Share News

Rahul Gandhi: ఎన్నికల్లో రిగ్గింగ్‌ చేయడమెలా

ABN , Publish Date - Jun 07 , 2025 | 01:00 AM

పార్లమెంటులో (3 ఫిబ్రవరి 2025న) నా ఉపన్యాసంలోను, అనంతరం విలేఖర్ల సమావేశంలోను గత ఏడాది నవంబర్‌లో మహారాష్ట్ర విధానసభ ఎన్నికలను నిర్వహించిన తీరు తెన్నుల పట్ల ఆందోళన వ్యక్తం చేశాను.

Rahul Gandhi: ఎన్నికల్లో రిగ్గింగ్‌ చేయడమెలా

పార్లమెంటులో (3 ఫిబ్రవరి 2025న) నా ఉపన్యాసంలోను, అనంతరం విలేఖర్ల సమావేశంలోను గత ఏడాది నవంబర్‌లో మహారాష్ట్ర విధానసభ ఎన్నికలను నిర్వహించిన తీరు తెన్నుల పట్ల ఆందోళన వ్యక్తం చేశాను. మన దేశంలో ఎన్నికలు ఎప్పుడు, ఎక్కడ జరిగినా వాటి సక్రమ, నిష్పాక్షిక నిర్వహణను ప్రతిసారీ కానప్పటికీ అనేకసార్లు శంకించాను. చిన్నతరహా మోసం గురించి నేను మాట్లాడడం లేదు; మన జాతీయ సంస్థలను కైవసం చేసుకోవడంతో సహా సంభవిస్తున్న భారీ వంచనపై నా వ్యాకులతను వ్యక్తం చేస్తున్నాను. ఏమిటా వంచన? ఎన్నికల ఫలితాలను కుతంత్రంతో అనుకూలంగా మార్చుకోవడమే ఆ మోసం. అవును, మన ఎన్నికలలో పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ జరుగుతోంది. అంతకు ముందు కొన్ని ఎన్నికల ఫలితాలు విడ్డూరంగా ఉన్నా 2024 మహారాష్ట్ర విధానసభ ఎన్నికల ఫలితాలు అసాధారణంగా ఉన్నాయి. ఆ అనూహ్య ఫలితాలు నన్నూ, మరెందరినో దిగ్భ్రాంతి పరిచాయి. విజయంపై ఆశోపహతులయినవారు తెంపరితనంతో భారీ రిగ్గింగ్‌కు పాల్పడి సాధించిన ఫలితాలవి. ఆ వంచనను కప్పిపుచ్చేందుకు సకల ప్రయత్నాలు చేసినప్పటికీ దాచిన వాస్తవాలు అన్నీ ఎలాంటి అనధికారిక మూలాధారాల ఆలంబనతో పనిలేకుండా అధికారిక గణాంకాల నుంచే బహిర్గతమయ్యాయి. అంచెలంచెలుగా ఆ అక్రమానికి పాల్పడేందుకు అనుసరించిన వ్యూహాలు, పద్ధతులు, ప్రక్రియలూ వెల్లడయ్యాయి. ఆ ఎన్నికల అక్రమం ఎలా మొదలై, ఎలా పరిపూర్తి అయిందో విపులంగా చూద్దాం. ప్రథమ పర్వం– ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించే అధికారులను నియమించే ప్యానెల్‌ను మార్చివేయడం: ఎన్నికల కమిషనర్లను ప్రధానమంత్రి, హోం మంత్రి 2:1 మెజారిటీతో ఫలప్రదంగా ఎంపిక చేయడాన్ని 2023 ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం సుసాధ్యం చేసింది. ఆ నియమకాలపై నిర్ణయం తీసుకునే త్రిసభ్య ప్యానెల్‌లో మూడో సభ్యుడు అయిన ప్రతిపక్ష నాయకుడి సూచన ప్రతిసారీ మెజారిటీ ఓట్లతో తిరస్కృతమవుతుంది.ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే ప్యానెల్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర కేబినెట్‌ మంత్రికి స్థానం కల్పించిన నిర్ణయం న్యాయబద్ధమైనది కాదు. నైతిక సమంజసత్వం లోపించిన నిర్ణయమది.


రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘంలో తటస్థ మధ్యవర్తిని తొలగించేందుకు ఉన్నత పదవులలో ఉన్నవారు సంబంధిత నియామకాల చట్టాన్ని మార్చేందుకు పనిగట్టుకుని ఎందుకు ప్రయత్నించారు? ద్వితీయ పర్వం– నకిలీ ఓటర్లతో ఓటర్ల జాబితాను విస్తరించడం: 2019 విధానసభ ఎన్నికలలో మహారాష్ట్రలో నమోదైన ఓటర్ల సంఖ్య (ఎన్నికల సంఘం డేటా ప్రకారం) 8.98 కోట్లు. ఐదు సంవత్సరాల అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికలకు ఆ ఓటర్ల సంఖ్య 9.29 కోట్లకు పెరిగింది. అయితే కేవలం ఐదు నెలల తరువాత నవంబర్‌ 2024 విధానసభ ఎన్నికల నాటికి ఆ ఓటర్ల సంఖ్య 9.70 కోట్లకు పెరిగింది. ఐదు సంవత్సరాల పాటు అతి నెమ్మదిగా 31 లక్షలు పెరిగిన ఆ ఓటర్ల సంఖ్య కేవలం ఐదు నెలల్లో, అవును ఐదు నెలల్లోనే 41 లక్షలకు ఉరుకులు పరుగులు తీసింది! ఇదొక ఆశ్చర్యకరమైన పెరుగుదల. ఇదెంత అపురూపమైన విషయమంటే నమోదైన మొత్తం ఓటర్లు 9.70 కోట్ల మంది కాగా ప్రభుత్వ సొంత అంచనాల ప్రకారమే మహారాష్ట్రలోని మొత్తం వయోజనులు 9.54 కోట్ల మంది మాత్రమే! తృతీయ పర్వం– జాబితాలో పెరిగిన ఓటర్ల సంఖ్య కంటే పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్ల సంఖ్య ఎక్కువ కావడం: ఓటుహక్కు వినియోగించుకున్నవారికి, పరిశీలకులకు నవంబర్‌ 2024 మహారాష్ట్ర విధానసభ ఎన్నికల పోలింగ్‌ యథాప్రకారం మామూలుగానే కన్పించింది. ఎన్నికలు జరిగిన ప్రతిచోటా ఎప్పుడూ సంభవించినట్టుగానే ఆ దినం మహారాష్ట్రలో ఎల్లెడలా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ కేంద్రాలలోకి ప్రవేశించిన వారిని ఓటు వేసేంతవరకు అక్కడే ఉండిపోవడానికి అనుమతించారు.అయితే, ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద కొండవీడు చాంతాడులా బారులు తీరినట్లు గానీ, పెద్ద సంఖ్యలో గుమిగూడినట్లుగానీ పత్రికలు, ప్రసార సాధనాలు వెల్లడించనేలేదు. అయితే ఎన్నికల సంఘం భోగట్టా ప్రకారం ఓటు వేసేందుకు ఓటర్లు కిలోమీటర్ల పొడవునా బారులు తీరారు. సాయంత్రం 5 గంటల సమయానికి 58.22 శాతం మంది తమ ప్రజాస్వామ్య హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ వ్యవధి ముగిసిపోయినప్పటికీ ఓటు వేసేందుకు మరింత మంది పోలింగ్‌ కేంద్రాలకు వస్తూనే ఉన్నారు.


