరిస్థితులను కళ్లకు కడుతుంది. ఒక రాజ వంశీకుడు గతంలో తను సన్నిహితంగా మెలిగిన వేశ్య చతురిక దగ్గర ఉండిపోయిన తమ జంట ఫోటోను ఎలాగైనా తెలియకుండా తెప్పించాలనుకోవడం కీలకమైన కథ. ఈ క్రమంలో గూఢచారి కథనాయకుడిని నియమిస్తాడు. కథను రచయిత ఉత్తమ పురుషలో చెబుతుంటారు. ఈ క్రమంలో కేవలం గూఢచర్యమే గాక పోటాపోటీ గూఢచర్యం (కౌంటర్ ఎస్పినోజ్) కూడా జరగడం చతురికలో అదనపు ఆకర్షణ. అయితే అది కొసమెరుపులా చివరి వరకూ అర్థం కాదు.
బ్రిటిష్ వారి పాలనలో రాజరిక వాతావరణం, ఆనాటి కోర్టులు, పోలీసులు, దావాలు, విందు వినోదాల వంటి ఆధునిక పట్టణ జీవిత లక్షణాలు గోచరిస్తాయి. ఒకరిని గురించి మరొకరు ఎలా ఆలోచించాలి, ఎలా పసిగట్టాలి, తమ ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలి... ఇవన్నీ నవీనకాలానికి ఏమాత్రం తీసిపోని రీతిలో నడుస్తాయి. నవల శీర్షిక చతురిక అన్నట్టే ఆ పాత్ర చాతుర్యంతో పాటు వ్యక్తిత్వం గల మహిళ అనీ తెలుస్తుంది. ఇది చదివాక కొంతవరకూ సాహిత్యజీవులను మధురవాణి గుర్తుకు వస్తే పొరబాటేమీ లేదు. కాకుంటే ఇది చిన్న నవలిక గనక అంత పరిధీ లేదు. పాత కాలపు రచనల్లో కీలక పాత్రధారిణులు వేశ్యలు కావడం యాదృచ్ఛికమేమీ కాదు. ఆనాటికి ఆ మాత్రం తెగువకు, చొరవకు అవకాశముండేది వారికేనని చెప్పాలి. 1917లో కర్నూలు లోని ‘చంద్రమౌళీశ్వర ముద్రాక్షరశాల’ అధినేత ఎస్.వి. రాఘవయ్య ఈ పుస్తక ప్రచురణకు ప్రేరణగా నిలవడమే గాక సంపాదకుడు గానూ వ్యవహరించారు. (ఆ ‘చంద్రమౌళీశ్వర ముద్రాక్షరశాల’ యాజమాన్యం మారినా సీఎం ప్రెస్ పేరుతో ఇంకా నడుస్తున్నది.) ఈ ప్రచురణకర్త రాఘవయ్య ఆ కాలంలో లలితా గ్రంథమాల పేరిట ఒక నవలల సీరిసే ప్రకటించారు. ఆ కాలానికే చందాదారులను చేర్చుకుని చౌకగా ఆఫర్లు కూడా ప్రకటించడం చూస్తాం. ‘చతురిక’ చదివిన తర్వాత రచయిత ఉయ్యాలవాడ రామచంద్రరావు కథనంలో మంచి నేర్పు కలవారనిపిస్తుంది. హాస్య వ్యంగ్యాలతో పాటు ఈ తరహా కథలకు ప్రాణమైన సస్పెన్స్‌ను కూడా జాగ్రత్తగా పాటించారు. అంతేగాక తన తర్వాతి వారిలా ‘‘పాఠక మహాశయా రమ్ము, ఆ ముసుగు మనిషని వెంబడింతము’’ వంటి కృతక ప్రయోగాలేమీ చేయకుండా సహజంగానే కథ చెప్పుకొచ్చారు. డిటెక్టివ్ కథల్లో మామూలుగా ఒక దుష్టపాత్రను పట్టుకోవడం తప్పనిసరి కాగా ఈ కథలో అలాటి పని జరగదు. మానవ స్వభావాల్లో మాయోపాయాలు, స్వప్రయోజనాల కోసం పెనుగులాటలు మాత్రమే చూపించారు. పెద్ద సామాజిక సందేశాల జోలికి అసలే పోలేదు. సందేశాత్మకం కాకున్నా చారిత్రాత్మకం గనుక సాహిత్య అధ్యయనాలకు దోహదం కాగలదని దీన్ని మళ్లీ ముద్రించాం.
-తెలకపల్లి రవి