Kakinada literature: ముఖచిత్రంపై ఇప్పటికీ అసంతృప్తి
ABN , Publish Date - Jul 21 , 2025 | 02:26 AM
1983 కాకినాడ రంగరాయ కాలేజీలో నేను మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్న రోజులవి.
1983 కాకినాడ ‘రంగరాయ’ కాలేజీలో నేను మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్న రోజులవి. అప్పుడు నేను తొమ్మిది, పది, ఇంటర్ తరగతులు చదివే కాలంలో రాసిన కవితల్ని కంపైల్ చేసి ప్రచురించిన నా మొదటి కవితా సంపుటి ‘అంతర్నేత్రం’. ఈ పుస్తకం ప్రింటింగ్ ప్రెస్‌కి వెళ్ళే క్రమంలో నేను ఇంటర్ చదువుకున్న సర్వోదయా కళాశాలలో మాకు తెలుగు, బోటనీ చెప్పిన అధ్యాపకులు, సాహిత్యం పట్ల విశేషమైన ఆసక్తి కలిగిన కాళిదాసు పురుషోత్తం గారు, సత్యా గారు ముక్తకంఠంతో, ‘‘తొందరపడి పుస్తకాన్ని అప్పుడే అచ్చు వేయకు. తేడా కొడితే విమర్శకులు చీల్చి చెండా డుతారు’’ అని హెచ్చరించారు. నా కవిత్వం మీద నాకు గట్టి నమ్మకంతో మా లెక్చరర్ల మాటల్ని లెక్కచేయక మొండిగా అడుగు ముందుకు వేశాను. ఆ మొండి ధైర్యం తోనే అప్పట్లో సమకాలీన తెలుగు కవిత్వానికి దీపధారిగా నిల్చిన కవి ఇస్మాయిల్‌ని కాకినాడ లచ్చిరాజు వీధి లోని వారి ఇంట్లో కలిశాను. పరిచయాలూ, ఉపోద్ఘాతాలూ ఏమీ లేకుండా నా కవిత్వపు కాగితాల బొత్తిని ఇస్మాయిల్ గారి చేతుల్లో పెట్టి, ‘‘పుస్తకం వేస్తున్నాను. మీరు ముందుమాట రాయాలి,’’ అన్నాను. నా మాటలకి ఆయన విస్తుపోయి నా వంక ఎగాదిగా చూసి నిష్కర్షగా, ‘‘ముక్కూమొహం తెలియనివాళ్ళకి నేను పీఠికలూ, పరిచయాలూ రాయను’’ అన్నారు. ‘‘మీకు కుదిరినప్పుడే చదివి, నచ్చితేనే రాయండి’’ అని వచ్చేశాను. మొదట రాయనన్న ఇస్మాయిల్ గారే వారంలోపే అద్భుతమైన పరిచయం రాశారు. నా కవిత్వాన్ని జెన్, హైకూ జపనీయ పద్యాలతో పోల్చుతూ, ‘‘రవూఫ్‌వి తెరుచుకున్న పద్యాలు! పద్యం పరిధిని మించి విస్తృతార్థాన్ని ఇస్తాయి. సార్వజనీన, సార్వత్రిక సత్యాల్ని ఆవిష్కరిస్తాయి,’’ అని రాశారు. ఒక యువకవి కవిత్వ పుస్తకానికి ఇస్మాయిల్ ముందుమాట రాయటం నాతోనే మొదలు. నాకు అది ఒక విశిష్ట అనుభవం! అంతర్నేత్రం పుస్తక ప్రచురణ అప్పుడే ప్రింటింగ్ రంగంలోకి దిగిన నరసరావుపేటలోని వాసవి ప్రింటర్స్‌లో జరిగింది. నన్ను అమితంగా ప్రేమించే మా మేనమామ సుభాని ప్రచురణ బాధ్యతని తలకెత్తుకున్నారు. కవర్ పేజీపై ముఖచిత్రం, టైటిల్ అక్షరాలు మా పెదనాన్న జైనుల్ ఆబెదిన్ గారివి.
కవర్ పేజ్ అనుకున్నట్టు రాలేదు. అదే అసలు లోపం. ఆ అసంతృప్తి నాలో ఇప్పటికీ ఉంది. ఈ పుస్తకాన్ని అమ్మా నాన్న (సమీవున్నీసా, నూర్ అహమద్) లకి అంకితం ఇచ్చాను. పుస్తకం ప్రెస్ లోంచి బైటికి వచ్చినప్పుడు నాకు కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఏనుగెక్కినంత సంబరం! ‘అంతర్నేత్రం’ పుస్తకావిష్కరణ కాకినాడలోనే జరిగింది. అక్కడి ప్రభుత్వ గ్రంథాలయంలో ఆర్. ఎస్. సుదర్శనం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, ‘ప్రామిసింగ్ పొయెట్’ అన్నారు. అదే సభలో 1980 లో ‘కొత్త కలాలు’ శీర్షికన నన్ను పరిచయం చేసిన ఆంధ్రజ్యోతి వీక్లీ ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ‘రవూఫ్‌ని డిస్కవర్ చేసింది నేనే’ అన్నారు. సభలో ఇస్మాయిల్, స్మైల్, గోదావరి శర్మ, జానకీ జాని గార్లు పాల్గొనటం నా సుకృతం! నా మొదటి కవితా సంపుటి ‘అంతర్నేత్రం’ నాకు తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. రాత్రికి రాత్రే కాలేజ్ క్యాంపస్ లోనూ, బైట కూడా సెలబ్రిటీని అయిపోయాను. ఆనాటి నించి నా పేరు ‘అంతర్నేత్రం రవూఫ్’గా స్థిరపడిపోయింది. అదే సంవత్సరం జరిగిన రంగరాయ వైద్య కళాశాల రజతోత్సవాలకి విచ్చేసిన, అప్పటికే రచయితగా ప్రసిద్ధులైన, డాక్టర్ పరుచూరి రాజారామ్ నా ‘అంతర్నేత్రం’ పుస్తకాన్ని పట్టుకొని ‘‘ఇక్కడ రవూఫ్ అంటే ఎవరు?’’ అంటూ మా మెన్స్ హాస్టల్‌కి నన్ను వెతుక్కొంటూ రావటం నాకు దక్కిన గొప్ప గౌరవం!
-ఎస్. ఎ. రవూఫ్