మొత్తం ఓటర్లలో 66.05 శాతం మంది ఓటు వేశారని ఎన్నికల సంఘం ఆ మరుసటి ఉదయం వెల్లడించింది. పోలింగ్‌ వేళలు ముగిసిన తరువాత కూడా 7.8౩ శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపింది. 7.83 శాతం పెరుగుదల 76 లక్షల ఓటర్లకు సమానం. మహారాష్ట్ర విధాన సభ ఎన్నికలలో అంతకు మునుపు ఎన్నడూ లేని విధంగా నవంబర్‌ 2024లో చాలా మంది నమోదిత ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్‌ గడువు ముగిసే సమయానికి, ఆ తరువాత ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల సంఖ్య మధ్య తేడా 2009లో –0.50 శాతం; 2014లో 1.08 శాతం; 2019లో 0.54 శాతం కాగా 2024లో ఈ తేడా 7.83 శాతంగా ఉన్నది. చతుర్థ పర్వం– బోగస్‌ ఓటింగ్‌తో బీజేపికి సంఖ్యాధిక్యత: ఇంకా అనేక అవకతవకలు ఉన్నాయి. మహారాష్ట్రలో లక్ష పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. అయితే కేవలం 85 నియోజకవర్గాలలోని 12,000 పోలింగ్‌ బూత్‌లలో మాత్రమే అదనంగా పోలింగ్‌ జరిగింది. గత లోక్‌సభ ఎన్నికలలో ఈ 85 నియోజకవర్గాలలోనే భారతీయ జనతా పార్టీ పరిస్థితి సజావుగా లేదు. ఈ మేరకు ఈ 12 వేల పోలింగ్‌ బూత్‌లలో ప్రతి బూత్‌లోను సాయంత్రం 5 గంటల తరువాత సగటున 600మందికి పైగా ఓటర్లు ఓటు వేశారు. ప్రతి ఓటరు ఓటు వేసేందుకు 1 నిమిషం సమయం అవసరమవుతుందనుకుంటే పోలింగ్‌ విధిగా పది గంటల పాటు కొనసాగవలసి ఉంటుంది. ఇలా ఎప్పుడూ జరగలేదు గనక ఈ పరిస్థితి ఒక ప్రశ్నకు తావిస్తున్నది. అదనపు ఓట్లు వేయడం ఎలా జరిగింది? ఈ 85 సీట్లలో అత్యధిక స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుచుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎన్నికల సంఘం పేర్కొంది. యువజనులు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నందునే పోలింగ్‌ శాతం పెరిగిందని, ఇదొక సానుకూల పరిణామమని వ్యాఖ్యానించింది. కావచ్చు. అయితే ఈ సానుకూల పరిణామం కేవలం 12,000 పోలింగ్‌ కేంద్రాలకే పరిమితమయింది. మిగతా 88,000 కేంద్రాలలో ఇది సంభవించలేదు. ఈ సానుకూల పరిణామానికి ఒక నిదర్శనాధ్యయనం (కేస్‌ స్టడీ) కమ్థీ నియోజకవర్గాన్ని తీసుకుందాం.


