Rahul Gandhi Alleges Voter Fraud: ఏది నిజం
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:24 AM
తాను చెబుతున్నది నిజమని రాహుల్‌గాంధీ నమ్ముతున్నపక్షంలో అఫిడవిట్‌మీద సంతకంతో లిఖితపూర్వక ఫిర్యాదు చేయాలని
తాను చెబుతున్నది నిజమని రాహుల్‌గాంధీ నమ్ముతున్నపక్షంలో అఫిడవిట్‌మీద సంతకంతో లిఖితపూర్వక ఫిర్యాదు చేయాలని, లేదంటే దేశప్రజలను తప్పుదోవపట్టించినందుకు క్షమాపణలు కోరాలని భారత ఎన్నికల సంఘం హెచ్చరిస్తోంది. బెంగుళూరులో గురువారం సుదీర్ఘమీడియా సమావేశంలో రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలు తీవ్రమైనవి. దాదాపు గంటన్నర విడియో ప్రెజెంటేషన్‌లో ఈసీ–బీజేపీ కలసి ఓట్ల చౌర్యానికి పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. ఓటర్ల డిజిటల్ డేటానూ, సీసీటీవీ ఫుటేజ్‌లనూ కాంగ్రెస్‌కు ఇవ్వడానికి ఎన్నికల సంఘం ఎంతోకాలంగా నిరాకరిస్తున్న నేపథ్యంలో, బెంగుళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానంలోని మహదేవ్‌పురాను ఈమారు ఆయుధంగా ప్రయోగించారు రాహుల్. ఈ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే లక్షకు పైగా ఓట్ల గోల్‌మాల్ జరిగిందని విశ్లేషించడం ద్వారా కాంగ్రెస్ వెనుకంజకూ, నరేంద్రమోదీ విజయాలకూ ఈ ఓట్ల చౌర్యమే దేశవ్యాప్తంగా పనిచేసిందని ఆయన నిర్థారించారు. మెషీన్ రీడబుల్ డేటాను ఈసీ ఇవ్వనందున, ఒక్క మహదేవ్‌పుర మాయను వెలుగులోకి తేవడానికే తమకు ఆరునెలలు పట్టిందంటున్నారు ఆయన. ఈ సమావేశంలో తెరమీద ప్రదర్శించిన సమాచారం, దానిపై రాహుల్ చేసిన విశ్లేషణ చూసినవారికి ఆ ఓట్లచౌర్యం ఆరోపణలో అసత్యమేమీలేదన్న భావన కలగడం సహజం. దేశప్రజలంతా రాహుల్ వాదనను నమ్మి నిజమనుకొనే ప్రమాదం ఉన్నందున, ప్రమాణపత్రంతో ఫిర్యాదుచేస్తేనే పరిశీలిస్తానని ఎన్నికల సంఘం చెప్పడం సరికాదు. తాను చెబుతున్నది నిజమని రాహుల్ నమ్ముతున్నారా లేదా అన్నది కాదు, అందులో నిజం ఉన్నదా లేదా నిగ్గుతేలడం దేశప్రయోజనాల రీత్యా ముఖ్యం. రాహుల్ చేసిన విశ్లేషణలోనూ, ఆర్నెల్లపాటు సేకరించిన సమాచారంలోనూ వీసమెత్తు నిజం కానీ, నిజాయితీ కానీ లేదని ఎన్నికల సంఘం నమ్మినపక్షంలో అది కేవలం రాజకీయ కుట్రేనని నిగ్గుతేల్చే కర్తవ్యాన్ని నెత్తినెత్తుకోవాల్సిన కీలకమైన అంశమిది.
నకిలీ ఓటర్లు, తప్పుడు చిరునామాలు, ఒకే చిరునామాలో బల్క్ ఓటర్లు, నకిలీ ఫోటోలు, కొత్త ఓటర్ల నమోదుకు వాడే ఫార్మ్ 6 దుర్వినియోగం వంటి ఐదురకాల విధానాల్లో మహదేవ్‌పురాలో లక్షకుపైగా ఓట్లమోసం జరిగిందని కాంగ్రెస్ అంటోంది. బెంగుళూరు సెంట్రల్ లోక్‌సభస్థానంలోని మిగతా అన్ని అసెంబ్లీ సెగ్మంట్లలో బీజేపీ ఓడినప్పటికీ, ఆరున్నర లక్షల ఓటర్లున్న మహదేవ్‌పురాలో లక్షా పద్నాలుగువేల ఆధిక్యం సంపాదించడంతో, సదరు పార్లమెంటరీ స్థానాన్ని బీజేపీ 33వేల ఓట్ల మెజారిటీతో గెలవగలిగింది. పాతిక లోక్‌సభ స్థానాలు ఎక్కువ వచ్చినందుకు నరేంద్రమోదీ ప్రధాని అయ్యారని, ముప్పై ఐదువేల ఓట్లకంటే తక్కువ తేడాతో బీజేపీ గెలుచుకున్న లోక్‌సభ స్థానాలు పాతికకుపైనే ఉన్నాయనీ, ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్, విడియో రికార్డులను ఇచ్చినపక్షంలో, దేశవ్యాప్తంగా ఎన్ని మహదేవ్‌పురాలున్నాయో రుజువుచేస్తామని రాహుల్ సవాల్ చేస్తున్నారు.
నిందలు వేయడం తప్ప, విధానాలను పాటించడం మీద రాహుల్‌కు శ్రద్ధలేదని ఈసీ ఆరోపిస్తోంది. చర్చకు రమ్మన్నా రావడం లేదని ఎన్నికల సంఘం అంటూంటే, మేం అడిగినదానిని ఇవ్వకుండా మాటలతో ప్రయోజనం ఏమిటని కాంగ్రెస్ అంటోంది. డిజిటల్ ఓటర్ల జాబితా, సీసీ ఫుటేజ్ ధ్వంసం ఇత్యాది అంశాలతో రాహుల్ నిరవధికంగా దాడికొనసాగించేందుకు ఎన్నికల సంఘమే అవకాశం ఇస్తోంది. భారత ప్రజాస్వామ్యం అమూల్యమైనది అంటూ హితోపదేశాలు చేసేందుకూ, ఈసీని బీజేపీ తొత్తుగా ఆరోపించేందుకు వీలుకలుగుతోంది. తన విమర్శకు పునాదిగా రాహుల్ వాడిన సమాచారం ఎక్కడినుంచో తెచ్చింది కాదు. ఈసీ అధికారిక డేటానే ఆయన వాడుకున్నారు. లక్షకుపైగా ఓట్లకు సంబంధించిన ఆ డేటా అబద్ధమైన పక్షంలో అదేమాటచెప్పవచ్చు. లేదా పాక్షిక నిజాన్ని పక్షపాతంతో తనకు అనుకూలంగా విశ్లేషించుకున్నారనీ వివరించవచ్చు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికల సంఘాన్ని ఇలా బహిరంగంగా నిందిస్తూ, కుట్రలను ఆపాదిస్తూ, ఎన్నికల ప్రక్రియమీదే ప్రజల్లో అనుమానాలు పెంచుతున్న రాహుల్‌గాంధీ, తన ఆరోపణలమీద ఫిర్యాదుచేస్తేకానీ పరిష్కారాలు ఉండవని ఈసీ అనడం భావ్యంకాదు.