2024 లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు 1.36 లక్షల ఓట్లు రాగా బీజేపీకి 1.19 లక్షల ఓట్లు లభించాయి. 2024 విధానసభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు 1.34 లక్షల ఓట్లు లభించాయి. లోక్‌సభ ఎన్నికలలో ఎన్ని ఓట్లువచ్చాయో విధానసభ ఎన్నికలలో ఇంచుమించు అదే సంఖ్యలో ఓట్లు లభించాయి. బీజేపీ సాధించిన ఓట్ల సంఖ్య 1.75 లక్షలు. లోక్‌సభ ఎన్నికలలో కంటే 56,000 ఓట్లు అధికంగా వచ్చాయి. లోక్‌సభ, విధానసభ ఎన్నికల మధ్య కాలంలో ఈ నియోజక వర్గంలో 35,000 మంది కొత్త ఓటర్లు అదనంగా నమోదయ్యారు. లోక్‌సభ ఎన్నికలలో ఓటువేయనివారు, 35 వేల మంది కొత్త ఓటర్లు అందరూ బీజేపీ పట్ల ఆకర్షితులయ్యారు. ప్రథమ పర్వం నుంచి చతుర్థ పర్వం దాకా చేపట్టిన చర్యల ఫలితంగా 2024 విధానసభ ఎన్నికలలో తాను పోటీ చేసిన 149 సీట్లలో 132ను బీజేపీ గెలుచుకున్నది విజయశాతం 89. విధానభ ఎన్నికలకు ఐదు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ సాధించిన విజయశాతం 32 మాత్రమే. పంచమ పర్వం– సాక్ష్యాధారాలు రద్దు చేయడం! మహారాష్ట్ర విధానసభ ఎన్నికలలో అక్రమాలు జరిగినట్టు ప్రతిపక్షాలు ఘోషించాయి. న్యాయం చేయాలని కోరాయి. ఎన్నికల సంఘం మౌనం వహించింది. ఫిర్యాదు చేసిన విపక్షాల పట్ల దురుసుగా కూడా వ్యవహరించింది. 2024 లోక్‌సభ, విధానసభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను ఓటర్ల ఫోటోలతో సహా అందుబాటులో ఉంచాలని అభ్యర్థించాయి. ఎన్నికల సంఘం ఈ విజ్ఞప్తులను వెన్వెంటనే త్రోసిపుచ్చింది. ఇంతకంటే ఘోరమైన విషయం మరొకటి ఉన్నది. విధానసభ ఎన్నికలు ముగిసిన నెల రోజుల అనంతరం ఒక పోలింగ్‌ కేంద్రంలో ఓటింగ్‌కు సంబంధించిన వీడియోలను, సీసీటీవీ ఫుటేజీని ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని సంప్రదించిన తరువాత 1961 నాటి ఎన్నికల నిర్వహణ నియమావళిలోని సెక్షన్‌ 93(2) (ఎ)ను సవరించింది. ఈ సవరణతో సీసీటీవీ ఫుటేజీ, ఎలక్ట్రానిక్‌ రికార్డుల అందుబాటును పరిమితం చేసింది.


ఇటీవల ఐడెంటికల్‌ / డూప్లికేట్‌ EPIC నంబర్లు బయటపడడంతో బోగస్‌ ఓటర్ల విషయమై ఆందోళన మరింత తీవ్రమయింది. ఇది, ఒక బృహత్‌ సమస్య సూచనప్రాయంగా వెల్లడి కావడమే. మహారాష్ట్ర విధానసభ ఎన్నికలలో రిగ్గింగ్‌కు అనుసరించిన వ్యూహాలు, పద్ధతులు, ప్రక్రియలు చాలా సంవత్సరాలుగా అమలవుతున్నాయనే అనుమానాలు పలువురిలో ఉన్నాయి. రికార్డులను పరీక్షిస్తే రిగ్గింగ్‌ కార్యప్రణాళిక, దానిని అమలుపరచడంలో భాగస్వాములు అయిన వారి వివరాలు తప్పక బహిర్గతమవుతాయి. అయితే ఆ రికార్డులను పరిశీలించేందుకు ప్రయత్నించిన ప్రతిపక్షాలు, చైతన్యశీలురు అయిన పౌరులను అడుగడుగునా అడ్డుకోవడం జరుగుతోంది. మహారాష్ట్ర విధానసభ ఎన్నికలలో రిగ్గింగ్‌ అంత భారీగా ఎందుకు జరిగిందన్నది ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. పాలక, ప్రతిపక్ష కూటముల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నది. విజయం అసాధ్యమేమోనని భయపడిన వారు ఎక్కడలేని తెంపరితనంతో అక్రమాలకు పాల్పడ్డారు. అయితే ఎన్నికలలో రిగ్గింగ్‌ క్రికెట్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ (పోటీని తారుమారు చేయడం) లాంటిదే. ఇటువంటి అక్రమాలకు పాల్పడినవారు ప్రజాస్వామిక సంస్థలకు ఎనలేని నష్టం చేస్తున్నారు. చక్కదిద్దలేని క్లిష్ట పరిస్థితులను కల్పిస్తున్నారు. ఎన్నికల ఫలితాలలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. ఇలా అయితే మన ప్రజాస్వామ్యం ఏమైపోను? రిగ్గింగ్‌తో ఎన్నికలలో గెలవడం ఏ ప్రజాస్వామ్య వ్యవస్థనూ దృఢతరం చేయదు.

-రాహుల్‌గాంధీ

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు

Updated Date - Jun 07 , 2025 | 01:03 AM